సాక్షి ప్రతినిధి, ఏలూరు : అక్రమార్జనకు.. అడ్డగోలు దోపిడీకి అడ్డాగా మారిన నీరు-చెట్టు పథకం గడువు ముగిసినా టీడీపీ నేతలు తవ్వకాలను ఇంకా కొనసాగిస్తున్నారు. అందినకాడికి దోచుకుంటూనే ఉన్నారు. ఈ పథకం కింద చెరువుల తవ్వకాల పనుల గడువు ఈ నెల 10వ తేదీతోనే ముగిసింది. సకాలంలో వర్షాలు పడుతుండటంతో నీరు-చెట్టు పనులను ముగించాలని నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదేశించారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కె.భాస్కర్ ఎట్టిపరిస్థితుల్లో తవ్వకాలను పదో తేదీకే నిలిపివేయాలని ఉత్తుర్వులు జారీ చేశారు. అయినా సరే.. అక్రమార్కులు తవ్వకాలను ఆపలేదు. ప్రజాప్రతినిధుల అండతో క్వారీల మాదిరిగా ఇష్టారాజ్యంగా చెరువుల తవ్వకాలు చేసేస్తున్నారు
కైకరంలో ఓ ప్రజాప్రతినిధి అండతో..
నీరు-చెట్టు పథకంలో భాగంగా ఉంగుటూరు మండలం కైకరంలో కొత్త చెరువును తవ్వేందుకు మే 3న భూమి పూజ చేశారు. సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువును అప్పటి నుంచి నేటివరకు నిబంధనలకు విరుద్ధంగా తవ్వుతూనే ఉన్నారు. ఓ ప్రజాప్రతినిధి అండదండలతో అడ్డూ అదుపూ లేకుండా నాలుగు పొక్లెయిన్లతో చెరువును తవ్వి గ్రావెల్‌ను విక్రయిస్తున్నారు. ట్రాక్టర్‌కు రూ.500 చొప్పున రేటుకట్టి నిత్యం వందలాది ట్రాక్టర్ల మట్టి, గ్రావెల్‌ను భీమవరం, కైకలూరు మండలాలకు తరలిస్తున్నారు.
70శాతం వాటా ఆ నేతకే
తవ్వకాలకు సంబంధించి ప్రభుత్వం కేటాయించిన నిధులతో పాటు మట్టి, గ్రావెల్ విక్రయాల్లో 70శాతం వరకు ఆ ప్రజాప్రతినిది వాటా తీసుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఈ చెరువు తవ్వకానికి ప్రభుత్వం సుమారు రూ.20 లక్షలు కేటాయించింది. నెల రోజులకుపైగా తవ్విన మట్టి, గ్రావెల్‌ను విక్రయిం చగా వచ్చిన కోట్లాది రూపాయలను సదరు నేత దండుకున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి నీరు-చెట్టు పథకంలో చెరువును తవ్వగా వచ్చిన మట్టితో గట్టును పటిష్ట పర్చాలి. మిగిలిన మట్టిని చుట్టుపక్కల రైతులకు ఉచితంగా అందజేయాలి. గ్రావెల్ వస్తే మైనింగ్ శాఖ అనుమతి తీసుకునిక్యూబిక్ మీటరుకు నిర్ధేశించిన మొత్తంలో సొమ్ము చెల్లించి తవ్వకాలు చేపట్టాలి. కానీ ఈ చెరువు తవ్వకాలకు సంబంధించి ఎక్కడా ఎవరి అనుమతి తీసుకోలేదు.
ప్రమాదం పొంచి ఉన్నా ఆగని తవ్వకాలు
నిబంధనలకు విరుద్ధంగా కొత్త చెరువు తవ్వకాలు ఎక్కువ లోతున సాగిస్తుండటంతో ప్రమాదం పొంచి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. చెరువు దగ్గరలోనే రైల్వే ట్రాక్ ఉండటంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులకు ఉప్పందించినా...
నిబంధనలకు విరుద్ధంగా చెరువు తవ్వుతున్నారని కైకరం గ్రామానికి చెందిన జుత్తుక పరమానందం ఆధ్వర్యంలో పలువురు ‘మీ కోసం’ కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. అయినా అధికారులు పట్టించుకోలేదు. తవ్వకాలకు సంబంధించి అవకతవకలు జరుగుతున్నాయని స్థానికులు ఉంగుటూరు తహసిల్దార్ ఆకుల కృష్ణ జ్యోతి దృష్టికి తీసుకువెళ్లగా.. ‘నాకు సంబంధం లేదు. మైనింగ్ అధికారులకు చెప్పండి’ అని సమాధానమిచ్చారు. దీనిపై మైనింగ్ ఏడీకి చిట్టిబాబుకు ‘సాక్షి’ ఫోన్ చేయగా, నీరు-చెట్టు కింద తవ్వకాలకు సీనరేజ్‌ను మినహాయించామని చెప్పుకొచ్చారు. గడువు ముగిసినా తవ్వకాలు చేస్తున్నా మీ పరిధిలోకి రాదా అని ప్రశ్నించగా.. ‘ఏమో మరి నాకు తెలీదు. ఇరిగేషన్ వాళ్లను అడగండి’ అని సమాధానమిచ్చారు.
పొద్దుపోయాక ఆపించాం
ఇదే విషయాన్ని ఏలూరు ఇరిగేషన్ డీఈ అప్పారావు దృష్టికి సాక్షి తీసుకువెళ్లగా.. ‘సాయంత్రం తర్వాతే నా దృష్టికి వచ్చింది. వెంటనే సిబ్బందిని పంపించి తవ్వకాలు నిలుపుదల చేయించాం. మరోసారి ఇలాంటివి పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటాం’ అని ఆయన స్పష్టం చేశారు.
తెగ తవ్వేస్తున్నారు
Published Thu, Jun 25 2015 2:58 AM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM
Advertisement
Advertisement