ఎవరేం చేసినా తెలంగాణ ఆగదు | won't stop Telangana state : Janareddy | Sakshi
Sakshi News home page

ఎవరేం చేసినా తెలంగాణ ఆగదు

Published Tue, Aug 6 2013 12:30 AM | Last Updated on Fri, Sep 1 2017 9:40 PM

ఎవరేం చేసినా తెలంగాణ ఆగదు

ఎవరేం చేసినా తెలంగాణ ఆగదు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం చర్యలు ప్రారంభించిన నేపథ్యంలో సీమాంధ్ర నేతలు ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ఆగబోదని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కె.జానారెడ్డి అభిప్రాయపడ్డారు. ఈసారి నిర్ణయం ఏమాత్రం ఆగినా, పక్కకు పెట్టినా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ‘‘తెలంగాణ ఏర్పాటు 60 ఏళ్ల చారిత్రక పరిణామం. అనేక ఉద్యమాలు, కమిటీలు, సంప్రదింపులు పూర్తయ్యాకనే రెండు ప్రాంతాల అభివృద్ధి, తెలుగు ప్రజల భవిష్యత్తును కాంక్షించి ఈ నిర్ణయం తీసుకున్నారు. నీరు, జలం, ఉపాధి, ఉద్యోగ విషయాలపై చర్చలతో పరిష్కరించుకోవచ్చు. విద్వేషాలు, విధ్వంసాలు ఆపాలి. కాంగ్రెస్ పార్టీ నేతలు తెలంగాణను సమర్థించి సీమాంధ్ర ప్రజలను ఒప్పించాలి. మళ్లీ తిరిగి ఈ నిర్ణయం పునఃపరిశీలించడం అసాధ్యం’’ అని జానారెడ్డి వివరించారు.
 
 తెలంగాణ జర్నలిస్టుల ఫోరం సోమవారం ఇక్కడ నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లో ఉన్న సీమాంధ్రులే కాకుండా ప్రతి ఒక్కరూ తెలంగాణవారేనని, ప్రశాంతంగా స్వేచ్ఛగా జీవనం సాగించవచ్చని చెప్పారు. వారికి రాజ్యాంగం, చట్టపరమైన రక్షణలుంటాయన్నారు. వారికి రక్షణ కల్పించే బాధ్యత తనదని, అలా చేయలేనప్పుడు రాజకీయాల నుంచే తప్పుకుంటానని చెప్పారు. రాజ్యాంగం, చట్టం ప్రకారమే ఉద్యోగుల మార్పిడి ప్రక్రియ జరుగుతుందని, ఇందులో ఎలాంటి అపోహలకు తావులేదని స్పష్టంచేశారు. 610 జీఓ ప్రకారం అదనంగా ఉన్నవారు మాత్రమే ఆంధ్ర ప్రభుత్వంలో పనిచేస్తారని చెప్పారు. సీమాంధ్రుల్లో, ఉద్యోగుల్లో ఉన్న అపోహలు, సమస్యలపై చర్చించుకొని పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు.
 
 అభివృద్ధిని జిల్లాలకు విస్తరిస్తాం
 హైదరాబాద్‌ను అన్నిరంగాలకు హబ్‌గా మారుస్తామని, అభివృద్ధిని జిల్లాలకు విస్తరిస్తామని, అన్ని జిల్లా కేంద్రాలను హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి పరుస్తామని జానారెడ్డి చెప్పారు. పరిపాలనా సౌలభ్యంకోసం జిల్లాలను మరింత చిన్నవిగా విభజిస్తామన్నారు. ఉచిత విద్యుత్తు, ఫీజు రీయింబర్స్‌మెంటుతో సహా ఇపుడున్న పథకాలను యథాతథంగా అమలుచేస్తామని చెప్పారు. శాంతిభద్రతల విషయంలో అత్యంత ప్రాధాన్యమిస్తామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో నక్సలైట్ల సమస్య ఉండనే ఉండదన్నారు. తెలంగాణకు రెండు వేల మెగావాట్ల విద్యుత్ కొరత ఉందని, దాన్ని రెండేళ్లలోగా అధిగమిస్తామని, ప్రభుత్వం ఏర్పాటయ్యాక తొలిసంతకం దానిపైనే పెడతామని హామీనిచ్చారు. ఉద్యమం సందర్భంగా పెట్టిన కేసులను ఎత్తివేస్తామని, అమరవీరుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు. రెచ్చగొట్టే విధంగా కాకుండా మీడియా సంయమనం పాటించాలన్నారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నాక దాన్ని అమలు చేయాల్సిన సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న సీమాంధ్ర ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల వినతిపత్రంలో సంతకాలు చేయడం సరికాదని తప్పుబట్టారు. తెలంగాణకు తొలి సీఎంగా దళితులే ఉంటారని టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ చేసిన ప్రకటనపై స్పందిస్తూ... సీఎంగా ఎవరుండాలన్న దానిపై ఇప్పుడు చర్చ అప్రస్తుతమన్నారు. ‘‘బిల్లు పాసవ్వలేదు. రాష్ట్రం ఏర్పాటూ కాలేదు. సీఎం ఎవరంటూ చర్చ హాస్యాస్పదం. ఏ పార్టీ విధానం వారికుంటుంది. మా పార్టీ అధిష్టానం సలహాలు, సభ్యుల అభీష్టం మేరకు సీఎం ఎంపిక అవుతారు. ఆ విషయంలో నాకెలాంటి భ్రమలు లేవు’’ అని వివరించారు.
 
 హైలెవెల్ కమిటీ సామరస్యానికే...
 హైలెవెల్ కమిటీ ఏర్పాటు కేవలం ఇరు ప్రాంతాల మధ్య సామరస్యపూర్వక వాతావరణానికేనని, దీనివల్ల తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ ఆలస్యమవుతుందనుకోవడం లేదని చెప్పారు. రాయల తెలంగాణ అంశం తెరపైకి వస్తే అప్పడు స్పందిస్తామని తెలిపారు. రాష్ట్ర విభజనే అవుతున్నందున ప్రత్యేక పీసీసీ ఇప్పుడు అవసరం లేదన్నారు. టీఆర్‌ఎస్ విలీనమైతే తాను సంతోషిస్తానని, అయితే ఆ ప్రక్రియ గురించి తమ పార్టీ అధిష్టానం చర్చిస్తుందని తెలిపారు. సీమాంధ్రలో పరిస్థితులు ప్రశాంతంగా ఉండేందుకు సీఎం, పీసీసీ అధ్యక్షుడు ఆ ప్రాంత నేతలతో చర్చించాలని జానారెడ్డి సూచించారు. సీమాంధ్రలో హింసాత్మక ఘటనల వెనుక అధికారంలో ఉన్న వారి హస్తమున్నట్లు వస్తున్న ఆరోపణలపై అధిష్టానం విచారించి చర్యలు చేపట్టాలని కోరారు. సమావేశానికి అధ్యక్షత వహించిన టీజేఎఫ్ కన్వీనర్ అల్లం నారాయణ మాట్లాడుతూ పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాసయ్యేలా కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు సాగించాలన్నారు. ఫోరం ప్రతినిధులు క్రాంతికుమార్, శైలేష్‌రెడ్డి, పీవీ శ్రీనివాస్, రమణ, పల్లె రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement