గ్రేటర్ ఫలితాలపై నాయకుల స్పందన
ప్రజల తీర్పును శిరసావహిస్తాం..
‘‘గ్రేటర్ హైదరాబాద్ ప్రజల తీర్పును శిరసావ హిస్తాం. ఎన్నికల ఫలితాలు విశ్లేషించుకొని ఓటమికి కారణాలను మదింపు చేసుకుంటాం. టీఆర్‌ఎస్ ప్రభుత్వం, మంత్రులు ఇచ్చిన అలవిగాని వాగ్దానాలు, ప్రజలను భయాందోళనలకు గురి చేయడం, అడుగడుగునా అధికార దుర్వినియోగం వంటివి ఎన్నికల్లో ప్రభావం చూపాయి..’’
- టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ
ఓటమికి కారణాలు సమీక్షిస్తాం
‘‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఫలితాలను స్వాగతిస్తున్నాం. మా ఓటమికి గల కారణాలు సమీక్షిస్తాం. లోతుగా పరిశీలిస్తాం. ఆశించిన ఫలితాలు రాకపోవడం బాధాకరం. ప్రత్యామ్నాయ శక్తిగా ఏర్పడడానికి కృషి చేస్తాం..’’
- కేంద్ర కార్మికశాఖ మంత్రి దత్తాత్రేయ
ఓటమిపై విశ్లేషిస్తాం...
జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజల తీర్పు బాధాకరమే అయినా దాన్ని శిరసావహిస్తాం. టీఆర్‌ఎస్ కల్పించిన భ్రమలను, ఆచరణ సాధ్యం కాని హామీలను ప్రజలు నమ్మినట్టుగా కనిపిస్తున్నది. ఈ ఓటమికి కారణాలను అంతర్గతంగా విశ్లేషించుకుంటాం. భవిష్యత్తులో పార్టీని నిర్మిస్తాం.
- మల్లు భట్టివిక్రమార్క, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు
సవాల్‌పై కేటీఆరే వెనక్కి తగ్గారు..
‘‘గ్రేటర్ ఎన్నికల్లో విజయం సాధించిన అన్ని పార్టీల అభ్యర్థులకు శుభాకాంక్షలు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చాలి. గ్రేటర్‌లో టీఆర్‌ఎస్ వందసీట్లు సాధిస్తే రాజకీయ సన్యాసం చేసే సవాల్‌పై మంత్రి కేటీఆరే వెనక్కి తగ్గారు..’’
- టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎ. రేవంత్‌రెడ్డి
టీఆర్‌ఎస్ బాధ్యత పెరిగింది
‘‘గ్రేటర్ ఎన్నికల్లో ప్రజాతీర్పు శిరోధార్యం. టీఆర్‌ఎస్ నాయకులు ఊహించిన దానికన్నా ప్రజలు ఆ పార్టీకి ఎక్కువ సీట్లు కట్టబెట్టారు. టీఆర్‌ఎస్ బాధ్యత మరింత పెరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలి..’’
- సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి
టీఆర్‌ఎస్‌ను ప్రజలు విశ్వసించారు
‘‘మాటలు ఎక్కువగా చెప్పినా.. కరెంటు, నీరు విషయంలో సీఎం కేసీఆర్ ప్రయత్నాన్ని ప్రజలు విశ్వసించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్ల గ్రాఫిక్స్ ప్రజలను ఆకర్షించాయి. ప్రతిపక్షాలు బలహీనంగా ఉండడం కూడా వారికి లాభించింది. అందుకే టీఆర్ ఎస్ నాయకులు కూడా ఊహించని విధంగా జీహెచ్‌ఎంసీలో సీట్లు వచ్చాయి. ఈ విజయ గర్వంతో కళ్లు నెత్తిమీదకు ఎక్కించుకోకుండా బాధ్యతాయుతంగా పనిచేయాలి..’’
- కె. నారాయణ, సీపీఐ జాతీయ కార్యదర్శి
ప్రజాతీర్పును గౌరవిస్తాం
‘‘జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ప్రజాతీర్పును గౌరవిస్తున్నాం. గెలిచిన అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు. ప్రజల పక్షాన టీడీపీ పోరాటం కొనసాగుతుంది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు టీఆర్‌ఎస్ కృషి చేయాలి..’’
- ట్విట్టర్‌లో నారా లోకేశ్
హామీల అమలుకోసం పోరాడుతాం
‘‘టీఆర్‌ఎస్‌కు మా అభినందనలు. వారు ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలి. జీహెచ్‌ఎంసీలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ప్రజల పక్షాన పోరాడుతాం. హామీల అమలుకోసం ప్రజలతో కలసి సంఘటిత ఉద్యమాలను నిర్మిస్తాం..’’
- బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి
ఆత్మవిమర్శ చేసుకుంటాం
‘‘టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీల అమలును ప్రజలు విశ్వసించినట్టుగా ఈ తీర్పు కనబడుతోంది. డబుల్ బెడ్‌రూం సహా ఇతర హామీలను అమలు చేయాలంటూ క్షేత్రస్థాయి నుంచి ఉద్యమాలను నిర్మిస్తాం. ఈ ఎన్నికల ఫలితాలను సమీక్షించుకుని, లోపాలను సరిదిద్దుకుంటాం..’’
- బీజేపీ శాసనసభాపక్ష నేత కె.లక్ష్మణ్
ఇది ప్రభుత్వ విజయం: ఈటల
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ సాధించిన విజయం తమ ప్రభుత్వానిదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ప్రభుత్వానికి మద్దతు పలికిన నగర ప్రజలకు శుక్రవారం ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పరిపాలన తీరుకు ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదమే ఈ అపూర్వ విజయానికి కారణమని అభిప్రాయపడ్డారు. డిపాజిట్ గల్లంతైన విపక్షాలు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని హితవు పలికారు.
ఊహించిన దానికంటే ఎక్కువే..: డీఎస్
సాక్షి, హైదరాబాద్: ఊహించిన దానికంటే ప్రజల ఆదరణ ఎక్కువగా ఉందని, కేసీఆర్ పాలన పట్ల, హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి తీసుకున్న సంకల్పాన్ని నెరవేర్చేందుకు మద్దతుగా నిలిచారని ప్రభుత్వ ప్రత్యేక సలహాదారు డీఎస్ పేర్కొన్నారు. ప్రతిపక్షాలు నగర అభివృద్ధికి నిర్మాణాత్మక సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ‘‘ఇది స్పష్టమైన, వన్‌సైడ్ గెలుపు.
ఏ పార్టీకీ గతంలో ఇవ్వని ఫలితం ఇది...’’ అని మంత్రి తలసాని పేర్కొన్నారు. ‘ఈ విజయం సీఎం కేసీఆర్ వల్లే సాధ్యమైంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తాననన్న మాటలను ప్రజలు నమ్మి సీఎంపై బాధ్యత పెట్టారు’ అని మంత్రి జగదీశ్వర్‌రెడ్డి వివరించారు.