వికలాంగులకు ప్రత్యేక ఏర్పాట్లు
ఫిబ్రవరి 2న జరిగే జీహెచ్‌ఎంసీ ఎన్నికల పోలింగ్‌కు హాజరయ్యే వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ ఎన్నికల అధికారి , కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. వికలాంగులకు, నడవలేని వారికి సాధ్యమైనన్ని పోలింగ్ కేంద్రాల్లో వీల్‌చైర్లు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. వృద్ధులకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సౌకర్యాలను సహచర ఓటర్లు కూడా స్వాగతించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. వీరిని పోలింగ్ కేంద్రాల సమీపంలోకి అనుమతించాల్సిందిగా పోలీసులకు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు.
రెండు లక్షలకుపైగా తొలగింపు...
ఎన్నికల నియమావళి మేరకు ఇప్పటివరకు 2,00,745 అక్రమహోర్డింగులు, ఫ్లెక్సీలు, బ్యానర్లు, కటౌట్లు,పోస్టర్లను తొలగించినట్లు పేర్కొన్నారు. ఇందులో 7,654 కటౌట్లు, 52,672 ఫ్లెక్సీలు, 60,000 బ్యానర్లు, 81,000 పోస్టర్లు ఉన్నాయని తెలిపారు. ఇప్పటి వరకు అక్రమంగా తరలిస్తున్న రూ. 2,54,28,200 స్వాధీనపరచుకున్నట్లు తెలిపారు. శుక్రవారం గాంధీనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రూ. 37 లక్షలు స్వాధీనపరచుకున్నట్లు తెలిపారు.
పోలింగ్ సిబ్బంది 7 గంటలకల్లా చేరుకోవాలి...
ఎన్నికల విధుల్లో పాల్గొనే అధికారులు, సిబ్బంది ఫిబ్రవరి 1వ తేదీన ఉదయం 7 గంటలలోపు తమకు కేటాయించిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలకు చేరుకోవాలని తెలిపారు. పొరుగుజిల్లాల నుంచి వచ్చేవారి కోసం నగరంలోని ఇమ్లీబన్, జూబ్లీ బస్టాండ్ల నుంచి ప్రత్యేక బస్సు సౌకర్యం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
- సాక్షి, సిటీబ్యూరో