సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నానని చెప్తూ వస్తున్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిని ఇంతవరకు వెనకేసుకొచ్చిన కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దిగ్విజయ్‌సింగ్ స్వరం మార్చారు. సీఎం వ్యవహార శైలిపై తొలిసారి తీవ్ర స్వరంతో స్పందించారు. విభజనపై తలెత్తే సమస్యలను మాత్రమే సీఎం ప్రస్తావిస్తున్నారని చెప్తూ వచ్చిన దిగ్విజయ్ శుక్రవారం అందుకు విరుద్ధంగా మాట్లాడారు. ‘‘విభజన అసంబద్ధం అంటున్న కిరణ్.. సీడబ్ల్యుసీ తీర్మానం చేయటానికి ముందు ఈ అంశాన్ని అధిష్టానం పెద్దల ముందు ఎందుకు బలంగా చెప్పలేకపోయారు? సీమాంధ్ర సీనియర్ నేతలు ఇదే అంశాన్ని ఎందుకు ప్రభావవంతంగా అధిష్టానం పెద్దల ముందు లేవనెత్తలేదు, తెలంగాణపై చర్చలు జరిగిన సందర్భంలో, అఖిలపక్ష సమావేశంలో నిర్ణయం చేసే సందర్భంలోనూ వారు గట్టిగా ఎందుకు చెప్పలేదు? విభజనపై నిర్ణయం చేయటానికి ముందు చెప్పాల్సిన అంశాలను నిర్ణయం జరిగాక చెప్తున్నారు’’ అంటూ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ విభజన భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు స్ఫూర్తికి విరుద్ధంగా ఉందని సీఎం చేసిన వ్యాఖ్యలను శుక్రవారం ఢిల్లీలో దిగ్విజయ్ వద్ద ప్రస్తావించగా ఆయన పై విధంగా స్పందించారు. విభజన బిల్లును చెత్తబుట్టలో పడేయాలన్న సీఎం, సీమాంధ్ర నేతల వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు.
విభజన విషయంలో సీమాంధ్రుల వాదనలను పట్టించుకోవటం లేదనే విమర్శలు వస్తున్నాయని ప్రస్తావించగా.. ‘‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాం. ఇదే సమయంలో సీమాంధ్ర సమస్యలను పరిష్కరించేందుకు అన్ని విధాలా సిద్ధంగా ఉన్నాం. హైదరాబాద్‌లో నివసిస్తున్న సీమాంధ్రులకు పూర్తి అండగా నిలుస్తాం. వారికి తగిన రక్షణ కల్పిస్తాం. వచ్చే పదేళ్లలో నియామకాలు, కళాశాలల్లో ప్రవేశాల్లో రక్షణగా ఉంటాం’’ అని దిగ్విజయ్ బదులిచ్చారు. విభజనకు న్యాయపరమైన చిక్కులు ఉన్నాయనే వాదనల గురించి ప్రశ్నించగా.. ‘‘ఏం జరుగుతుందో చూద్దాం’’ అని స్పందించారు. రాష్ట్రం నుంచి రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థుల విషయాన్ని ప్రస్తావించగా.. ‘‘నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఎంతమంది బరిలో నిలుస్తారో చూశాక మా వ్యూహం ఖరారు చేస్తాం’’ అని పేర్కొన్నారు. ఇదిలావుంటే.. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన దిగ్విజయ్‌సింగ్‌కు రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు జె.డి.శీలం, చిరంజీవి, ఏఐసీసీ సభ్యుడు గూడూరు నారాయణరెడ్డి తదితర నేతలు శుభాకాంక్షలు తెలిపారు.
బలంగా చెప్పలేదేం?: దిగ్విజయ్ సింగ్
Published Sat, Feb 1 2014 2:21 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement