న్యూఢిల్లీ: ఇటీవలి వరదలతో ఆంధ్రప్రదేశ్ రైతులు చాలా నష్టపోయారని, వారు కొత్త పంటలు వేసుకునేందుకు తగిన సాయం అందించాలని రాష్ట్ర సహకార మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో శుక్రవారం ఆయన కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి తారిక్ అన్వర్, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీకాంత్ జెనా, వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి ఆనంద్ శర్మలను కలిసి వరద నష్టాన్ని వివరించారు. కొత్త పంటల కోసం రైతులకు విత్తనాలు, ఎరువులు తగిన మొత్తంలో అందించడంలో రాష్ట్రానికి సహాయపడాలని మంత్రులను కోరినట్టు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.
గుంటూరు జిల్లాలో పత్తి పంట నష్టాన్ని జౌళి శాఖ మంత్రి కావూరు సాంబశివరావు దృష్టికి తీసుకెళ్లానని, రంగుమారిన/దెబ్బతిన్న 2,34,362 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేయడానికి సీసీఐతో వెంటనే పత్తి కొనుగోలు కేంద్రాలను తెరిపించాలని కోరానన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు మోతీలాల్ వోరా, జనార్దన్ ద్వివేదిలను కలిసి సమైక్యాంధ్ర ప్రాధాన్యాన్ని వివరించానని కాసు పేర్కొన్నారు.