ఎన్నికల ఘర్షణ కేసుల్లో... అరెస్టుల పరంపర
సిటీబ్యూరో: గ్రేటర్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా మంగళవారం నగరంలో జరిగిన ఘర్షణలకు సంబంధించి పలువురిపై పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్టులు చేశారు. బీజేపీ నాయకునిపై దాడి చేసిన ఎంఐఎం నాయకులను బుధవారం చాదర్‌ఘాట్ పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం పోలింగ్ బూత్‌లో నిలబడి ప్రచారం నిర్వహిస్తున్న బీజేపీ నాయకుడు పట్టుభాయ్‌పై ఎంఐఎం నాయకులు హలీమ్, ఇఫ్రాల్‌లు ఇక్కడ ప్రచారం చేయవద్దంటూ దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పట్టుభాయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దాడికి పాల్పడ్డ ఇరువురినీ అరెస్ట్ చేసి బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు ఇన్‌స్పెక్టర్ సత్తయ్య తెలిపారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ ఇంటి ఆవరణలోని టీఆర్‌ఎస్ కార్యాలయంపై దాడి కేసులో మంగళవారం అరెస్టయిన మలక్‌పేట ఎమ్మెల్యే బలాల, మరో కార్యకర్తను చాదర్‌ఘాట్ పోలీస్‌స్టేషన్‌లు బుధవారం గాంధీ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించి నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. ఐపీసీలోని 147, 448, 427, 149 సెక్షన్ల కింద నమోదైన ఈ కేసులో నిందితులకు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది.
బీజేపీ నాయకులపై దాడికి పాల్పడిన మాజీ కార్పొరేటర్ ఖాజా బిలాల్ అహ్మద్‌పై రెయిన్‌బజార్ పోలీసులు మంగళవారం కేసు నమోదు చే శారు. కుర్మగూడ డివిజన్ ఆయేషా రిజ్వాన్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ వద్ద మంగళవారం సాయంత్రం రెయిన్‌బజార్ మజ్లీస్ పార్టీ మాజీ కార్పొరేటర్ ఖాజా బిలాల్ అహ్మద్ బీజేపీ నాయకులపై దాడికి పాల్పడినట్లు కుర్మగూడ మాజీ కార్పొరేటర్ సహదేవ్ యాదవ్ ఫిర్యాదు చేశారు. పోలింగ్ పూర్తయ్యాక పోలింగ్ బూత్ నుంచి వస్తున్న బీజేపీ నాయకులపై బిలాల్ తన అనుచరులతో కలిసి దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై పోలీసులు ఐపీసీ 341, 506, 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
సోమాజిగూడ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి సంగీతాయాదవ్, భర్త డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్‌యాదవ్‌ను పంజగుట్ట పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. బీఎస్ మక్తాలో అనుమతి లేకుండా వాహనంలో తిరగడం, కాంగ్రెస్ కండువా, టోపీ ధరించడం, ఓటర్లను ప్రభావితం చేయడానికి ప్రయత్నించడం తదితర ఆరోపణలపై చర్యలు తీసుకున్నారు. టప్పాచబుత్ర ఠాణా పరిధిలోని మోజంషాహి స్కూల్‌లో దొంగ ఓటు వేయడానికి వచ్చిన మైనర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం యూసుఫ్‌నగర్‌లోని పోలింగ్ స్టేషన్ నెం.21లోకి వచ్చిన ఈ బాలుడిని పట్టుకున్న ప్రిసైడింగ్ అధికారి పోలీసులకు అప్పగించారు. దీనిపై టప్పాచబుత్ర ఠాణాలో కేసు నమోదైంది. లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ప్రశాంత్‌నగర్ అంబేద్కర్ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం బూత్ 17లో ఎంఐఎం అభ్యర్థిని, అనుచరులు సమయం అయిపోయాక కూడా అరగంట పాటు ఉన్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ, టీఆర్‌ఎస్ అభ్యర్థినిలు, కార్యకర్తలు అక్కడకు చేరుకొని ఆందోళనకు దిగారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీలు ఝులిపించారు. దీంతో కార్యకర్తలు తిరగబడి పోలీసులపై దాడి చేశారు. ఈ ఘర్షనలో కార్యకర్తలు, పోలీసులు గాయపడ్డారు. గాయపడ్డ బీజేపీ కార్యకర్త అన్నపూర్ణరాజు పోలీసులపై ఫిర్యాదు చేయగా, పోలీసులు ఆందోళనకారులపై ఫిర్యాదు చేశారు. ఇరువురి ఫిర్యాదుల మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీడియో పుటేజీలు పరిశీలించి భాద్యులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. పోలింగ్ నేపథ్యంలో మంగళవారం ఈఘటనలు జరిగాయి. బేగంబజార్ ఠాణా పరిధిలో ఎంఐఎం నాయకుడు అయూబ్ ఖాన్ పోలింగ్ బూత్‌కు ఓటర్లను తరలిస్తూ ఎన్నికల కోడ్ ఉల్లంఘించినందుకు మంగళవారం పోలీసులు కేసు నమోదు చేశారు.