
మంగళగిరి: సినీనటుడు సూపర్‌స్టార్ కృష్ణకు మంగళగిరితో అనుబంధం మరుపురానిది. కృష్ణ చిన్నతనం నుంచే మంగళగిరిలో వేంచేసిఉన్న లక్ష్మీనృసింహస్వామి తిరునాళ్లకు ప్రతి ఏడాది తన స్నేహితులతో కలసి వచ్చి సరదాగా గడిపేవారు. ఈ నేపథ్యంలో నృసింహుని ఆలయం పక్కనేగల రమణమూర్తి నివాసం వద్ద ఇంటి ముందు అరుగులపై నిద్రించేవాడని రమణమూర్తి గుర్తుచేసుకున్నారు. సినిమాల్లో నటించడం ప్రారంభమైన తరువాత కూడా మంగళగిరిని మర్చిపోని కృష్ణ తన నాలుగు చిత్రాలకు సంబంధించి షూటింగ్ మంగళగిరిలో నిర్వహించారు.
సావాసగాళ్లు, పట్నవాసం, పల్నాటి సింహం, రక్త తర్పణం సినిమాల షూటింగ్ మంగళగిరి కేంద్రంగా ఎన్నో రోజులు జరిగింది. ఆలయ ఆవరణలో సావాసగాళ్లు, పల్నాటి సింహం సినిమాలకు సంబంధించిన పాటల చిత్రీకరణ జరిగింది. కృష్ణకు మంగళగిరికి చెందిన వీరాభిమానులు ఎంతో మంది ఉన్నారు. కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ పేరు మీద అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మంగళగిరికి చెందిన ఫేవరెట్ టైలర్ మహ్మద్‌అలీ కృష్ణకు బట్టలు కుట్టి అందించేవారు. కృష్ణ మృతి వార్తతో ఆయన అభిమానులు దిగ్భ్రాంతికి గురయ్యారు. కృష్ణ ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు పలువురు నివాళులరి్పంచేందుకు హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు.