ఇదీ.. పోలింగ్ తీరు
గ్రేటర్ వ్యాప్తంగా మంగళవారం చెదురుమదురు సంఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పాతబస్తీలో కొంత ఉద్రిక్తత ఏర్పడగా.. మిగతా ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఈసారి పోలింగ్ శాతం దాదాపు తక్కువగానే నమోదుకావడం ఒకింత విస్మయానికి గురిచేసింది. నియోజకవర్గాల వారీగా ఆయా సర్కిళ్లు..డివిజన్లలో పోలింగ్ సరళిపై ‘సాక్షి ’ విశ్లేషణ...
సనత్‌నగర్, లష్కర్:
సిటీబ్యూరో : సనత్‌నగర్, సికింద్రాబాద్ నియోజకవర్గాల్లోని 11 డివిజన్లలో గ్రేటర్ ఎన్నికల పోలింగ్ రెండు మూడు చెదురు ముదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. బౌద్ధనగర్ డివిజన్‌లోని అంబనగర్ పోలింగ్ బూత్ వద్ద ఉదయం 9.30గం.ల సమయంలో కాంగ్రెస్-టీఆర్‌ఎస్ కార్యకర్తల మధ్య స్వల్ప వివాదం చోటుచేసుకొంది. అలాగే తార్నాక డివిజన్‌లోని లాలాగూడ పోలింగ్ బూత్ వద్ద, మెట్టుగూడ డివిజన్‌లోని దూద్‌బావి పోలింగ్ బూత్ వద్ద సాయంత్రం టీఆర్‌ఎస్-కాంగ్రెస్ కార్యకర్తలు ఘర్షణకు దిగడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ తరుణంలో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలను దూరంగా తరిమేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గం పరిధిలో మధ్యాహ్నం 1గంట సమయానికి కూడా 14-20 శాతంలోపే పోలింగ్ నమోదైంది. సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలో ఉదయం 12 గంటల వరకు మందకొడిగా అత్యధికంగా రాంగోపాల్‌పేట్‌లో 52.23 శాతం పోలింగ్ నమోదు కాగా అత్యల్పంగా అమీర్‌పేట్‌లో 38.98 పోలింగ్ నమోదైంది.
ఎల్‌బీనగర్‌లో...
ఎల్‌బీనగర్: ఎల్‌బీనగర్ నియోజకవర్గం పరిధిలో మంగళవారం జరిగిన గ్రేటర్ ఎన్నికలు ప్రశాతంగా ముగిసాయి. ఈవీఎంలు మొరాయించడంతో కొన్నిచోట్ల పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. హస్తినాపురం డివిజన్‌లోని ధాతునగర్‌లో తమ సమస్యలను పరిష్కరించనందుకు నిరసనగా కాలనీవాసులు రెండు గంటల పాటు పోలింగ్‌ను బహిష్కరించారు. విషయం తెలుసుకున్న ఆర్‌డీఓ సుధాకర్‌రావు ధాతునగర్‌ను సందర్శించి కలెక్టర్‌తో చర్చించి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనేందుకు ముందుకు వచ్చారు. మన్సూరాబాద్ డివిజన్ బూత్‌నెం-51 సిటీ మోడల్ స్కూల్‌లో ఈవీఎం మొరాయించడంతో దానిని వెంటనే మార్చి కొత్తది ఏర్పాటు చేశారు. వనస్థలిపురంలోని బూత్ నెం-9లో ఈవీఎం కొద్దసేపు మొరాయించింది. దీంతో అధికారులు వెంటనే మరొకటి అందుబాటులోకి తేవడంతో పోలింగ్ కొనసాగింది. కర్మన్‌ఘాట్ క్రాంతిక్లబ్ వద్ద బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకోవడంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకున్నారు.
రాజేంద్రనగర్, కార్వాన్, నాంపల్లి:
సిటీబ్యూరో : రాజేంద్రనగర్, కార్వాన్, నాంపల్లి సర్కిల్స్‌లో చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఐదు డివిజన్లలోనూ పోలింగ్ ఉదయం నుంచి సాయంత్రం 5 గంటలకు క్రమంగా పుంజుకుంది. పూర్వపు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ రాజేంద్రనగర్‌లో తమ ఓటు వినియోగించుకున్నారు. ఇక మంగళవారం రాత్రి ఎన్నికల విధులకు వచ్చిన ఉపాధ్యాయులు తమకు టీఏ, డీఏ మొత్తం చెల్లిస్తేనే ఈవీఎంలు ఇస్తామంటూ రాజేంద్రనగర్ సర్కిల్ ఎన్నికల కేంద్రంలో ఆందోళనకు దిగారు. జిల్లా కలెక్టర్ రావాల్సిందేనని ఎన్నికల సిబ్బంది పట్టుపట్టారు. ఇక్కడ పోలింగ్ దాదాపు 55 శాతం జరిగింది.
నాంపల్లిల్లో ఓట్లు గల్లంతు...
నాంపల్లి నియోజకవర్గంలో పలు డివిజన్లల్లో ఓట్లు గల్లంతయ్యాయి. రెడ్‌హిల్స్‌లోని సైఫాబాద్ సైన్స్ కాలేజీ, నిలోఫర్ హెల్త్ స్కూల్, ప్రభు సాయి హైస్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలకు పలువురు ఓటు వేసేందుకు వచ్చి లిస్టులో పేర్లు లేకపోవడంతో వెనుదిరిగారు. నాంపల్లిలో 43 శాతం, మెహిదీపట్నంలో 34 శాతం పోలింగ్ నమోదైంది.
కార్వాన్‌లో గొడవ...
కార్వాన్‌లోని ఏడు డివిజన్లలో పోలింగ్ ఉదయం మందకొడిగా సాగింది. కార్వాన్ డివిజన్‌లో పలుచోట్ల ఈవీఎంలు మొరాయించటంతో ఓటర్లు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టోలీచౌకి డివిజన్‌లో అత్యధికంగా 54 శాతం పోలింగ్ జరిగింది. లంగర్‌హౌస్‌లో టీఆర్‌ఎస్, బీజేపీ వర్గాలు సాయంత్రం గొడవకు దిగడంతో ఉద్రికత్త నెలకొంది.
శేరిలింగంపల్లిలో ప్రశాంతం
సాక్షి, సిటీబ్యూరో: శేరిలింగంపల్లి నియోజకవర్గం పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, హఫీజ్‌పేట్, మియాపూర్, చందానగర్, హైదర్‌నగర్, వీవీనగర్, ఆల్విన్‌కాలనీ డివిజన్లలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఉదయం మందకొడిగా ప్రారంభమైంది. మాదాపూర్‌లో 38.88 శాతం, మియాపూర్ 37.25 శాతం, హఫీజ్‌పేట డివిజన్ పరిధిలో 39.85 శాతం, చందానగర్ 39.9 శాతం, ఆల్విన్ కాలనీలో 45 శాతం, హైదర్‌నగర్‌లో 47 శాతం, వీవీనగర్‌లో 45 శాతం ఓటింగ్ నవె ూదైంది.
ముషీరాబాద్‌లో...
ముషీరాబాద్ : ముషీరాబాద్ నియోజకవర్గంలో పోలింగ్ మందకొడిగా సాగింది. ఆరు డివిజన్‌లలో 2,88,574 ఓటర్లు ఉండగా, 330 పోలింగ్ స్టేషన్‌లను ఏర్పాటు చేశారు. కాని ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆసక్తి కనబరచలేదు. పోలింగ్ ముగిసేసరికి సుమారు 48 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. అత్యధికంగా ముషీరాబాద్‌లో 53.56 శాతం నమోదైంది.
ఖైరతాబాద్, జూబ్లీహిల్స్
సిటీబ్యూరో: స్వల్ప సంఘటనలు మిన హా ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మందకొడిగా ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం వరకు పుంజుకుంది. గత ఎన్నికల్లో కంటే ఈసారి ఓటింగ్ శాతం పెరిగినట్లు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. మహిళలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాలకు సమీపంలో ప్రధాన పార్టీల కార్యకర్తలు ఓటర్లకు స్లిప్‌లు పంపిణీ చేయటానికి ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసుకున్నారు. కాగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని యూసుఫ్‌గూడ డివిజన్‌లో 35.92 శాతం పోలింగ్ నమోదైంది. రహమత్‌నగర్‌లో 50 శాతం, ఎర్రగడ్డలో 59.14, బోరబండలో 50.62, వెంగళరావునగర్‌లో 44, షేక్‌పేట డివిజన్‌లో 46 శాతం పోలింగ్ జరిగింది. ఖైరతాబాద్ నియోజకవర్గం పరిధిలోని బంజారాహిల్స్ డివిజన్‌లో47.90 శాతం పోలింగ్ నమోదు కాగా, జూబ్లీహిల్స్‌లో 45.34, వెంకటేశ్వరకాలనీలో 46.58, ఖైరతాబాద్‌లో44.7, సోమాజిగూడలో 43.36 శాతం, హిమాయత్‌నగర్ డివిజన్‌లో 35.60 శాతం పోలింగ్ నమోదైనట్లు సమాచారం.
మలక్‌పేట/ మహేశ్వరం/యాకుత్‌పుర:
దిల్‌సుఖ్‌నగర్: వులక్‌పేట, మహేశ్వరం, యాకత్‌పుర నియోజకవర్గాల పరిధిలోని డివిజన్‌లలో మంగళవారం జరిగిన గ్రేటర్ ఎన్నికలు చెదురువుుదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా వుుగిశారుు. అన్ని డివిజన్‌లలో కూడా 50 శాతం లోపే ఓటింగ్ జరిగింది. సాయంత్రం 3.30 తరువాత పోలింగ్ ముగిసే సమయానికి ఓటర్లు ఎక్కువ సంఖ్యలో చేరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసారి ఎన్నికల్లో సాధారణ ఓటర్లతో పాటు యువ ఓటర్లు భారీగా పోలింగ్‌లో పాల్గొన్నారు. ఓటరు లిస్టులో పేర్లు ఉండి గుర్తింపు కార్డులు లేక కొంతవుంది, ఓటరు కార్డులు ఉండి కూడా ఓటరు లిస్టులో పేర్లు లేకపోవడంతో చాలా వుంది ఓటు హక్కు వినియోగించుకోలేకపోయూరు.
అంబర్‌పేట..
అంబర్‌పేట: చెదురుమదురు సంఘటనలు మినహా అంబర్‌పేట నియోజకవర్గంలో ఎన్నికలు సజావుగా సాగాయి. మంగళవారం ఉదయం 7 గంటల నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాగ్‌అంబర్‌పేట డివిజన్ శివవాణి పాఠశాల వద్ద బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీ నాయకుల మధ్య స్వల్ప వివాదం తలెత్తి ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అక్కడే ఉన్న పోలీసులు తక్షణమే స్పందించి ఆందోళనకారులను పంపించారు. అదే విధంగా డీడీ కాలనీ సుందర్‌నగర్ సత్యసాయి పాఠశాల వద్ద స్వల్ప ఉద్రిక్తత ఏర్పడింది.
కూకట్‌పల్లి సర్కిల్‌లో...
మూసాపేట: కూకట్‌పల్లి సర్కిల్ పరిధిలో కొన్ని చెదురుమదురు సంఘటనలు మినహా ప్రశాంతంగా పోలింగ్ జరిగింది. గత ఎన్నికలను పోల్చుకుంటే ఈసారి పోలింగ్ శాతం పెరిగిందని చెప్పవచ్చు. కేపీహెచ్‌బీ డివిజన్‌లో 50.25 శాతం, బాలాజీనగర్‌లో 50.88 శాతం, అల్లాపూర్‌లో 46.09 శాతం, మూసాపేటలో 47.12 శాతం, ఫతేనగర్‌లో 52.08 శాతం పోలింగ్ నమోదైంది. ఓల్డ్‌బోయిన్‌పల్లిలో 41.39 శాతం, బాలానగ ర్‌లో 48.19 శాతం, కూకట్‌పల్లిలో 42.49 శాతం, వివేకానందనగర్‌కాలనీలో 41.16 శాతం, హైదర్‌నగర్ 46.63 శాతం, ఆల్విన్‌కాలనీలో 41.16 శాతం పోలింగ్ నమోదైంది.
పాతనగరంలో...
సాక్షి, సిటీబ్యూరో: పాత నగరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితుల మధ్య పోలింగ్ ముగిసింది. ఉదయం పోలింగ్ ప్రశాంతంగా జరిగినప్పటికీ మధ్యాహ్నం తర్వాత మజ్లిస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని జంగమ్మెట్ డివిజన్ బీజేపీ అభ్యర్థిపై జరిగిన దాడి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. దీంతో బీజేపీ కార్యకర్తలు ఫలక్‌నుమా జూనియర్ కాలేజీ ప్రధాన రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో ఒక్కసారిగా పోలింగ్ మందగించింది.
కుత్బుల్లాపూర్
కుత్బుల్లాపూర్: కుత్బుల్లాపూర్‌లో పోలింగ్ సరళి అభ్యర్థులను కలవర పెట్టింది. మందకొడిగా పోలింగ్ ప్రారంభమై చివరి వరకు అదే రీతిలో కొనసాగింది. దీంతో పోలింగ్ శాతం 2009 గ్రేటర్ ఎన్నికల్లో 49 శాతం కంటే తక్కువగా నమోదైంది. కుత్బుల్లాపూర్ సర్కిల్‌లో మొత్తం 8 డివిజన్‌లు... 4,67,464 మంది ఓటర్లు ఉండగా కేవలం 2,12,605 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో 45.67 శాతం ఓటింగ్ నమోదైంది. 437 పోలింగ్ స్టేషన్లు ఉన్న ఈ ప్రాంతంలో 91 కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేశారు. సాయంత్రం 4 గంటల వరకు కేవలం 37.52 శాతమే పోల్ కాగా..చివరిలో గంటలో 8 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం.
ఉప్పల్, మల్కాజిగిరిలో...
సిటీబ్యూరో: ఒకటి, రెండు స్వల్ప ఘటనలు మినహా ఉప్పల్, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో గ్రేటర్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రజలు ఉదయం నుంచి సాయంత్రం వరకు తమకు వీలైన వేళల్లో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహిళలు, యువతీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఉప్పల్‌లో....
ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్, చిలుకానగర్, హబ్సిగూడ, రామంతాపూర్, కాప్రా, ఏఎస్‌రావునగర్, చర్లపల్లి, హెచ్‌బీకాలనీ, మల్లాపూర్, నాచారం డివిజన్‌లలో ఉదయం 7 నుంచి 10 గంటల వరకు 15 శాతం ఓటింగ్ నమోదు కాగా, మధ్యాహ్నం 3 గంటల వరకు కాప్రాలో 45 శాతం, ఉప్పల్ సర్కిల్‌లో 44.76 శాతం చొప్పున ఓటింగ్ నమోదైంది. సాయంత్రం 5 గంటల వరకు కాప్రాలో 49.50 శాతం, ఉప్పల్‌లో 45.05 శాతం వరకు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
మల్కాజిగిరిలో..
మల్కాజిగిరి, మచ్చబొల్లారం, అల్వాల్, నేరేడ్‌మెట్, వెంకటాపురం, వినాయక్‌నగర్, మౌలాలి, ఈస్ట్ ఆనంద్‌బాగ్, గౌతమ్‌నగర్ డివిజన్‌లలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. సాయంత్రం 5 గంటల వరకు అల్వాల్‌లో 46.01 శాతం, మల్కాజిగిరిలో 44.26 శాతం ఓటింగ్ నమోదైంది.