water supply project
-
ఆధునికీకరణపై దృష్టి పెట్టండి
ఏలూరు :డెల్టా ఆధునికీకరణ పనులపై దృష్టి సారించి యుద్ధప్రాతిపదికన చేపట్టాలని నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆదేశించారు. నీటి పారుదల ప్రాజెక్టుల పనులను పరుగులెత్తించాలని కోరారు. జెడ్పీ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన జిల్లా నీటిపారుదల సల హా మండలి సమావేశంలో ఆయన మాట్లాడారు. కాలువలకు జూన్ 10న నీటిని విడుదల చేయాలని సమావేశం నిర్ణయించింది. నీటిని విడుదల చేయడం వల్ల డెల్టా ఆధునికీకరణ పనులకు ఆటంకం కలిగే పరిస్థితులు ఉంటే అడ్డుకట్టలు వేయాలని తీర్మానిం చారు. ఈ సందర్భంగా మంత్రి దేవినేని మాట్లాడుతూ కాలువలకు నీటిని విడుదల చేసేలోగా ఎంతమేర ఆధునికీకరణ పనులు చేయగలిగితే అంతవరకు చేపట్టాలన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకంతోపాటు చింతలపూడి, తాడిపూడి పథకాల పనులను పరుగులెత్తించాలని సూచించారు. రైతుల అవసరాలకు తగ్గట్టుగా పనులు పూర్తి చేయిస్తామని, ఇందుకు అవసరమైన నిధులు కూడా విడుదల చేయిస్తామని చెప్పారు. జిల్లాకు రూ.50 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు అదనంగా నిధులు వెచ్చించేం దుకు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రాజెక్ట్‌లకు అవసరమైన భూసేకరణ, కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపు అంశాలపై కలెక్టర్, చీఫ్ ఇంజినీర్, ఎస్ఈ, ప్రజాప్రతినిధులు చర్చించుకోవాలని మంత్రి సూచించారు. నీరు- చెట్టు పథకంపై సమీక్షిస్తూ పనులు ప్రారంభించని 187 చెరువుల అభివృద్ధికి అవసరమైతే పొక్లెయిన్లు ఉపయోగించాలని కలెక్టర్ కె.భాస్కర్‌ను ఆదేశించారు. ఇంజినీర్లూ.. పనితీరు మార్చుకోండి నీటిపారుదల శాఖ ఇంజినీర్లు పనితీరు మార్చుకోవాలని, మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ.. ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని మంత్రి కోరారు. ఇంజినీర్లు ఏదైనా పని అప్పగిస్తే సకాలంలో పూర్తి చేయగలమన్న నమ్మకాన్ని కల్పిం చాలే తప్ప కుంటిసాకులు చెప్పి తప్పించుకోవడం తగద న్నారు. కృష్ణా కాలు పరిధిలో ఆధునికీకరణ పనుల విషయాన్ని మూడు నెలల క్రితం ప్రస్తావించినా ఇంతవరకు ఏ పనీ చేయలేదని ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ సమావేశం దృష్టికి తీసుకురాగా, మంత్రి తీవ్రంగా స్పందించారు. కుంటిసాకులతో కాలక్షేపం చేయొద్దని కృష్ణా కెనాల్ ఈఈ, డీఈ, ఏలూరు ఈఈపై మండిపడ్డారు. సాఫ్ట్వేర్ ఇంజినీర్లకన్నా సివిల్ ఇంజినీర్లకే ఎక్కువ వేతనాలు ఇస్తున్నా బ్రిటిష్ సంస్కృతిని అంటిపెట్టుకుని నిర్లక్ష్యంగా వ్యవహరించటం తగదన్నారు. ఎమ్మెల్యేలు కూడా అధికారులను వెంటపెట్టుకుని వెళ్లాలని, మాట వినని అధికారులు ఎవరైనా ఉంటే తన దృష్టికి తీసుకువస్తే బదిలీ చేయిస్తానని అన్నారు. కచ్చితంగా పనిచేసే వారిని నెత్తిమీద పెట్టుకుని గౌరవిస్తామని పేర్కొన్నారు. కొద్దిరోజుల్లో ఇంజినీర్లకు పని సామర్థ్యం పెంపుపై అవగాహన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. ప్రజాప్రతినిధులు ఏమన్నారంటే.. మంత్రి పీతల సుజాత మాట్లాడుతూ యనమదుర్రు డ్రెయిన్, ఎర్ర కాలువ, గిరమ్మ చెరువు అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని కోరారు. దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మాట్లాడుతూ చింతలపూడి, తాడిపూడి ఎత్తిపోతల పథకాల నిర్మాణాలను వేగవంతం చేయాలని కోరారు. జెడ్పీ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు మాట్లాడుతూ తాడిపూడి ఎత్తిపోతల పథకం ద్వారా నీళ్లు ఇవ్వకపోవడంతో రైతులు తమను నిలదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మాట్లాడుతూ ఆధునికీకరణ పనులను వేగవంతం చేయాల న్నారు. ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు మాట్లాడుతూ నరసాపురం నియోజకవర్గంలో నీటి పారుదలకు చర్యలు తీసుకుంటే జిల్లా అంతా సుభి క్షంగా ఉంటుందన్నారు. ఎమ్మెల్యే కేఎస్ జవహర్ మాట్లాడుతూ కాకరపర్రు చానల్ అభివృద్ధి పనులకు చర్యలు తీసుకోవాలన్నారు. తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాట్లాడుతూ లస్కర్లు, ఏఈల కొరత తీర్చకపోతే నియోజకవర్గాల్లో సమస్యలు తలెత్తుతాయన్నారు. ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ గుండుగొలను నుంచి మల్లవరం వరకు 14 కిలోమీటర్ల కొల్లేరు ప్రాంతంలో మంచినీటి కాలువ తవ్వకానికి అటవీ శాఖ అధికారుల ఇబ్బందులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి మాట్లాడుతూ ఏలూరు రైల్వే స్టేషన్ ప్రాంతంలో రోడ్డును వెడల్పు చేయాలని కోరారు. తమ్మిలేరు రివిట్‌మెంట్‌తో పాటు ఏటిగట్టు అభివృద్ధికి నిధులు ఇవ్వాలని కోరారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో గ్రోయిన్స్ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు మాట్లాడుతూ ఇంజినీరింగ్ అధికారులు జవాబుదారీతనంతో పనిచేసి అన్నివర్గాల ప్రజలకు దగ్గర కావాలన్నారు. కలెక్టర్ కె.భాస్కర్ మాట్లాడుతూ కాలువల ఆధునికీకరణ పనులను జూన్ 10 నాటికి ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసి నిలుపుదల చేస్తామన్నారు. నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ హరిబాబు, ఎస్ఈ ఎన్.వెంకటరమణ, ఈఈ శ్రీనివాస్, సతీష్‌కుమార్, ఆర్డీవోలు డి.పుష్పమణి, బి.శ్రీనివాసరావు, వ్యవసాయ శాఖ జేడీ వై.సాయిలక్ష్మీశ్వరి పాల్గొన్నారు. -
అన్నీ ఢిల్లీ గుప్పెట్లోనే !
రెండు రాష్ట్రాల అధికారాలూ అక్కడే.. నదీజలాల విషయంలో కేంద్రం అనుమతి తప్పనిసరి రాజధాని నిర్మాణానికి లక్షల కోట్లు ఉత్తిమాటే.. తెలంగాణలో పోలవరంకు భూసేకరణ కష్టమే సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో నదీ జలాల దగ్గర నుంచి ఉద్యోగుల వరకు అన్నీ కేంద్రం చేతిలోకి వెళ్లిపోయాయి. ప్రధానంగా నదీజలాల విషయంలో ప్రతిపాదిత రెండు రాష్ట్రాల చేతులను కట్టివేస్తూ ముసాయిదా బిల్లును కేంద్రం రూపొందించింది. కృష్ణా, గోదావరి జలాలపై కేంద్రం ఏర్పాటు చేసే బోర్డుల అనుమతి లేనిదే తెలంగాణ గానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గానీ ఒక్క చెక్ డ్యామ్ కూడా నిర్మించుకునే పరిస్థితి లేదు. ఆ అనుమతులు వచ్చేలోపే ఎగువ రాష్ట్రాలు మరిన్ని నిర్మాణాలు చేసుకుంటాయి. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ సహాయ, పునరావాసం, పర్యావరణ అనుమతులు అవసరమని మెలిక పెట్టారు. పోలవరం ముంపు ప్రాంతం తెలంగాణ లోని ఖమ్మం జిల్లాలో ఉంది. దాంతో ప్రాజెక్టు భూసేకరణకు తెలంగాణ రాష్ట్రం నుంచి అనుమతి రావడం ప్రశ్నార్థకమే. సమైక్యంగా ఉన్నప్పుడే పోలవరం ప్రాజెక్టుకు భూసేకరణ కష్టతరమైన విషయం తెలిసిందే. లెండి, జూరాల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ వ్యయాన్ని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినా.. ఆయా రాష్ట్రాలు ఆ మొత్తాన్ని ఇతర అవసరాలకు వినియోగించటం గమనార్హం. సీమాంధ్ర రాజధాని నిర్మాణం కోసం లక్షల కోట్ల రూపాయలు కేంద్ర సాయం అందిస్తుందని సీమాంధ్ర మంత్రులు, కేంద్రం చేసిన ప్రచారాలు, లీకులు అన్నీ బోగస్ అని తేలింది. రాజధాని నిర్మాణం కోసం కేవలం భవనాలకు, డెరైక్టరేట్ల నిర్మాణాలకు మాత్రమే కేంద్రం సాయం అందిస్తుందని ముసాయిదా బిల్లులో స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి భూ సేకరణ గురించి బిల్లులో ప్రస్తావనే లేదు. గతంలో ఏర్పాటైన జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల రాజధాని ఏర్పాటుకు కేంద్రం కేవలం రూ. 150 కోట్ల చొప్పున సాయం అందించింది. ఛత్తీస్‌గఢ్‌కు నక్సలైట్ల సమస్య కారణంగా రూ. 200 కోట్ల రూపాయలిచ్చింది. సీమాంధ్ర రాజధాని ఏర్పాటుకు కూడా కేవలం కొన్ని వందల కోట్ల రూపాయల సాయంతో కేంద్రం సరిపుచ్చే పరిస్థితి కనిపిస్తోంది. హైదరాబాద్ ఆస్తుల్లో సీమాంధ్రకు వాటా లేదు ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన నాటి నుంచి రాజధాని హైదరాబాద్‌లో అభివృద్ధి చేసిన అస్తుల్లో సీమాంధ్రకు ఎటువంటి వాటా, పరిహారం లేదు. ముసాయిదా బిల్లులో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సింగరేణిలో తెలంగాణకు 51 శాతం వాటా ఇస్తూ 49 శాతం వాటా కేంద్రానికి ఉంచుకుంది. సీమాంధ్రలోని గ్యాస్ విషయానికి వస్తే కేవలం రాయల్టీ మాత్రమే ఆ రాష్ట్రానికి ఇవ్వనున్నారు. ఎక్కడి ఆస్తులు అక్కడే ఉంటాయని కూడా బిల్లులో స్పష్టం చేశారు. పదవ షెడ్యూల్ కిందకు వచ్చే రాష్ట్రస్థాయిలో ఏర్పాటైన 42 శిక్షణ సంస్థలు, కేంద్రాలు హైదరాబాద్‌లోనే ఉంటాయని బిల్లులో స్పష్టం చేశారు. అలాగే 9వ షెడ్యూల్ కిందకు వచ్చే ఆర్టీసీ, పౌర సరఫరాల సంస్థ, ఆంధ్రప్రదేశ్ జెన్కో, ట్రాన్స్‌కో, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ, రాష్ట్ర బ్రూవరేజెస్ కార్పొరేషన్, రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థతో సహా మొత్తం 44 సంస్థలు తెలంగాణ రాష్ట్రానికే చెందుతాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఈ సంస్థలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. సచివాలయంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లోని ఫర్నిచర్, ఇతర సామాగ్రిని జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయనున్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులతో సహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పంపిణీ కూడా కేంద్ర ప్రభుత్వమే చేయనుంది. ఖమ్మం జిల్లాలో సమగ్ర స్టీల్ ప్రాజెక్టు ఏర్పాటు, విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల విస్తరణ సాధ్యాసాధ్యాలు, తెలంగాణలో ఎన్టీపీసీ ద్వారా 4,000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు, సీమాంధ్రలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు.. వీటన్నింటిని కేంద్రం పరిశీలిస్తుందని బిల్లులో పేర్కొన్నారు. ఆఖరికి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్రస్థాయి సంస్థలతో పాటు హైకోర్టును కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పాటు చేసుకోవాలని బిల్లులో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని కూడా కేంద్ర ప్రభుత్వం నియుమించబోయే నిపుణుల కమిటీయే నిర్ణయిస్తుంది. రాష్ట్రం వెలుపల ఉన్న ప్రభుత్వ ఆస్తుల విషయంపై కూడా కేంద్రమే నిర్ణయం తీసుకోనుంది. ఏపీ భవన్ కేంద్రం చేతిలోనే.. రాష్ట్ర విభజన అనంతరం.. ఢిల్లీలోని ఏపీ భవన్ కూడా కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలోకే వెళ్లిపోనుంది. కేబినెట్ ఆమోదం తెలిపిన ముసాయిదా ప్రకారం రాష్ట్రానికి అవతల ఉన్న రాష్ట్ర ఆస్తులు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లిపోతాయి. అందులో ఏపీ భవన్ ఒకటి. -
కలెక్టర్ సాల్మన్ ఆరోగ్య రాజ్ విశాఖపట్నానికి బదిలీ
సాక్షి, తిరుపతి: జిల్లా కలెక్టర్ సాల్మన్ ఆరోగ్య రాజ్ విశాఖపట్నానికి బదిలీ కావడంతో, అధికార పార్టీకి చెందిన నాయకులు పంతం నెగ్గించుకోగలిగారు. ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డికి అత్యంత సన్నిహితుడుగా పేరు పొందిన సాల్మన్ ఆరోగ్య రాజ్ పట్ల పలువురు కాంగ్రెసు నాయకులు గత కొంత కాలంగా అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే. భూముల కేటాయింపుల్లో పట్టు బిగించడంతో, జిల్లాకు చెందిన మంత్రితో సహా, పలువు రు కాంగ్రెసు నేతలు కలెక్టర్‌పై ఫిర్యాదు చేశారు. అయితే సీఎం కు సన్నిహితుడు కావడంతో ఆయన ఎటువంటి చర్యలు తీసుకోలేదని సమాచారం. రెండు నెలలుగా సాల్మన్ ఆరోగ్యరాజ్ బదిలీపై ఒత్తిడి పెంచినట్లు సమాచారం. అయితే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కొంత కాలంగా ఆగినా, బదిలీ ఖాయమని నెల రోజుల క్రితమే ‘సాక్షి’ తెలిపింది. అదే విధంగా సాల్మన్ ఆరోగ్యరాజ్‌ను విశాఖపట్నంకు బదిలీ చేస్తూ బుధవారం ఆదేశాలు అందాయి. సాల్మన్ ఆరోగ్యరాజ్ 2011 ఏప్రిల్‌లో జిల్లా కలెక్టరుగా పదవీ బాధ్యతలు చేపట్టారు. అప్పటి నుంచి ఆయన ముఖ్యమంత్రి నియోజకవర్గమైన పీలేరు అభివృద్ధిపైనే దృష్టి సారించారు. పీలేరులో దాదాపు వెయ్యి కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. జిల్లాకు చెందిన నిధులన్నీ పీలేరు వైపు మళ్లాయని ప్రతిపక్షపార్టీలు కూడా ఆరోపించాయి. వచ్చిన కొత్తలో భూ కేటాయింపులు చేపట్టినా, ఓఎంసీ కేసులో ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మిని అరెస్టు చేసినప్పటి నుంచి అప్రమత్తమయ్యారు. జిల్లాలో సీఎం సోదరుడు కిషోర్కుమార్రె డ్డి మినహా మరొక రాజకీయ నాయకుడి మాట వినడని అధికార పార్టీ నాయకులు ఆరోపణలు చేశారు. కండలేరు నుంచి చిత్తూరు జిల్లాకు నీటి సరఫరా ప్రాజెక్టుకు సంబంధించిన పనులను చేపట్టేందుకు ఉత్సాహం చూపించారు. దీనికిగాను రూ.187 కోట్లను ముఖ్యమంత్రి కార్యాలయం కేటాయించినా, ఆ నిధులను సీఎం ఆదేశాల మేరకు పీలేరు అభివృద్ధి కోసమే మళ్లించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సీఎం నియోజకవర్గంలో మార్కెట్ యార్డులు, షాదీ మహల్‌తో పాటు, మార్కెట్ యార్డుల ముందు సీఎం తండ్రి అమరనాథరెడ్డి విగ్రహాల ఏర్పాట్లన్నీ కలెక్టరు హోదాలో దగ్గరుండి చూసుకున్నట్లు అధికార పార్టీ నాయకులే చర్చించుకుంటున్న విషయం తెలిసిందే. సీఎం ప్రతిష్టను కాపాడేందుకు అనుకున్న సమయానికి ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించే బాధ్యతను తన భుజాల మీద వేసుకున్నారు. నిజానికి ప్రపంచ తెలుగు మహాసభలను వర్షాల కారణంగా వాయిదా వేయాల్సి ఉన్నా, వెటర్నరీ కళాశాల ప్రాంగణానికి మార్చి, సీఎం పరువును నిలబెట్టినట్లు సీఎం అనుచరవర్గం అభినందనలు కూడా తెలియజేసింది. తెలుగు మహాసభలకు అనుకున్న బడ్జెట్టుకన్నా రెండింతల బడ్జెట్టును ఖర్చు చేసి దిగ్విజయంగా ముగించారు. సీఎం సన్నిహితుడు కావడంతోనే ఆయనను గ్రేటర్ విశాఖలాంటి పెద్ద జిల్లాకు బదిలీ చేసినట్లు సమాచారం.