19న డీఆర్‌సీ
విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి: జిల్లా అభివృద్ధి సమీక్ష మండలి(డీఆర్‌సీ) సమావేశం ఈనెల 19న నిర్వహించనున్నారు. సహకారశాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డిని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రిగా ఇటీవల సీఎం నియమించారు. డీ డీఆర్‌సీ సమావేశం జరిగి దాదాపు ఏడాదవుతోంది. వెంటనే సమావేశం నిర్వహించాలని మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలు ఇన్‌చార్జ్ మంత్రిని కోరారు.
ఇన్‌చార్జ్ మంత్రి కోటాలో ఇందిరమ్మ ఇళ్లు, ఇతర పనుల మంజూరు అంశం చాలా కాలం నుంచి పెండింగ్‌లో ఉంది. దీనికి తోడు వచ్చే నెలలలో అసెంబ్లీ రద్దయ్యే అవకాశం ఉందనే వార్తల నేపథ్యంలో సమావేశం నిర్వహించి వివిధ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయించుకోవాలని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. ఈనెల 19న ఉదయం 10 గంటలకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సమావేశం జరుగుతుందని మంత్రి గంటా శ్రీనివాసరావు చెప్పారు.
ఇందుకు సంబంధించిన సమాచారం, నివేదికలు సిద్ధం చేయాలని ఇన్‌చార్జ్ మంత్రి ఇప్పటికే జిల్లా అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ప్రతిపక్షంతో పాటు స్వపక్ష సభ్యులు సైతం నీలం తుపాను నష్టపరిహారం పంపిణీ, ఇటీవల వచ్చిన పైలిన్, లెహర్ తుపానుల వల్ల జరిగిన పంట, ఇతర ఆస్తి నష్టం అంచనాలపై సమగ్రంగా కసరత్తు చేసి సవివరణ నివేదికలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు అందాయి.