ఏలూరు :డెల్టా ఆధునికీకరణ పనులపై దృష్టి సారించి యుద్ధప్రాతిపదికన చేపట్టాలని నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదేశించారు. నీటి పారుదల ప్రాజెక్టుల పనులను పరుగులెత్తించాలని కోరారు. జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన జిల్లా నీటిపారుదల సల హా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాలువలకు జూన్ 10న నీటిని విడుదల చేయాలని సమావేశం నిర్ణయించింది. నీటిని విడుదల చేయడం వల్ల డెల్టా ఆధునికీకరణ పనులకు ఆటంకం కలిగే పరిస్థితులు ఉంటే అడ్డుకట్టలు వేయాలని తీర్మానిం చారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని మాట్లాడుతూ కాలువలకు నీటిని విడుదల చేసేలోగా ఎంతమేర ఆధునికీకరణ పనులు చేయగలిగితే అంతవరకు చేపట్టాలన్నారు.
పట్టిసీమ ఎత్తిపోతల పథకంతోపాటు చింతలపూడి, తాడిపూడి పథకాల పనులను పరుగులెత్తించాలని సూచించారు. రైతుల అవసరాలకు తగ్గట్టుగా పనులు పూర్తి చేయిస్తామని, ఇందుకు అవసరమైన నిధులు కూడా విడుదల చేయిస్తామని చెప్పారు. జిల్లాకు రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు అదనంగా నిధులు వెచ్చించేం దుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రాజెక్ట్‌లకు అవసరమైన భూసేకరణ, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు అంశాలపై కలెక్టర్, చీఫ్ ఇంజినీర్, ఎస్‌ఈ, ప్రజాప్రతినిధులు చర్చించుకోవాలని మంత్రి సూచించారు. నీరు- చెట్టు పథకంపై సమీక్షిస్తూ పనులు ప్రారంభించని 187 చెరువుల అభివృద్ధికి అవసరమైతే పొక్లెయిన్లు ఉపయోగించాలని కలెక్టర్ కె.భాస్కర్‌ను ఆదేశించారు.
ఇంజినీర్లూ.. పనితీరు మార్చుకోండి
నీటిపారుదల శాఖ ఇంజినీర్లు పనితీరు మార్చుకోవాలని, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ.. ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని మంత్రి కోరారు.
ఇంజినీర్లు ఏదైనా పని అప్పగిస్తే సకాలంలో పూర్తి చేయగలమన్న నమ్మకాన్ని కల్పిం చాలే తప్ప కుంటిసాకులు చెప్పి తప్పించుకోవడం తగద న్నారు. కృష్ణా కాలు పరిధిలో ఆధునికీకరణ పనుల విషయాన్ని మూడు నెలల క్రితం ప్రస్తావించినా ఇంతవరకు ఏ పనీ చేయలేదని ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ సమావేశం దృష్టికి తీసుకురాగా, మంత్రి తీవ్రంగా స్పందించారు. కుంటిసాకులతో కాలక్షేపం చేయొద్దని కృష్ణా కెనాల్ ఈఈ, డీఈ, ఏలూరు ఈఈపై మండిపడ్డారు. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లకన్నా సివిల్ ఇంజినీర్లకే ఎక్కువ వేతనాలు ఇస్తున్నా బ్రిటిష్ సంస్కృతిని అంటిపెట్టుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించటం తగదన్నారు. ఎమ్మెల్యేలు కూడా అధికారులను వెంటపెట్టుకుని వెళ్లాలని, మాట వినని అధికారులు ఎవరైనా ఉంటే తన దృష్టికి తీసుకువస్తే బదిలీ చేయిస్తానని అన్నారు. కచ్చితంగా పనిచేసే వారిని నెత్తిమీద పెట్టుకుని గౌరవిస్తామని పేర్కొన్నారు. కొద్దిరోజుల్లో ఇంజినీర్లకు పని సామర్థ్యం పెంపుపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు.
ప్రజాప్రతినిధులు ఏమన్నారంటే..
మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ యనమదుర్రు డ్రెయిన్, ఎర్ర కాలువ, గిరమ్మ చెరువు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరారు. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ చింతలపూడి, తాడిపూడి ఎత్తిపోతల పథకాల నిర్మాణాలను వేగవంతం చేయాలని కోరారు. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు ఇవ్వకపోవడంతో రైతులు తమను నిలదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ ఆధునికీకరణ పనులను వేగవంతం చేయాల న్నారు.
ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మాట్లాడుతూ నరసాపురం నియోజకవర్గంలో నీటి పారుదలకు చర్యలు తీసుకుంటే జిల్లా అంతా సుభి క్షంగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే కేఎస్ జవహర్ మాట్లాడుతూ కాకరపర్రు చానల్ అభివృద్ధి పనులకు చర్యలు తీసుకోవాలన్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ లస్కర్లు, ఏఈల కొరత తీర్చకపోతే నియోజకవర్గాల్లో సమస్యలు తలెత్తుతాయన్నారు. ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ గుండుగొలను నుంచి మల్లవరం వరకు 14 కిలోమీటర్ల కొల్లేరు ప్రాంతంలో మంచినీటి కాలువ తవ్వకానికి అటవీ శాఖ అధికారుల ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ ఏలూరు రైల్వే స్టేషన్ ప్రాంతంలో రోడ్డును వెడల్పు చేయాలని కోరారు.
తమ్మిలేరు రివిట్‌మెంట్‌తో పాటు ఏటిగట్టు అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో గ్రోయిన్స్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ ఇంజినీరింగ్ అధికారులు జవాబుదారీతనంతో పనిచేసి అన్నివర్గాల ప్రజలకు దగ్గర కావాలన్నారు. కలెక్టర్ కె.భాస్కర్ మాట్లాడుతూ కాలువల ఆధునికీకరణ పనులను జూన్ 10 నాటికి ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసి నిలుపుదల చేస్తామన్నారు. నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ హరిబాబు, ఎస్‌ఈ ఎన్.వెంకటరమణ, ఈఈ శ్రీనివాస్, సతీష్‌కుమార్, ఆర్డీవోలు డి.పుష్పమణి, బి.శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ జేడీ వై.సాయిలక్ష్మీశ్వరి పాల్గొన్నారు.
ఆధునికీకరణపై దృష్టి పెట్టండి
Published Tue, May 19 2015 2:17 AM | Last Updated on Sun, Sep 3 2017 2:17 AM
Advertisement
Advertisement