రాష్ట్ర విభజనపై మంత్రుల కమిటీ కసరత్తు
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజనపై మంత్రుల కమిటీ కసరత్తు చేస్తోందని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తెలిపారు. వచ్చే నెల అయిదో తేదీలోపు ఇరు ప్రాంతాల ప్రజలు...వారి అభిప్రాయాలను జీవోఎంకు తెలియ చేయవచ్చని ఆయన మంగళవారమిక్కడ పేర్కొన్నారు. అభిప్రాయాలు తెలియచేయటం ద్వారా స్పష్టత వస్తుందని.... దాని ఆధారంగా ముందుకు వెళతామని దిగ్విజయ్ తెలిపారు.
మరోవైపు రాష్ట్ర విభజన ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది. విభజన నేపథ్యంలో తలెత్తే శాంతిభద్రతల సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలి, ఎటువంటి వ్యూహాలను, విధానాలను అనుసరించాలనే దానిపై కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారులతో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది.
టాస్క్‌ఫోర్స్‌కు రిటైర్డ్ ఐపీఎస్, ప్రస్తుతం కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సెక్యూరిటీ విభాగంలో సలహాదారుగా పనిచేస్తున్న కె. విజయ్ కుమార్ నేతృత్వం వహిస్తున్నారు. మరో ఎనిమిది మంది కేంద్ర ఉన్నతాధికారుల టాస్క్‌ఫోర్స్ బృందం మంగళవారం ఉదయం హైదరాబాద్ చేరుకుంది. ఈ బృందం నేటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌లో రాష్ట్రానికి చెందిన 18 మంది ఐపీఎస్‌లతో సమావేశం కానుంది.