అన్నీ ఢిల్లీ గుప్పెట్లోనే !
రెండు రాష్ట్రాల అధికారాలూ అక్కడే.. నదీజలాల విషయంలో కేంద్రం అనుమతి తప్పనిసరి
రాజధాని నిర్మాణానికి లక్షల కోట్లు ఉత్తిమాటే.. తెలంగాణలో పోలవరంకు భూసేకరణ కష్టమే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో నదీ జలాల దగ్గర నుంచి ఉద్యోగుల వరకు అన్నీ కేంద్రం చేతిలోకి వెళ్లిపోయాయి. ప్రధానంగా నదీజలాల విషయంలో ప్రతిపాదిత రెండు రాష్ట్రాల చేతులను కట్టివేస్తూ ముసాయిదా బిల్లును కేంద్రం రూపొందించింది. కృష్ణా, గోదావరి జలాలపై కేంద్రం ఏర్పాటు చేసే బోర్డుల అనుమతి లేనిదే తెలంగాణ గానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గానీ ఒక్క చెక్ డ్యామ్ కూడా నిర్మించుకునే పరిస్థితి లేదు. ఆ అనుమతులు వచ్చేలోపే ఎగువ రాష్ట్రాలు మరిన్ని నిర్మాణాలు చేసుకుంటాయి.
పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించినప్పటికీ సహాయ, పునరావాసం, పర్యావరణ అనుమతులు అవసరమని మెలిక పెట్టారు. పోలవరం ముంపు ప్రాంతం తెలంగాణ లోని ఖమ్మం జిల్లాలో ఉంది. దాంతో ప్రాజెక్టు భూసేకరణకు తెలంగాణ రాష్ట్రం నుంచి అనుమతి రావడం ప్రశ్నార్థకమే. సమైక్యంగా ఉన్నప్పుడే పోలవరం ప్రాజెక్టుకు భూసేకరణ కష్టతరమైన విషయం తెలిసిందే. లెండి, జూరాల ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ వ్యయాన్ని మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించినా.. ఆయా రాష్ట్రాలు ఆ మొత్తాన్ని ఇతర అవసరాలకు వినియోగించటం గమనార్హం.
సీమాంధ్ర రాజధాని నిర్మాణం కోసం లక్షల కోట్ల రూపాయలు కేంద్ర సాయం అందిస్తుందని సీమాంధ్ర మంత్రులు, కేంద్రం చేసిన ప్రచారాలు, లీకులు అన్నీ బోగస్ అని తేలింది. రాజధాని నిర్మాణం కోసం కేవలం భవనాలకు, డెరైక్టరేట్‌ల నిర్మాణాలకు మాత్రమే కేంద్రం సాయం అందిస్తుందని ముసాయిదా బిల్లులో స్పష్టం చేశారు. రాజధాని నిర్మాణానికి భూ సేకరణ గురించి బిల్లులో ప్రస్తావనే లేదు. గతంలో ఏర్పాటైన జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల రాజధాని ఏర్పాటుకు కేంద్రం కేవలం రూ. 150 కోట్ల చొప్పున సాయం అందించింది. ఛత్తీస్‌గఢ్‌కు నక్సలైట్ల సమస్య కారణంగా రూ. 200 కోట్ల రూపాయలిచ్చింది. సీమాంధ్ర రాజధాని ఏర్పాటుకు కూడా కేవలం కొన్ని వందల కోట్ల రూపాయల సాయంతో కేంద్రం సరిపుచ్చే పరిస్థితి కనిపిస్తోంది.
హైదరాబాద్ ఆస్తుల్లో సీమాంధ్రకు వాటా లేదు
ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన నాటి నుంచి రాజధాని హైదరాబాద్‌లో అభివృద్ధి చేసిన అస్తుల్లో సీమాంధ్రకు ఎటువంటి వాటా, పరిహారం లేదు. ముసాయిదా బిల్లులో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. సింగరేణిలో తెలంగాణకు 51 శాతం వాటా ఇస్తూ 49 శాతం వాటా కేంద్రానికి ఉంచుకుంది. సీమాంధ్రలోని గ్యాస్ విషయానికి వస్తే కేవలం రాయల్టీ మాత్రమే ఆ రాష్ట్రానికి ఇవ్వనున్నారు. ఎక్కడి ఆస్తులు అక్కడే ఉంటాయని కూడా బిల్లులో స్పష్టం చేశారు. పదవ షెడ్యూల్ కిందకు వచ్చే రాష్ట్రస్థాయిలో ఏర్పాటైన 42 శిక్షణ సంస్థలు, కేంద్రాలు హైదరాబాద్‌లోనే ఉంటాయని బిల్లులో స్పష్టం చేశారు. అలాగే 9వ షెడ్యూల్ కిందకు వచ్చే ఆర్టీసీ, పౌర సరఫరాల సంస్థ, ఆంధ్రప్రదేశ్ జెన్‌కో, ట్రాన్స్‌కో, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ, రాష్ట్ర బ్రూవరేజెస్ కార్పొరేషన్, రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థతో సహా మొత్తం 44 సంస్థలు తెలంగాణ రాష్ట్రానికే చెందుతాయని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఈ సంస్థలను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. సచివాలయంతో పాటు వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లోని ఫర్నిచర్, ఇతర సామాగ్రిని జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయనున్నారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారులతో సహా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పంపిణీ కూడా కేంద్ర ప్రభుత్వమే చేయనుంది.
ఖమ్మం జిల్లాలో సమగ్ర స్టీల్ ప్రాజెక్టు ఏర్పాటు, విశాఖపట్టణం, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాల విస్తరణ సాధ్యాసాధ్యాలు, తెలంగాణలో ఎన్‌టీపీసీ ద్వారా 4,000 మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు, సీమాంధ్రలో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు.. వీటన్నింటిని కేంద్రం పరిశీలిస్తుందని బిల్లులో పేర్కొన్నారు. ఆఖరికి ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న రాష్ట్రస్థాయి సంస్థలతో పాటు హైకోర్టును కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా ఏర్పాటు చేసుకోవాలని బిల్లులో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిని కూడా కేంద్ర ప్రభుత్వం నియుమించబోయే నిపుణుల కమిటీయే నిర్ణయిస్తుంది. రాష్ట్రం వెలుపల ఉన్న ప్రభుత్వ ఆస్తుల విషయంపై కూడా కేంద్రమే నిర్ణయం తీసుకోనుంది.
ఏపీ భవన్ కేంద్రం చేతిలోనే..
రాష్ట్ర విభజన అనంతరం.. ఢిల్లీలోని ఏపీ భవన్ కూడా కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలోకే వెళ్లిపోనుంది. కేబినెట్ ఆమోదం తెలిపిన ముసాయిదా ప్రకారం రాష్ట్రానికి అవతల ఉన్న రాష్ట్ర ఆస్తులు కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్లిపోతాయి. అందులో ఏపీ భవన్ ఒకటి.