ఉద్యమం తెలిస్తే సగం మార్కులు వచ్చినట్లే
* విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి
* ఈ పరీక్షలు ఆఖరు మజిలీగా భావించొద్దు
* జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
* మహబూబ్‌నగర్‌లో ‘సాక్షి’ భవిత గ్రూప్ అవగాహన సదస్సు విజయవంతం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: తెలంగాణ ఉద్యమం గురించి తెలిస్తే సగం మార్కులు వచ్చినట్లేనని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా ఉజ్వల భవిష్యత్ ఆశిస్తున్న నిరుద్యోగ యువకులు అందుకు తగినట్లుగా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి తమ కలలను సాకారం చేసుకోవాలని ఆకాంక్షించారు.
తెలంగాణ ఉద్యమం-చరిత్రపై పూర్తిస్థాయి పట్టుసాధిస్తేనే ఇది సాధ్యమన్నారు. మహబూబ్‌నగర్‌లో మంగళవారం నిర్వహించిన ‘సాక్షి’ భవిత గ్రూప్ అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. ఉద్యమం గురించి అవగాహన ఉన్నవారికి వచ్చే టీఎస్‌పీఎస్సీ పరీక్షల్లో తిరుగులేదని, గ్రూప్స్‌లో 150 మార్కులు వచ్చినట్లేనని చెప్పారు. గతంలో గ్రూప్స్ పరీక్షల్లో తప్పినవారు ఒత్తిడికి లోనై ఎంతో ఆవేదన చెందేవారని, ప్రయత్నలోపం లేకుండా కష్టపడాలే తప్ప ఈ పరీక్షలను ఆఖరి మజిలీగా భావించొద్దని హితవు పలికారు.
దివంగత ప్రొఫెసర్ జయశంకర్ కూడా ఏ విషయమైనా చదవిన తర్వాతే దాని గురించి క్లుప్తంగా వివరించేవారని గుర్తుచేశారు. ఉద్యమాన్ని విభాగాలుగా విభజించి అవగాహన పెంచుకోవాలని సూచించారు. తొలి, మలిదశ ఉద్యమ పరిణామాలను లోతుగా అధ్యయనం చేయాలని కోరారు. పునర్‌వ్యవస్థీకరణ చట్టం, శ్రీకృష్ణ కమిషన్ రిపోర్టు, ప్రముఖ కవులు, రచయిత లు రాసిన తెలంగాణ చరిత్ర పుస్తకాలను చదవాలన్నారు.
సంస్కృతిలోనే పౌరుషం ఉంది..
తెలంగాణ సంస్కృతిలోనే పౌరుషం దాగి ఉంది. ఆ పౌరుషమే ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించింది. సిలబస్‌లో మన సంస్కృతి, కళలకు పెద్దపీట వేశారు. మీ సొంత ప్రణాళికలతో పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి. ప్రతిదానికీ ఇతరులను అనుకరిం చడం ఉద్యోగార్థులకు సరికాదు. తెలంగాణ స్ఫూర్తితో యువత కష్టపడి గ్రూప్స్ ఉద్యోగాలు సాధిం చాలి. తెలంగాణ చరిత్రను పూర్తిగా ఆకళింపు చేసుకొని చదివితే విజయం మీదే.
- నందిని సిధారెడ్డి, ప్రముఖ కవి
కారుచీకటిలో కాంతిరేఖ
గ్రూప్స్ అభ్యర్థులకు కారుచీకటిలో కాంతిరేఖగా ‘సాక్షి’ భవిత అవగాహన సదస్సులు నిలుస్తున్నాయి. దేశ, రాష్ట్ర ఆర్థికవ్యవస్థపై పట్టు సాధించాలి. గ్రూప్స్‌లో ర్యాంక్‌ను ఎకనామిక్స్ సబ్జెక్టు నిర్ధారిస్తుంది. ఆర్థికవ్యవస్థను విభాగాలుగా విభజించి చదవాలి. ఆర్థికాభివృద్ధి, జాతీయాదాయం, జీడీపీ, పేదరికం తదితర అంశాలను క్షుణ్ణంగా చదవాలి. అభ్యర్థులు లక్ష్యం నిర్ధేశిం చుకొని చదివితే విజయం సాధించవచ్చు.
- డాక్టర్ ఎస్. భూమన్నయాదవ్, ఆర్థిక శాస్త్ర నిపుణులు
సమాజంపై అవగాహనే..
సమాజంపై పరిపూర్ణంగా అవగాహన ఉన్న వారే గ్రూప్స్‌లో ఉద్యో గం సంపాదించుకోవడంతోపా టు చేసే ఉద్యోగంలో కూడా సేవాదృక్పథంతో రాణిస్తారు. ఇక్కడ షార్ట్‌కట్స్ ఏమీ ఉండవు. పద్ధతి ప్రకారం చదివితేనే విజయం సాధించవచ్చు. నేను గ్రూప్-1కు శ్రద్ధపెట్టి చదివితే గ్రూప్-2లో 1986లో డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగం వచ్చింది. చాలా కాలం తర్వాత నోటిఫికేషన్ వచ్చినందున లక్ష్యం నిర్దేశించుకొని చదవాలి. - రాంకిషన్, జాయింట్ కలెక్టర్
ప్రణాళికాబద్ధంగా చదవాలి
గ్రూప్స్‌లో ప్రణాళికబద్ధంగా చదివితే విజయం సాధించవచ్చు. నోటిఫికేషన్‌లో ఎటువంటి అవరోధాలు, ఆటంకాలు లేకుండా ఉద్యోగాల భర్తీ జరుగుతాయి. హోం, గ్రౌండ్‌వర్క్‌ను ప్రణాళికాబద్ధంగా తయారు చేసుకోవాలి. నోటిఫికేషన్ వెలువడ్డాక ప్రతిక్షణం విలువైనదే అన్న విషయాన్ని వారు ఎప్పటికప్పుడు గుర్తుంచుకొని పరీక్షలకు సిద్ధం కావాలి. అప్పుడే విజయం వరిస్తుంది.
- పి.విశ్వప్రసాద్, మహబూబ్‌నగర్ జిల్లా ఎస్పీ