kasu venkata krishna reddy
-
‘చంద్రబాబు ఆస్తి రెండు లక్షల కోట్లు’
తెలుగు రాష్ట్రాల్లో పోలీసు రాజ్యం నడుస్తోందని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి విమర్శించారు. శుక్రవారం రవీంద్రభారతిలో వైఎస్సార్ యువసేన అధ్యక్షుడు సి.రాజశేఖర్ ఆధ్వర్యంలో మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 67వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ఏపీలో రాజ్యహింస ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు పంటలు పండే బంగారు భూములను రైతుల నుంచి లాక్కొని సింగపూర్ కంపెనీలకు కట్టబెడుతున్నారన్నారు. ఇచ్చిన హామీలు ఏపీ సీఎం చంద్రబాబు పూర్తి విస్మరించారని ధ్వజమెత్తారు. ప్రజలు గమనిస్తున్నారని, సమయం వచ్చినపుడు బాబుకి గట్టిగా బుద్ధి చె బుతారన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ ప్రజా సంక్షేమ పధకాలను ఆలోచించి ప్రవేశపెట్టారన్నారు. పేదలకు సాంకేతికంగా ఎదిగేటట్లు చేసి, అందరూ ఉన్నత విద్య అభ్యసించేలా చేశారన్నారు. అలాంటి సంక్షేమ పధకాలతోనే వైఎస్సార్ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారని తెలిపారు. కానీ, అందుకు భిన్నంగా ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్తున్నారన్నారు. బాబు రైతుల భూములు లాల్కొని వ్యాపార దక్పధంతో ముందుకు వెళ్తున్నారన్నారు. ఆనాడు ప్రజల ఇందిరా గాంధీ అమ్మగాను, ఎన్టీఆర్‌ను అన్న గాను చూచారన్నారు. అదేస్థాయిలో వైఎస్సార్ కూడా పాలన సాగించి ప్రతి మనిషి హృదయంలో స్థానం సంపాదించుకున్నారని గుర్తుచేశారు. అందుకే వైఎస్సార్ ఇకలేడనగానే తమ ఇంట్లో మనిషి ఇక లేడన్నట్లుగా ప్రతి వ్యక్తి కంట తడిపెట్టారన్నారు. ఎన్నో గుండెలు ఆగిపోయాయని తెలిపారు. చట్ట సభలో చట్టాన్ని పరిరక్షించాల్సిన స్థానంలో ఉన్న వ్యక్తి తన నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యుని హక్కులను హరించేస్తున్నారని పరోక్షంగా ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గురించి విమర్శలు చేశారు. చంద్రబాబు, వైఎస్సార్, తాను మంచి మిత్రులమన్నారు. ఇద్దరం పట్టుబడితే ఆనాడు చంద్రబాబుకు సినిమాటోగ్రఫీ మంత్రి పదవి వచ్చిందన్నారు. మామ ఎన్టీఆర్పైనే పోటీ చేస్తానని ఆనాడు ఎన్నికల మందు చంద్రబాబు చెప్పాడు. కొన్ని రోజులకు చూస్తే ఎన్టీఆర్ పక్కన క న్పించాడు. మరికొన్ని రోజులకు ఏకంగా ఎన్టీఆర్ కుర్చీనే లాగేకున్నాడని విమర్శించారు. ఏపీలో కొత్తగా ఈ మధ్య పదవి ఉన్నప్పుడే దోచుకోండి అనే స్లోకన్ వినిపిస్తోందన్నారు. తన అప్తమిత్రుడు వైఎస్సార్ కుమారుడు జగన్ మోహన్ రెడ్డి మంచి బాటలో నడిచినంత కాలం అతనికి మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. తన తుది శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానన్నారు. ప్రతిపక్షం అంటే ప్రజల ముఖ్య సమస్యలపై స్పందించేదిగా, వినిపించేదిగా ఉండాలని, మీడియాలో కనపడేందుకు చీటికీ మాటికీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ రోడ్డు ఎక్కితే ప్రజల్లో చులనకవుతారని కాసు వెంకట క్రిష్ణారెడ్డి పరోక్షంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు చురకలంటించారు. మాజీ ప్రభుత్వ విప్ వై. శివరామిరెడ్డి మాట్లాడుతూ 2002లో ఓ ఛానెల్ సర్వే చేసి భారతదేశంలోనే అత్యంత ధనిక సీఎం చంద్రబాబు నాయుడుగా ప్రకటించిందన్నారు. వైఎస్సార్ హయంలో ఎకరా రూ. 10 వేలు ఉన్న భూమి విలువ ఆమాంతం పెరిగిపోయిందన్నారు. రాజధాని పేరుతో రైతుల భూములను దోచేసి టీడీపీ నాయకులు కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్నారన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆస్తి రూ.2 లక్షల కోట్లు పైనే ఉంటుందన్నారు. ప్రజలు మెచ్చిన పాలన చేసినందుకుకే ప్రపంచంలోని యావత్తు తెలుగు ప్రజలు ఈ రోజు వైఎస్సార్ తలుచుకుంటున్నారన్నారు. తొలుత వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం కాసేపు మౌనం పాటించారు. చివరల్లో మహిళలకు అంధులకు చీరలు పంపిణీ చేసి, అన్నదానం నిర్వహించారు. -
పార్టీలు మారేవారు, తీసుకునేవారు ఆత్మవిమర్శ చేసుకోవాలి
తిరుమల: రాజకీయ పార్టీలు మారేవారు, తీసుకునేవారు ఆత్మవిమర్శ చేసుకోవాలని మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తిరుమలలో మీడియాతో మాట్లాడారు. ఒక పార్టీ టికెట్టుపై గెలిచి, మరో పార్టీలోకి మార డం నైతికంగా సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలు నమ్మి ఓటే సిన పార్టీని కాదని, మరోపార్టీ మార డం అన్నదానిపై వారు ఆత్మవిమర్శ చేసుకుంటే సమాధానం తప్పక వస్తుందన్నారు. ప్రభుత్వంలో అభివృద్ధి కంటే ఆడంబరాలు పెరిగాయన్నారు. ఈ పరిస్థితి దేశ వ్యాప్తంగా ఉందన్నారు. ఈ పరిస్థితి మారకపోతే భవిష్యత్‌లో ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ చావులేదని, మళ్లీ మంచిరోజులు వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశా రు. రాష్ట్ర విభజనలో చెడులో మంచి జరుగుతోందని, దీనివల్ల విద్య, వైద్యం పరంగా సరికొత్త సంస్థలు రాష్ట్రానికి వస్తున్నాయని అన్నారు. -
ఇద్దరు మున్సిపల్ కమిషనర్లపై వేటు
నరసరావుపేట, మాచర్ల మున్సిపల్ కమిషనర్లు వీరభద్రరావు, గిరికుమార్‌లను ఎన్నికల విధుల నుంచి తొలగిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసిందని జిల్లా కలెక్టర్ ఎస్.సురేశ్‌కుమార్ బుధవారం తెలిపారు. పురపాలక సంఘాల ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల పరిశీలనలో అవకతవకలకు పాల్పడినట్లు రుజువు కావడంతో వీరిపై వేటు పడినట్లు సమాచారం. నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలోని 11 వార్డులో మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి అనుచరుడు వేలూరి సుబ్బారెడ్డి నామినేషన్‌ను తొలుత తిరస్కరించినట్లు ప్రకటించిన కమిషనర్ వీరభద్రరావు ఒత్తిడులకు తలొగ్గి తిరిగి అనుమతించేందుకు ప్రయత్నించిన విషయం విధితమే. వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్ధి ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్ధి డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు అర్ధరాత్రి వరకూ మున్సిపల్ కార్యాలయంలో ఆందోళన చేపట్టడంతో చివరకు తిరస్కరించినట్లు ప్రకటించారు. ఈ విషయంపై సీరియస్ అయిన ఎన్నికల సంఘం వీరభద్రరావును ఎన్నికల విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్‌కు ఉత్తర్వులు జారీ చేసింది. అదే విధంగా మాచర్ల మున్సిపాలిటీ పరిధిలోని 21, 22 వార్డుల్లో అన్నీ పార్టీల అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడంతో అన్నీ పార్టీల నాయకులు ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. దీనికితోడు 28వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్ధి నామినేషన్‌ను తిరస్కరించడంపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. వీటన్నింటినీ విచారించిన ఎన్నికల సంఘం మాచర్ల మున్సిపల్ కమిషనర్ గిరికుమార్‌ను ఎన్నికల విధుల నుంచి తొలగించారు. ఈ రెండు చోట్ల కొత్త కమిషనర్లను ఎన్నికల అధికారులుగా నియమించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఒక ప్రభుత్వ వైద్యునితోపాటు నలుగురు అంగన్వాడీలపై సస్పెన్షన్ వేటు మాచర్ల పట్టణంలో ఈ నెల 14వ తేదీన ఓపార్టీ అభ్యర్ధి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారని ‘సాక్షి’ ఫోటోతో కథనాన్ని ప్రచురించింది. దీంతో విచారణ జరిపిన ఎన్నికల సంఘం ఎన్నికల ప్రవర్తనా నియమావళి అతిక్రమించినందుకు మాచర్ల కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్ నల్లూరి కుమారస్వామిని విధుల నుంచి సస్పెండ్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. అదే విధంగా ఈ నెల 14వ తేదీన తెనాలిలో జరిగిన కాంగ్రెస్‌పార్టీ అభ్యర్ధి ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న నలుగురు అంగన్వాడీ కార్యకర్తలపై కూడా సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అంగన్వాడీ కార్యకర్తలు డి.అనూష, ఆర్.మధులత, ఎ.అరుణశ్రీ, వై.రాజేశ్వరిలను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. -
నా మెడికల్ సీటు కేవీపీకి ఇచ్చారు
సాక్షి, నరసరావుపేట :తాను రాజకీయాల్లోకి రాకుండా ఉండి ఉంటే పిల్లల వైద్య నిపుణుడినయ్యేవాడినని రాష్ట్ర సహకారశాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ గుల్బర్గాలో మెడిసిన్ చదివేందుకు వెళ్లానని, అయితే రాజకీయాలపై మక్కువతో వెనుదిరగడంతో ఆ సీటును కేవీపీ రామచంద్రరావుకు ఇచ్చారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర సమైక్యత, సమగ్రతపై అసెంబ్లీలో రాజకీయాలను పక్కనపెట్టి సమైక్యవాదాన్ని వినిపించాలని కోరారు. రాష్ట్ర సమైక్యత విషయంలో ఆ టర్న్, ఈ టర్న్ అనే పదాలు లేకుండా ఐక్యతతో ముందుకెళ్లాలని చెప్పారు. సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులంతా సమావేశం నిర్వహించి ఆ సమావేశానికి మంత్రులతో పాటు అన్ని రాజకీయ పక్షాలను ఒకచోటకు చేర్చడం హర్షణీయమన్నారు. జాతీయ, రాష్ట్ర నాయకుల విగ్రహాలను ధ్వంసం చేయడం మంచి పద్ధతి కాదని, వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. రాజీవ్‌గాందీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన సంఘటనపై డీజీపీతో మాట్లాడానని, దీనికి కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. నరసరావుపేట పట్టణంలో తెల్లవారుజామున మూడు గంటలకే మద్యం దుకాణాలు తెరుస్తున్నారని కొందరు మంత్రి కాసు దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే ఎక్సైజ్ సూపరింటెండెంట్‌కు ఫోన్ చేసి ఆగ్రహం వ్యక్తంచేశారు. నిబంధనల ప్రకారం వ్యవహరించాలని, లేనిపక్షంలో కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తానంటూ ఈఎస్‌ను హెచ్చరించారు.సమావేశంలో డాక్టర్ కొండపల్లి వెంకటేశ్వరరావు, మిట్టపల్లి కోటేశ్వరరావు, పెనుగొండవెంకటేశ్వర్లు, ఏలూరి సుబ్బారెడ్డి, నేలటూరి మురళి, దుర్గాబాబు తదితరులు ఉన్నారు. -
19న డీఆర్సీ
విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి: జిల్లా అభివృద్ధి సమీక్ష మండలి(డీఆర్సీ) సమావేశం ఈనెల 19న నిర్వహించనున్నారు. సహకారశాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డిని జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా ఇటీవల సీఎం నియమించారు. డీ డీఆర్సీ సమావేశం జరిగి దాదాపు ఏడాదవుతోంది. వెంటనే సమావేశం నిర్వహించాలని మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఇన్చార్జ్ మంత్రిని కోరారు. ఇన్చార్జ్ మంత్రి కోటాలో ఇందిరమ్మ ఇళ్లు, ఇతర పనుల మంజూరు అంశం చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉంది. దీనికి తోడు వచ్చే నెలలలో అసెంబ్లీ రద్దయ్యే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో సమావేశం నిర్వహించి వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించుకోవాలని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. ఈనెల 19న ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమావేశం జరుగుతుందని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు. ఇందుకు సంబంధించిన సమాచారం, నివేదికలు సిద్ధం చేయాలని ఇన్చార్జ్ మంత్రి ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రతిపక్షంతో పాటు స్వపక్ష సభ్యులు సైతం నీలం తుపాను నష్టపరిహారం పంపిణీ, ఇటీవల వచ్చిన పైలిన్, లెహర్ తుపానుల వల్ల జరిగిన పంట, ఇతర ఆస్తి నష్టం అంచనాలపై సమగ్రంగా కసరత్తు చేసి సవివరణ నివేదికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి. -
ఢిల్లీ పెద్దలకు అంతసీన్ లేదు: మంత్రి కాసు
నరసరావుపేట: రాష్ట్రాన్ని విభజించే హక్కు, అర్హత, ఆ స్థాయి ఢిల్లీ పెద్దలకు, కాంగ్రెస్‌పార్టీ అధిష్టానానికి లేదని రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని స్వయం సహాయక గ్రూపులకు రుణాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్‌పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరిస్తామని, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెంటే ఉంటూ రాష్ట్రం సమైక్యంగా ఉండేలా పోరాటం చేస్తామని చెప్పారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడం ఎవరి తరం కాదని, రాష్ట్రానికి దేవాలయం లాంటి అసెంబ్లీలో మా వాదన వినిపించి రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ముక్కలు కాకుండా చూసిన ఘనత కాసు కుటుంబానికి ఉందని, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న బ్రహ్మానందరెడ్డి ఇందిరాగాంధీకి ఎదురొడ్డి విభజనను అడ్డుకున్నారని గుర్తు చేశారు. ఆయన బాటలోనే తాను కూడా నడుస్తానని, రాష్ట్ర విభజనను అడ్డుకుంటానని చెప్పారు. -
కాసుల కోసమే..?
=ఏసీడీపీ నిధుల పందారానికి రెడీ! =ఎట్టకేలకు ఇన్చార్జి మంత్రిగా కాసు =కేడర్‌ను దక్కించుకోవడానికి నియామకం సాక్షి, విశాఖపట్నం: ఏసీడీపీ నిధుల వినియోగం కోసమేనా? పార్టీ ఖాళీ అవుతున్న వేళ కొత్త నాటకానికి తెరలేపారా? భవిష్యత్ రాజకీయాల్లో కేడర్ తమ వెంట ఉంచుకునే యత్నమేనా? ఇన్చార్జి మంత్రిగా కాసు వెంకట కృష్ణారెడ్డి తాజా నియామకం ఉద్దేశమదేనా?...అంటే అవుననే అనిపిస్తోంది. ఏడాదిగా జిల్లాకు ఇన్చార్జి మంత్రి లేరు. వారి కోటా కింద మంజూరైన రూ. కోట్ల ఏసీడీపీ(అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి ఫండ్స్) నిరుపయోగంగా ఉండి పోయాయి. దీంతో నియోజకవర్గాల అభివృద్ధి కుంటుపడింది. అయినా ఇన్చార్జిని నియమించే ప్రయత్నం సీఎం చేయలేదు. ఇదిగో అదిగో అని కాలం వెళ్లదీశారు. ఏసీడీపీ నిధుల్ని గాలికొదిలేశారు. జిల్లాలో 15 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.4.5 కోట్లు విడుదలవ్వగా, గతేడాదికి సంబంధించి రూ.8.5 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో గతేడాదికి సంబంధించి సుమారు రూ.కోటి మాత్రమే ఖర్చయింది. వాస్తవానికి నియోజకవర్గాల్లో వివిధ అవసరాలు, పనుల నిమిత్తం ఎమ్మెల్యేలు ప్రతిపాదనలు పంపితే, వాటికి ఇన్చార్జి మంత్రి తన వాటాలో నిధులను మంజూరు చేస్తారు. ఇన్చార్జి మంత్రిగా ఉన్న ధర్మానప్రసాదరావు రాజీనామా చేశాక న్యాయ శాఖామంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డి నియమిస్తారని ప్రచారం జరిగినా, అది కార్యరూపం దాల్చలేదు. దీంతో ఈసారికింతే అన్న వాదన వ్యక్తమైంది. అలాగే ఏసీడీపీ నిధులకు మోక్షం కలగ లేదు. ఇంతలో రాష్ట్ర విభజన రచ్చతో కాంగ్రెస్ ఖాళీ అయ్యే పరిస్థితి నెలకొంది. దాదాపు కేడర్ దూరమవుతోంది. రకరకాల రాజకీయ ఊహాగానాలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో తాజా పరిస్థితిపై సీఎం దృష్టిసారించారు. ఇన్చార్జి మంత్రిగా సహకారశాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డిని నియమించారు. యుద్ధప్రాతిపదికన ఏసీడీపీ నిధులను ఖర్చు పెట్టే అంకానికి తెరలేపారు. అనుకూల వ్యక్తులకు ఆ పనులు కట్టబెట్టి భవిష్యత్ రాజకీయాల్లో కేడర్‌ను తమ వెంట తిప్పుకునేందుకు అధికారపార్టీ నాయకులు యత్నిస్తున్నారు. అయితే సీఎం ఎత్తుగడ ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి. ఏదేమైనా ఇన్చార్జి మంత్రి కోటాలో విడుదలైన ఏసీడీపీ నిధులకు మోక్షం కలగనుంది. -
సీమ ప్రజలు అంగీకరించరు : మంత్రి కాసు
హైదరాబాద్: రాయలసీమను విభజించి రాయల తెలంగాణను ఏర్పాటు చేస్తామంటే పౌరుషం గల సీమ ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించరని సహకార శాఖ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం కాసు విలేకరులతో మాట్లాడారు. రాష్ర్ట విభజన జరగదని గట్టిగా విశ్వస్తున్నానని, పరిణామాలన్నీ అలాగే జరుగుతున్నాయని కాసు అన్నారు. కేంద్రంలో రెండు సార్లు కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమేనని ఆయన అన్నారు. వరదల వల్ల నష్టపోయిన రైతులను కేంద్రం ఆదుకోవాలని ఆయన కోరారు. -
సహకార సంఘాలు బలోపేతమవ్వాలి
కందుకూరు, న్యూస్‌లైన్: సహకార సంఘాలు బలోపేతమైనప్పుడే రైతులు, కూలీలకు ప్రయోజనాలు చేకూరుతాయని సహకార శాఖ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆయన కందుకూరులోని నవారు కిష్టమ్మ ఫంక్షన్ హాల్లో 60వ అఖిల భారత సహకార వారోత్సవాలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ సహకార వారోత్సవాలను నెహ్రూ పుట్టిన రోజున ఇక్కడ జరుపుకోవడం శుభపరిణామమన్నారు. రాష్ట్రంలో తుపానులతోపాటు ఇతర ప్రకృతి వైపరీత్యాల కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వారందరికీ పరిహారం ఇచ్చి ఆదుకుంటామని చెప్పారు. ధాన్యం కొనుగోలుకు 25 కేంద్రాలు: సబితారెడ్డి జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు చేయడానికి 25కేంద్రాలు ఏర్పాటు చేయనున్నామని మాజీ హోంమంత్రి సబితారెడ్డి పేర్కొన్నారు. అదనంగా పత్తి కొనుగోలు కేంద్రాలను ఇబ్రీహ ంపట్నం, తాండూరులో ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. లోగో ఆవిష్కరణ సహకార వారోత్సవాల లోగో, పుస్తకాన్ని మంత్రి వెంకటకృష్ణారెడ్డి, మాజీ మంత్రి సబితారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం సహకారశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని, సహకార ఫ్యూరీఫైడ్ వాటర్ సరఫరా కేంద్రాన్ని ప్రారంభించి సహకార సంఘాల ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో జేసీ ఎంవీ రెడ్డి, రాష్ట్ర సహకార యూనియన్ చైర్మన్ బుస్సు చెన్నకృష్ణారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శ్రవణ్‌కుమార్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్లు వెదిరె నర్సింగంరెడ్డి, అంజయ్యయాదవ్, వైస్ చైర్మన్ ఎస్.ఎల్లారెడ్డి, జేడీఏ విజయ్‌కుమార్, హాకా డెరైక్టర్ కృష్ణమూర్తి, రాష్ట్ర సహకార సంఘం యూనియన్ డెరైక్టర్ జి.శ్రీనివాసరావు, పీఏసీఎస్ డెరైక్టర్లు అక్కి యాదయ్య, బాల్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, జంగయ్య, మల్లేష్, రాములు, యాదమ్మ, లక్ష్మమ్మ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సురేందర్‌రెడ్డి, నాయకులు ఈశ్వర్‌గౌడ్, ఆర్.ప్రభాకర్‌రెడ్డి, కురుణాకర్రెడ్డి, కృష్ణనాయక్, ఇజ్రాయిల్, శివమూర్తి, రైతులు పాల్గొన్నారు. -
ఆంటోని కమిటీ ఏమైంది?: మంత్రి కాసు కృష్ణారెడ్డి
నరసరావుపేట: రాష్ట్ర విభజన నిర్ణయం సీడబ్ల్యుసీలో తీసుకున్న తరువాత సీమాంధ్రలో సమస్యల గురించి చర్చించాలని వేసిన ఆంటోని కమిటీ ఏమైందని రాష్ట్ర సహకారశాఖ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి ప్రశ్నించారు. గుంటూరు జిల్లా నరసరావుపేటలోని తన ఇంటివద్ద బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంటోని కమిటీ సీమాంధ్రలో పర్యటించకుండానే మళ్లీ జీవోఎం అంటూ మరో కమిటీని వేశారని, 10 శాఖల మంత్రులు ఉండాల్సిన కమిటీలో ఐదుగురు మాత్రమే ఉండటం ఏమిటని అడిగారు. ఎన్ని కమిటీలు వేసినా సమైక్యాంధ్రప్రదేశ్ తమ నినాదమని స్పష్టం చేశారు. ఆంటోని కమిటీ సీమాంధ్రలోని ముఖ్య పట్టణాలన్నీ తిరిగి అక్కడ నాయకుడు లేకుండా ఉద్యమాలు జరిగిన పరిస్థితిని గమనించాలని కోరారు. తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా అధికశాతం ప్రత్యేక తెలంగాణ కోరుకోవడంలేదని చెప్పారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి అవసరమైతే తెలంగాణ ప్రాంతానికి చెందిన వారికే ముఖ్యమంత్రి పదవి ఇచ్చినా తమకు సమ్మతమేనన్నారు. తెలంగాణ నాయకులు కూడా దీనిపై పునరాలోచన చే యాలని కోరారు. విభజన నిర్ణయంపై కాంగ్రెస్ అధిష్టానం కూడా పునరాలోచించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం విడిపోయిన తరువాత సీమాంధ్ర ముఖ్యమంత్రి రేసులో మీరున్నారా అని విలేకరులు ప్రశ్నించగా తమ కుటుంబం ముఖ్యమంత్రులను తయారుచేసిన కుటుంబమని చెప్పారు. పదవుల కోసం పాకులాడే అలవాటు తనకు లేదని, సమైక్యాంధ్రప్రదేశ్ కోసమే తాను చివరివరకు పోరాడతానని పేర్కొన్నారు. కాంగ్రెస్‌లో సభ్యత్వం ఉండటమే పెద్ద పదవిగా భావిస్తానన్నారు. ఇప్పటివరకు నీతి, నిజాయితీలతో ఉన్నానని, అవి తప్పాల్సివస్తే రాజకీయాల నుంచే తప్పుకొంటానని చెప్పారు. -
రైతులను ఆదుకునేందుకు సాయం చేయండి:మంత్రి కాసు
న్యూఢిల్లీ: ఇటీవలి వరదలతో ఆంధ్రప్రదేశ్ రైతులు చాలా నష్టపోయారని, వారు కొత్త పంటలు వేసుకునేందుకు తగిన సాయం అందించాలని రాష్ట్ర సహకార మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి తారిక్ అన్వర్, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీకాంత్ జెనా, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మలను కలిసి వరద నష్టాన్ని వివరించారు. కొత్త పంటల కోసం రైతులకు విత్తనాలు, ఎరువులు తగిన మొత్తంలో అందించడంలో రాష్ట్రానికి సహాయపడాలని మంత్రులను కోరినట్టు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు జిల్లాలో పత్తి పంట నష్టాన్ని జౌళి శాఖ మంత్రి కావూరు సాంబశివరావు దృష్టికి తీసుకెళ్లానని, రంగుమారిన/దెబ్బతిన్న 2,34,362 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయడానికి సీసీఐతో వెంటనే పత్తి కొనుగోలు కేంద్రాలను తెరిపించాలని కోరానన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు మోతీలాల్ వోరా, జనార్దన్ ద్వివేదిలను కలిసి సమైక్యాంధ్ర ప్రాధాన్యాన్ని వివరించానని కాసు పేర్కొన్నారు. -
కేంద్ర నిర్ణయం దుర్మార్గపు చర్య: కాసు
కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నోట్‌ను ఆమోదించడం దుర్మార్గమైన, అన్యాయమైన, అక్రమమైన చర్య అని రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి మండిపడ్డారు. గురువారం రాత్రి సాక్షితో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఏకపక్ష నిర్ణయాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ మొట్టమొదటగా రాజీనామాలేఖను సీఎంకు తానే అందించానని, శుక్రవారం సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని కలిసి ఆ లేఖను గవర్నర్‌కు పంపి ఆమోదింప చేయాలని కోరతానని చెప్పారు. తన నియోజకవర్గానికి వచ్చి కార్యకర్తలతో సమావేశమయ్యాక తుది నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. -
రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు కృషి : కాసు
తాను సమైక్యవాదం గల కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా సీమాంధ్ర ప్రజల సెంటిమెంట్‌ను గౌరవిస్తానని రాష్ట్ర మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి శుక్రవారం హైదరాబాద్‌లో వెల్లడించారు. తమ కుటుంబం సమైక్యవాదాన్ని బలపరిచిన కుటుంబమని ఆయన పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రజల అభిప్రాయాలను ఆంటోని కమిటీ ముందు వినిపిస్తానని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు తన వంతు కృషి చేస్తానని కాసు కృష్ణారెడ్డి ఈ సందర్బంగా భరోసా ఇచ్చారు. సమైక్యవాదానికి మద్దతుగా ఇటీవలే కాసు తన మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మంత్రులు గంటా శ్రీనివాసరావు, ఏరాసు ప్రతాప్ రెడ్డి, టీజీ వెంకటేష్ లు గతంలోనే రాజీనామా చేయగా, మంత్రి తోట నర్సింహం నిన్న తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.