సమస్యలన్నింటినీ జీవోఎం పరిష్కరిస్తుంది: దిగ్విజయ్‌సింగ్
రాష్ట్ర విభజన జరిగినంత మాత్రాన సీమాంధ్రులు చింతించాల్సిన పని లేదని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ అన్నారు. వారి సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు మంత్రుల బృందం పని చేస్తుందని చెప్పారు. సీమాంధ్రకు తగిన న్యాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. బుధవారం ఆయన కొన్ని తెలుగు చానళ్లతో మాట్లాడారు. సీమాంధ్రుల ప్రయోజనాలను కాపాడేందుకు ఆంటోనీ కమిటీ ఇప్పటికే ముసాయిదా తయారు చేసిందని, దాన్ని ఒకట్రెండు రోజుల్లో జీవోఎంకు అందిస్తామని చెప్పారు. రాజీనామా చేసిన ఎంపీలను పిలిచి మాట్లాడతానన్నారు. ‘‘వారంతా పార్టీ నిర్ణయాన్ని అర్థం చేసుకుని, దానికి కట్టుబడాలి. పార్టీ నిర్ణయానికి కట్టుబడతామన్న హామీని గుర్తుంచుకోవాలి’’ అన్నారు.
పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పిస్తే భద్రాచలాన్ని సీమాంధ్రలో కలపాల్సి వస్తుందా అని ప్రశ్నించగా, భద్రాచలం హోదాలో ఎలాంటి మార్పూ ఉండదని బదులిచ్చారు. అది తెలంగాణలో ఉన్నంతమాత్రాన పోలవరానికి ఎలాంటి ఇబ్బందీ ఉండబోదన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేసే విషయమై తానెవరితోనూ మాట్లాడలేదని, ఎలాంటి చర్చా చేయలేదని మరోసారి స్పష్టం చేశారు. ఇది సున్నితమైన అంశమని, దీనిపై జీవోఎం చూసుకుంటుందని బదులిచ్చారు. విభజన ఆగదని మీరు పదేపదే చెబుతున్నా, సీఎం కిరణ్ మాత్రం తన హయాంలో విభజన జరగబోదంటుండటాన్ని ప్రస్తావించగా, ‘సీఎంగా ఉన్నంతవరకు ఆయన హయామే. చూద్దాం (లెట్స్ సీ)’ అని బదులిచ్చారు. తాము ప్రాంతాలను విడగొట్టమన్నామే తప్ప ప్రజలను కాదన్న బీజేపీ వ్యాఖ్యలతో తానూ ఏకీభవిస్తానన్నారు.