విభజనకు నేను ముమ్మాటికీ వ్యతిరేకమే: కిరణ్
రాష్ట్ర విభజనకు తాను ముమ్మాటికీ వ్యతిరేకమేనన్న స్వరాన్ని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మరోసారి వినిపించారు. విభజనకు తాను అంగీకరించానంటూ దిగ్విజయ్ సింగ్ చెప్పిన మాటలు ఆయన వ్యక్తిగతమేనని అన్నారు. విభజన విషయంలో తన వైఖరి ముమ్మాటికీ మారలేదని కుండ బద్దలుకొట్టారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణకే ఎక్కువ సమస్యలుంటాయని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో విలేకరులతో కిరణ్ మాట్లాడారు. తాను తెలంగాణ ప్రాంత ప్రజల మనోభావాలను ఎక్కడా కించపరచలేదని తెలిపారు.
ప్రాజెక్టులు ఒక రాష్ట్రంలో ఉండి, వాటి పరిధిలో ఉండే భూములు వేరే రాష్ట్రంలో ఉంటే చాలా సమస్యలు ఉంటాయని, అలాగే ఉద్యోగులకు సంబంధించి కూడా చాలా సమస్యలు వస్తాయని అన్నారు. రాజ్యాంగంలోని 371 డి అధికరణ ఉందని, అలాగే విద్య, ఉపాధి అవకాశాలకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తుతాయని చెప్పారు. ఇక హైదరాబాద్ చుట్టుపక్కల నివసించే వారి సమస్యలు కూడా చాలా ఉంటాయని ఆయన అన్నారు. వీటన్నింటినీ పరిష్కరించిన తర్వాతే రాష్ట్ర విభజన గురించిన ఆలోచన చేయాలని తాను కాంగ్రెస్ అధిష్ఠానం పెద్దలకు సూచించినట్లు తెలిపారు.