ఆంటోని కమిటీ ఏమైంది?: మంత్రి కాసు కృష్ణారెడ్డి
నరసరావుపేట: రాష్ట్ర విభజన నిర్ణయం సీడబ్ల్యుసీలో తీసుకున్న తరువాత సీమాంధ్రలో సమస్యల గురించి చర్చించాలని వేసిన ఆంటోని కమిటీ ఏమైందని రాష్ట్ర సహకారశాఖ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి ప్రశ్నించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని తన ఇంటివద్ద బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంటోని కమిటీ సీమాంధ్రలో పర్యటించకుండానే మళ్లీ జీవోఎం అంటూ మరో కమిటీని వేశారని, 10 శాఖల మంత్రులు ఉండాల్సిన కమిటీలో ఐదుగురు మాత్రమే ఉండటం ఏమిటని అడిగారు. ఎన్ని కమిటీలు వేసినా సమైక్యాంధ్రప్రదేశ్ తమ నినాదమని స్పష్టం చేశారు. ఆంటోని కమిటీ సీమాంధ్రలోని ముఖ్య పట్టణాలన్నీ తిరిగి అక్కడ నాయకుడు లేకుండా ఉద్యమాలు జరిగిన పరిస్థితిని గమనించాలని కోరారు. తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా అధికశాతం ప్రత్యేక తెలంగాణ కోరుకోవడంలేదని చెప్పారు.
రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి అవసరమైతే తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికే ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా తమకు సమ్మతమేనన్నారు. తెలంగాణ నాయకులు కూడా దీనిపై పునరాలోచన చే యాలని కోరారు. విభజన నిర్ణయంపై కాంగ్రెస్ అధిష్టానం కూడా పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం విడిపోయిన తరువాత సీమాంధ్ర ముఖ్యమంత్రి రేసులో మీరున్నారా అని విలేకరులు ప్రశ్నించగా తమ కుటుంబం ముఖ్యమంత్రులను తయారుచేసిన కుటుంబమని చెప్పారు. పదవుల కోసం పాకులాడే అలవాటు తనకు లేదని, సమైక్యాంధ్రప్రదేశ్ కోసమే తాను చివరివరకు పోరాడతానని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో సభ్యత్వం ఉండటమే పెద్ద పదవిగా భావిస్తానన్నారు. ఇప్పటివరకు నీతి, నిజాయితీలతో ఉన్నానని, అవి తప్పాల్సివస్తే రాజకీయాల నుంచే తప్పుకొంటానని చెప్పారు.