
లేని భయాలను సృష్టిస్తున్నారు : టీ కాంగ్రెస్ ఎంపీలు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రజా ప్రతినిధులు లేవనెత్తుతున్న భయాందోళనలను తొలగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలంగాణప్రాంత కాంగ్రెస్ ఎంపీలు ఆంటోని కమిటీతో పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రతి ఒక్క సెటిలర్ రక్షణకు తాము పూర్తి బాధ్యత తీసుకుంటామని చెప్పారు. కొందరు సీమాంధ్ర నేతలు రాజకీయ ప్రయోజనం కోసం కావాలనే విద్యార్థులు, ఉద్యోగులను రెచ్చగొట్టి.. వారిలో లేని భయాలను సృష్టించి ఆందోళనలకు ఉసిగొల్పుతున్నారని ఎంపీలు ఆరోపించారు.
భద్రత విషయంలో అంతగా ఆందోళన ఉంటే హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల అంశాన్ని కేంద్ర ప్రభుత్వ అజమాయిషీ కిందకు తెచ్చినా తమకు ఆమోదయోగ్యమేనని ఎంపీలు పేర్కొన్నట్లు సమాచారం. అలాగే నదీ జలాల అంశంపైనా ఎవరికీ ఆందోళన అక్కర్లేదని వారు చెప్పినట్లు తెలిసింది. ఇప్పటికే ప్రాజెక్టుల వారీగా నీటి పంపకాలు జరిగాయని, కాబట్టి విభజన జరిగినా ఎలాంటి సమస్య రాదని, ఒకవేళ ఏదైనా సమస్య ఉంటే ట్రిబ్యునళ్లు ఉన్నాయని అభిప్రాయపడినట్లు చెప్తున్నారు. విభజనపై అభ్యంతరాలను పరిశీలించేందుకు కాంగ్రెస్ పార్టీ ఆంటోని నేతృత్వంలో ఏర్పాటు చేసిన నలుగురు సభ్యుల కమిటీ వరుసగా బుధవారం రెండో రోజు వార్ రూమ్‌లో సమావేశమయింది. ఈ సమావేశానికి సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలను ఆహ్వానించగా.. తమకు సమయం కావాలని వారు కోరారు.
దీంతో తెలంగాణ ప్రాంత ఎంపీలను కమిటీ ఆహ్వానించింది. అప్పటికప్పుడు కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి ఇంట్లో సమావేశమైన టీ- కాంగ్రెస్ ఎంపీలు ఏయే అంశాలను ప్రస్తావించాలన్న దానిపై చర్చించుకుని కమిటీ ముందుకు వెళ్లారు. తెలంగాణ ఏర్పాటు నిర్ణయాన్ని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు స్వాగతించగా.. సొంత పార్టీ నేతలైన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వ్యతిరేకించటం సహేతుకం కాదని ఎంపీలు కమిటీ వద్ద వ్యాఖ్యానించినట్లు తెలిసింది. సాధారణ ఎన్నికల నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయటానికి వీలైనంత త్వరగా తెలంగాణకు కొత్త పీసీసీ అధ్యక్షుడిని నియమించాలని వారు కోరినట్లు సమాచారం. తెలంగాణ ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని, వచ్చే శీతాకాల సమావేశాల్లోగా తెలంగాణ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలని నేతలంతా కోరగా.. అందుకు కమిటీ నుంచి సానుకూల స్పందన వచ్చినట్లు చెప్తున్నారు. తెలంగాణ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకే ప్రయత్నం జరుగుతోందని, ఈ సమయంలో ఒకరి భావోద్వేగాలు మరొకరు కించపరిచేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయరాదని ఎంపీలకు ఆంటోనీ కమిటీ చెప్పి పంపినట్లు సమాచారం.
రేణుక వస్తే వెళ్లిపోతాం: కాంగ్రెస్ ఎంపీ రేణుకాచౌదరి కూడా ఆంటోనీ కమిటీతో తెలంగాణ ఎంపీల సమావేశంలో పాల్గొనేందుకు రావటంతో కొందరు ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమె ఇటీవల సీమాంధ్ర నేతల సమావేశానికి సైతం హాజరయ్యారని, ఆమె పాల్గొంటే తామంతా అక్కడినుంచి వెళ్లిపోతామన్నారు. దీంతో రేణుకాచౌదరి సమావేశంలో పాల్గొనకుండా వెళ్లిపోయారు. బుధవారం తెలంగాణ ప్రాంత నేతలతో చర్చలు ముగిశాయని, గురువారం సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలతో కమిటీ చర్చలు ఉంటాయని దిగ్విజయ్‌సింగ్ విలేకరులకు తెలిపారు.
సీమాంధ్ర ఎంపీల మంతనాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంటోనీ కమిటీ ముందు ఏయే అంశాలను ప్రస్తావించాలనే దానిపై సీమాంధ్ర ప్రాంత కేంద్రమంత్రులు, ఎంపీలు సమాలోచనలు జరిపారు. ఎంపీ హర్షకుమార్ నివాసంలో బుధవారం ఉదయం జరిగిన అల్పాహార భేటీకి కేంద్రమంత్రులు కావూరి సాంబశివరావు, జేడీ శీలం, కిల్లి కృపారాణి, పురంధేశ్వరి, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, మాగుంట శ్రీనివాసులురెడ్డి, కనుమూరి బాపిరాజు, కేవీపీ, సాయిప్రతాప్ హాజరయ్యారు. పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అతి ముఖ్యమైన ఆహార భద్రత బిల్లును అడ్డుకుంటే పార్టీలో అసలుకే మోసం వస్తుందని భావించిన నేతలు బిల్లును అడ్డుకునే వ్యూహంపై వెనకడుగు వేశారు. విద్యార్థి, ఉద్యోగ సంఘాలు, పౌర సమాజ వ్యక్తుల నుంచి విజ్ఞప్తులు తీసుకునేలా ఆంటోనీ కమిటీని హైదరాబాద్‌కుగానీ లేదా సీమాంధ్రలోని మరేదైనా జిల్లాకుగానీ ప్రత్యేకంగా ఆహ్వానించాలని భేటీలో నేతలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.