విచ్ఛిన్నానికే రెచ్చగొట్టుడు: ఎం.కోదండరాం
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర నాయకులు చేస్తున్న రెచ్చగొట్టే ప్రకటనలన్నీ తెలంగాణ ఏర్పాటును విచ్ఛిన్నం చేసే కుట్రలేనని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద తెలంగాణ జేఏసీ ‘సద్భావనాదీక్షలు’ ప్రారంభ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణపై కేంద్రం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పిన రాజకీయపార్టీలన్నీ ఇప్పుడు మాటమారుస్తున్నాయని విమర్శించారు.
విభజనపై నిర్ణయం వెలువడిన తరువాత సీమాంధ్రలో కృత్రిమ ఉద్యమాన్ని ప్రోత్సహిస్తున్నారని అన్నారు. విభజనకు సహకరించి, శాంతిని కాపాడాలని కోరుతూ సద్భావనా దీక్షలు చేపడుతున్నట్టు చెప్పారు. తెలంగాణ ఏర్పడితే హైదరాబాద్ వదిలి పోవాల్సి వస్తుం దని, ఆంధ్రాకు నీళ్లు రావని తప్పుడు ప్రచారానికి పాల్పడుతూ ఇరుప్రాంతాల మధ్య స్వచ్ఛతను చెడగొడుతున్నారని చెప్పారు. తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలు మరింత సంయమనం పాటించి శాంతిని కాపాడాలని కోదండరాం పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా కోదండరాం ప్రవేశపెట్టిన పది జిల్లాలతో కూడిన తెలంగాణ మాత్రమే ఇవ్వాలని, ప్రత్యేక రాష్ట్రానికి హైదరాబాద్‌నే రాజధానిగా ఉంచాలని, పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లును వెంటనే ఆమోదించాలనే మూడు తీర్మానాలను దీక్షకు హాజరైన వారు ఆమోదిస్తున్నట్టు ప్రకటించారు. వీటిని కేంద్రప్రభుత్వానికి పంపుతామని కోదండరాం తెలిపారు. మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య మాట్లాడుతూ హైదరాబాద్ లేని తెలంగాణ తలలేని మొండెం లాంటిదేనని వ్యాఖ్యానించారు.
తెలంగాణ భౌగోళికంగా ఏర్పాటయ్యేదాకా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కే, తారకరామారావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కాకముందే కిరణ్‌కుమార్‌రెడ్డికి హోటళ్ల వ్యాపారం ఉందని, ఆయన తెలంగాణలో కర్రీస్ పాయింట్ పెట్టుకుంటే అభ్యంతరం లేదని కేసీఆర్ చేసిన వ్యాఖ్యల్లో తప్పేమిటని ప్రశ్నించారు. చంద్రశేఖరరావు తనకు తెలిసిన వ్యవసాయం చేసుకుంటున్నారని, చంద్రబాబు పాలు, పెరుగు అమ్ముకుంటున్నాడని చెప్పారు. ఎవరికి ఎందులో అనుభవం ఉంటే ఆ పని చేసుకోవడంలో తప్పులేదని చెప్పారు. ప్రజల ఆమోదం లేకుండా సీల్డ్‌కవర్‌లో సీఎం అయిన కిరణ్ వారి నెత్తిపై కూర్చుని సవారీ చేస్తున్నారని ధ్వజమెత్తారు.
బహిరంగ చర్చకు రావాలంటూ కేసీఆర్ సవాల్ చేస్తే పారిపోయిన అసమర్థుడు, దద్దమ్మ కిరణ్‌కుమార్‌రెడ్డి అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఆంధ్రాను ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో దాచుకుని హైదరాబాద్‌ను మాత్రం జాయింట్ అకౌంట్‌లో వేయాలంటున్నారు ఇదెక్కడి న్యాయమంటూ బీజేపీ సీనియర్ నాయకుడు సీహెచ్ విద్యాసాగర్‌రావు ప్రశ్నించారు. హైదరాబాద్‌పై కన్నేసిన సీమాంధ్ర పెట్టుబడిదారులు, నాయకులే ఈ కుట్రలకు పాల్పడుతున్నారని విమర్శించారు.
రాజ్యాంగంలోని 7వ షెడ్యూల్ ప్రకారం పోలీస్ వ్యవస్థ రాష్ట్రానికి సంబంధించిన అంశమని, హైదరాబాద్‌లో భద్రంగా ఉన్న సీమాంధ్రులు అభద్రత గురించి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ టీడీపీ నాయకులతో చంద్రబాబు ఆడిస్తున్న డ్రామాలను తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. న్యూడెమోక్రసీ నేతలు పి.సూర్యం, కె.గోవర్దన్, జేఏసీ నేతలు దేవీప్రసాద్, వి.శ్రీనివాస్‌గౌడ్, సి.విఠల్, అద్దంకి దయాకర్, జైఆంధ్రా జేఏసీ ఛైర్మన్ ఎల్. జయబాబు ప్రసంగించారు.