వర్షంలో ట్యాంక్‌బండ్ అందాలు మధుర జ్ఞాపకం..
పచ్చని చెట్లు.. అందమైన సాయంత్రం.. సాగర్ గట్టున దోస్తులతో ముచ్చట్లు.. మేధో చర్చలు.. ఇరానీ హోటళ్లు అడ్డాలు.. డబుల్ డెక్కర్ బస్సులపై గెంతులేస్తూ ప్రయాణం.. నగరం అంటే హైదరాబాదే అన్నట్టు. ఇప్పుడు ఆ అందాల నగరం కనిపించడం లేదంటున్నారు తెలంగాణ ఉద్యమ ఉద్దండుడు, రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ముద్దసాని కోదండరాం. నగరంతో ఆయన అనుబంధం విడదీయరానిది. ఆనాటి ‘జ్ఞాపకాల’ను ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు. - సాక్షి, సిటీబ్యూరో
అనుబంధం
‘1972లో అనుకుంటా మెదటిసారి హైదరాబాద్ వచ్చాను. నాంపల్లి స్టేషన్ దగ్గర నాన్నతో కలిసి ఓ హోటల్‌లో దిగాను. హైదరాబాద్‌లో ఎగ్జిబిషన్ గురించి వినడమే గానీ అంతవరకు చూడలేదు. మొదటిసారి ఎగ్జిబిషన్ చూశాను. ఎంత ఆనందమేసిందో. తర్వాత మళ్లీ 1975లో ఓయూలో ఎంఏ పొలిటికల్ సైన్స్ చేరాను. రెండు సంవత్సరాలు ఇక్కడే ఉండిపోయాను. ఆ తర్వాత ఢిల్లీకి ఎంఫిల్ చేరేందుకు వెళ్లాను. 1980లో తిరిగి వెనక్కి వచ్చాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు హైదరాబాద్ చుట్టూనే నా జీవితం. హైదరాబాద్ నగరాన్ని పరిచయం చేసింది తరగతుల్లోని సీనియర్లే. నగరమంతా తిప్పేవారు. ఒక్కొక్కరు ఒక్కో అంశంలో నిష్ణాతులు. ఇది తెలియదు అనే బాధ ఉండేది కాదు. హైదరాబాద్ నగరం విజ్ఞాన గనిగా ఉండేది. ప్రాణమిచ్చే స్నేహితులు ఉండేవారు. చాలా మంచి విషయాలు చెప్పేవారు.
ఒక్కో గ్రూప్‌కు ఒక్కో అడ్డా..
అప్పట్లో మిత్రుల్లో భావజాలం ఆధారంగా గ్రూపులుండేవి. ఒక్కో గ్రూప్‌కు ఒక్కో సెంటర్ అడ్డా. పాత సోషలిస్టులకు అబిడ్స్, రచయితలకు బృందావన్ హోటల్, కమ్యూనిస్టులకు మరో సెంటర్, ఇరానీ హోటల్స్ మరొకరికి అడ్డాగా ఉండేవి. అక్కడ చాయ్ తాగుతూ, బిస్కెట్లు తింటూ, బన్ రుచి చూస్తూ, సమోసాలు నమిలేస్తూ గంటలు గంటలు చర్చలు నడిచేవి.
ఎంఎఫ్ హుస్సేన్ ఎవరని అడిగా..
వయసులో పెద్దవాళ్లు అంతా సిటీలైట్, ఆల్ఫా హోటల్ తదితర చోట్ల కలిసేవారు. అలాంటి సమయంలో సికింద్రాబాద్‌లోని ఓ హోటల్‌లో పెయింటర్ ఒకరు కలిశారు. మా దోస్తులతో బాతాఖానీ వేస్తూనే ‘ఎవరతను’ అని అడిగా. మా స్నేహితులు ఒక్కసారిగా అవాక్కయి ‘ఆయన గొప్ప పెయింటర్ ఎంఎఫ్ హుస్సేన్. తెలియకపోవడం ఏంటి’ అని ప్రశ్నించారు. అబిడ్స్‌లోని ఓ హోటల్‌లో కూడా ఎక్కువగా కలిసేవారం. రాత్రి అంతా హోటల్స్ నడిచేవి. ఇక్కడ ప్రత్యేకమైన రాత్రి జీవితం ఉండేది. ఇది అందరూ మెచ్చే, ఆనందమైననగరం. ఆదివారం అంటే మాకు అందమైన రోజు. స్పెషల్ వంటకాలు, సినిమాలు, పబ్లిక్ గార్డెన్‌కు పిక్‌నిక్‌లు.. అంతా సరదా ప్రపంచం. డబుల్ డెక్కర్ బస్సులో సిటీ చుట్టేవారం. వర్షం వచ్చినపుడు ట్యాంక్‌బండ్ కట్టపై నిలబడితే ఆ అందం.. ఆనందం వేరుగా ఉండేది. 1980లో అనుకుంటా మత ఘర్షణలు జరిగాయి. దాంతో సిటీ స్వరూపమే మారిపోయింది. రాత్రి ఇరానీ చాయ్, దోస్తుల బాతాఖానీ పోయాయి. ఆ దశకం చివరి నుంచి కాలుష్యం, విపరీత రద్దీ పెరిగిపోయింది. నగరం బాగా విస్తరించింది. ఒకరినొకరు కలుసుకోవడం పోయింది. మళ్లీ ఆరోజులు చూడాలని ఉంది. కలిసి కూర్చోవడం, బేధాలు లేని సమైక్య జీవనం.. ప్రేమ పూర్వక పలకరింపులు రావాలి’.