‘అనర్హత’ తీర్పును అమలు చేయండి
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కేసుల్లో దోషులుగా తేలిన రోజు నుంచే పదవులకు అనర్హులవుతారని సుప్రీం కోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పును అమలు చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు ప్రారంభించింది. ‘సుప్రీం’ ఆదేశాన్ని అమలు చేయాలని అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. తీర్పు వచ్చిన తర్వాత దోషులుగా తేలి, జైలుశిక్ష, జరిమానా పడిన ఎంపీలు, ఎమ్మెల్యేలు నిబంధనల ప్రకారం తక్షణమే అనర్హులవుతారని, వారి సీటు ఖాళీ అవుతుందని స్పష్టం చేసింది.
అలాంటి వారు ఎవరైనా ఉంటే వారి పేర్లను తమకు పంపాలని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన పాలనాధికారులను ఆదేశించింది. రాష్ట్రంలోని అన్ని స్థాయిల కోర్టుల్లో దోషులుగా తేలే సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేల కేసుల వివరాలతో కూడిన నివేదికను ప్రతి నెలా 15 నాటికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వారా తమకు అందజేయాలని సూచించింది. ఈ కేసుల పర్యవేక్షణ కోసం సమర్థ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. ఇలాంటి కేసుల సమాచారాన్ని చట్టసభల అధిపతులకు(స్పీకర్/చైర్మన్), తమకు వెంటనే తెలియజేయడానికి ఈ యంత్రాంగం అవసరమని పేర్కొంది. ఇందులో అడ్వొకేట్ జనరల్/ప్రాసిక్యూషన్ డెరైక్టరేట్, తదితరాలను భాగం చేయాలని సూచించింది.