
జీవోఎం నివేదికలో ఏముందో తెలియదు: దిగ్విజయ్
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజనపై ఏర్పడ్డ కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం) నివేదికలో ఏముందో తనకు తెలియదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యానించారు. జీవోఎం నివేదిక త్వరలోనే కేంద్ర కేబినెట్ ముందుకు వస్తుందని, కేబినెట్ ఆమోదించాక అసెంబ్లీకి తెలంగాణ బిల్లు వస్తుందని ఆయన సోమవారమిక్కడ తెలిపారు.
ఈ ప్రక్రియ త్వరలోనే ముగుస్తుందని దిగ్విజయ్ వెల్లడించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే బిల్లు వస్తుందని ఆశిస్తున్నట్లు దిగ్విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా రాయల తెలంగాణ అంశంపై వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు. వ్యక్తిగత సంభాషణల వివరాలు మీడియాకు చెప్పలేనని, రాయల తెలంగాణ అంశాన్ని తాను ఖండించదలుచుకోలేదని దిగ్విజయ్ అన్నారు.