ఢిల్లీ పెద్దలకు అంతసీన్ లేదు: మంత్రి కాసు
నరసరావుపేట: రాష్ట్రాన్ని విభజించే హక్కు, అర్హత, ఆ స్థాయి ఢిల్లీ పెద్దలకు, కాంగ్రెస్‌పార్టీ అధిష్టానానికి లేదని రాష్ట్ర సహకార శాఖ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి విమర్శించారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని స్వయం సహాయక గ్రూపులకు రుణాలు పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని విభజించాలన్న కాంగ్రెస్‌పార్టీ అధిష్టాన నిర్ణయాన్ని ధిక్కరిస్తామని, ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి వెంటే ఉంటూ రాష్ట్రం సమైక్యంగా ఉండేలా పోరాటం చేస్తామని చెప్పారు.
రాష్ట్రాన్ని ముక్కలు చేయడం ఎవరి తరం కాదని, రాష్ట్రానికి దేవాలయం లాంటి అసెంబ్లీలో మా వాదన వినిపించి రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని ముక్కలు కాకుండా చూసిన ఘనత కాసు కుటుంబానికి ఉందని, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న బ్రహ్మానందరెడ్డి ఇందిరాగాంధీకి ఎదురొడ్డి విభజనను అడ్డుకున్నారని గుర్తు చేశారు. ఆయన బాటలోనే తాను కూడా నడుస్తానని, రాష్ట్ర విభజనను అడ్డుకుంటానని చెప్పారు.