ఢిల్లీ వెళ్లనున్న సీమాంధ్ర మంత్రులు
Published Tue, Aug 6 2013 12:18 PM | Last Updated on Fri, Sep 1 2017 9:41 PM
హైదరాబాద్ : సీమాంధ్రలో విభజన సెగ ఉధృతం అవుతుండటంతో సీమాంధ్ర నేతలు అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు హస్తినకు పయనం అవుతున్నారు. కేంద్రమంత్రులు, ఎంపీలతో కలిసి వారు అధిష్టానం పెద్దలను కలవనున్నారు. ఇప్పటికే సీమాంధ్ర మంత్రులు శైలజానాథ్, కొండ్రు మురళి, గంటా శ్రీనివాసరావు ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డిని కలిశారు.
మరోవైపు రాయల తెలంగాణ దిశగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు ఢిల్లీలో అధిష్టాన పెద్దలతో సమావేశమవుతున్నారు. కాసేపట్లో సోనియా, ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో సమావేశం కానున్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, లేదంటే మూడుముక్కలు చేయాలని, విభజన అనివార్యమైతే కర్నూలుజిల్లాను తెలంగాణలో కలపాలని వీరు అధిష్టానాన్ని కోరనున్నారు.
కాగా విభజన.. సమైక్య నినాదాలతో ఒకవైపు రాష్ట్రం అట్టుడుకుతుండగా కేంద్ర ప్రభుత్వం విభజన ప్రక్రియను వేగవంతం చేస్తోంది. రాష్ట్రంలో పంపకాలకు అవసరమైన వివరాలు పంపించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ రాష్ట్ర అధికారులను ఇప్పటికే ఆదేశించింది. రాష్ట్రంలో ఉన్న నీటి పథకాలతోపాటు, పూర్తిగా సీమాంధ్రలో, తెలంగాణలో ఉన్న ప్రాజెక్టులతోపాటు, రెండు రాష్ట్రాలకు అనుసంధానంగా ఉన్న ప్రాజెక్టుల వివరాలు పంపించాలని ఆదేశించినట్లు సమాచారం. అలాగే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, వాటికి కావాల్సిన నిధులు, పూర్తి చేస్తే రెండు రాష్ట్రాలకు ఒనగూరే ప్రయోజనాలు వంటి అంశాలపై కూడా నివేదికలు కోరినట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement