అసెంబ్లీ పరిశీలనకు మాత్రమే బిల్లు!
విభజనపై ఆర్టికల్ 3 ప్రకారం కేంద్రానిదే పూర్తి అధికారం
సాక్షి, హైదరాబాద్: కొత్త రాష్ట్రాల ఏర్పాటు లేదా రాష్ట్రాల విభజనకు సంబంధించి ఆయా రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలకు ఎటువంటి నిర్ణయాధికారమూ లేదని రాజ్యాంగంలోని 3వ అధికరణ స్పష్టం చేస్తోంది. ఈ విషయంలో నిర్ణయాధికారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం లేదా పార్లమెంటు పరిధికి లోబడే ఉంటుంది. ఈ అధికరణ ప్రకారం.. రాష్ట్ర విభజనకు సంబంధించిన తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించే అవకాశం ఎక్కడా లేదు. విభజనపై కేంద్ర ప్రభుత్వం రూపొందించి పంపే ముసాయిదా బిల్లు మాత్రమే రాష్ట్రపతి ద్వారా అసెంబ్లీ పరిశీలనకు వస్తుంది. అసెంబ్లీ అభిప్రాయంతో నిమిత్తం లేకుండా విభజనపై పార్లమెంటే తుది నిర్ణయం తీసుకుంటుంది. అయితే, ఏదైనా రాష్ట్రం నుంచి తమ రాష్ట్రాన్ని విభజించాలని లేదా తమ రాష్ట్రాలను విలీనం చేసి ఒకే రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు కేంద్రానికి ప్రతిపాదించి, తమ అభీష్టాన్ని నెరవేర్చుకున్న సందర్భాలున్నాయి. అటువంటి సందర్భాల్లో ఆ రాష్ట్ర అసెంబ్లీలు విభజనకు లేదా విలీనానికి సంసిద్ధత తెలుపుతూ తీర్మానం ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపే సంప్రదాయం కూడా లేకపోలేదు. ఇది కేవలం సంప్రదాయమే. ఇటువంటి తీర్మానానికి ఎటువంటి రాజ్యాంగబద్ధతా లేదు.
కొన్ని ఏళ్ల క్రితం జార్ఖండ్, చత్తీస్‌ఘఢ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఈ సంప్రదాయం ప్రకారం ఏర్పాటైనవే. స్వాతంత్య్రానంతరం ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల విలీనం జరిగి ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడు కూడా ఇటు ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీలో, అటు హైదరాబాద్ రాష్ట్ర అసెంబ్లీలోనూ.. విలీనానికి సంసిద్ధత తెలియజేస్తూ ఈ సంప్రదాయం ప్రకారమే తీర్మానాలు చేశారు. మహారాష్ట్ర నుంచి విదర్భను వేరుచేసి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని, ఉత్తరప్రదేశ్‌ను 4 రాష్ట్రాలుగా విభజించమని కోరుతూ ఆయా రాష్ట్రాల అసెంబ్లీలు తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపి ఏళ్లు గడచిపోతున్నాయి. అయినప్పటికీ, ఈ తీర్మానాలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకూ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అసెంబ్లీకి తెలంగాణ విభజన తీర్మానం రెండుసార్లు వస్తుందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పదే పదే నమ్మబలుకుతున్నారు. అయితే, రాజ్యాంగంలోని 3వ అధికరణం ప్రకారం వీరి మాటలకు ఎటువంటి హేతుబద్ధతా లేదన్నది గమనించదగిన విషయం.
ఇంతకీ 3వ అధికరణ ఏం చెబుతోందంటే..?
కొత్త రాష్ట్రాల ఏర్పాటు, ప్రస్తుత రాష్ట్రాల్లో ప్రాంతాల, సరిహద్దుల, పేర్ల మార్పులను పార్లమెంటు చట్టం ద్వారానే చేయాలి. ఎ. ప్రస్తుతం ఉన్న రాష్ట్రాన్ని విభజించి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం, ఉన్న రెండు, మూడు రాష్ట్రాలను కలిపి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం, రాష్ట్రంలోని ప్రాంతాలను కలిపి కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం. బి. రాష్ట్ర విస్తీర్ణాన్ని పెంచడం. సి. రాష్ట్ర విస్తీర్ణాన్ని తగ్గించడం. డి. రాష్ట్ర సరిహద్దులను మార్చడం. ఈ. రాష్ట్రం పేరు మార్చాలంటే... రాష్ట్రపతి సిఫారసు ఆధారంగా పార్లమెంటులో బిల్లు పెట్టాలి. బిల్లు ప్రభావం రాష్ట్రంలోని ఏదైనా ప్రాంతం, సరిహద్దులు, పేరు మార్పులపై ఉంటే బిల్లును ఆ రాష్ట్ర శాసనసభకు, రాష్ట్రపతికి పంపి, నిర్దిష్ట గడువులోగా అభిప్రాయాలు కోరవచ్చు.