సాక్షి, తిరుపతి: జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్య రాజ్ విశాఖపట్నానికి బదిలీ కావడంతో, అధికార పార్టీకి చెందిన నాయకులు పంతం నెగ్గించుకోగలిగారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా పేరు పొందిన సాల్మన్ ఆరోగ్య రాజ్ పట్ల పలువురు కాంగ్రెసు నాయకులు గత కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. భూముల కేటాయింపుల్లో పట్టు బిగించడంతో, జిల్లాకు చెందిన మంత్రితో సహా, పలువు రు కాంగ్రెసు నేతలు కలెక్టర్‌పై ఫిర్యాదు చేశారు.
అయితే సీఎం కు సన్నిహితుడు కావడంతో ఆయన ఎటువంటి చర్యలు తీసుకోలేదని సమాచారం. రెండు నెలలుగా సాల్మన్ ఆరోగ్యరాజ్ బదిలీపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. అయితే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కొంత కాలంగా ఆగినా, బదిలీ ఖాయమని నెల రోజుల క్రితమే ‘సాక్షి’ తెలిపింది. అదే విధంగా సాల్మన్ ఆరోగ్యరాజ్‌ను విశాఖపట్నంకు బదిలీ చేస్తూ బుధవారం ఆదేశాలు అందాయి. సాల్మన్ ఆరోగ్యరాజ్ 2011 ఏప్రిల్‌లో జిల్లా కలెక్టరుగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన ముఖ్యమంత్రి నియోజకవర్గమైన పీలేరు అభివృద్ధిపైనే దృష్టి సారించారు.
పీలేరులో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాకు చెందిన నిధులన్నీ పీలేరు వైపు మళ్లాయని ప్రతిపక్షపార్టీలు కూడా ఆరోపించాయి. వచ్చిన కొత్తలో భూ కేటాయింపులు చేపట్టినా, ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని అరెస్టు చేసినప్పటి నుంచి అప్రమత్తమయ్యారు. జిల్లాలో సీఎం సోదరుడు కిషోర్‌కుమార్‌రె డ్డి మినహా మరొక రాజకీయ నాయకుడి మాట వినడని అధికార పార్టీ నాయకులు ఆరోపణలు చేశారు. కండలేరు నుంచి చిత్తూరు జిల్లాకు నీటి సరఫరా ప్రాజెక్టుకు సంబంధించిన పనులను చేపట్టేందుకు ఉత్సాహం చూపించారు.
దీనికిగాను రూ.187 కోట్లను ముఖ్యమంత్రి కార్యాలయం కేటాయించినా, ఆ నిధులను సీఎం ఆదేశాల మేరకు పీలేరు అభివృద్ధి కోసమే మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సీఎం నియోజకవర్గంలో మార్కెట్ యార్డులు, షాదీ మహల్‌తో పాటు, మార్కెట్ యార్డుల ముందు సీఎం తండ్రి అమరనాథరెడ్డి విగ్రహాల ఏర్పాట్లన్నీ కలెక్టరు హోదాలో దగ్గరుండి చూసుకున్నట్లు అధికార పార్టీ నాయకులే చర్చించుకుంటున్న విషయం తెలిసిందే. సీఎం ప్రతిష్టను కాపాడేందుకు అనుకున్న సమయానికి ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించే బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నారు.
నిజానికి ప్రపంచ తెలుగు మహాసభలను వర్షాల కారణంగా వాయిదా వేయాల్సి ఉన్నా, వెటర్నరీ కళాశాల ప్రాంగణానికి మార్చి, సీఎం పరువును నిలబెట్టినట్లు సీఎం అనుచరవర్గం అభినందనలు కూడా తెలియజేసింది. తెలుగు మహాసభలకు అనుకున్న బడ్జెట్టుకన్నా రెండింతల బడ్జెట్టును ఖర్చు చేసి దిగ్విజయంగా ముగించారు. సీఎం సన్నిహితుడు కావడంతోనే ఆయనను గ్రేటర్ విశాఖలాంటి పెద్ద జిల్లాకు బదిలీ చేసినట్లు సమాచారం.
కలెక్టర్ సాల్మన్ ఆరోగ్య రాజ్ విశాఖపట్నానికి బదిలీ
Published Thu, Aug 29 2013 2:23 AM | Last Updated on Mon, Aug 13 2018 4:01 PM
Advertisement
Advertisement