ఏమిచేసినా.. అడిగేవారెవరూ.. అడిగినా.. సవాలక్ష వంకలు సిద్ధంగా ఉన్నాయి. మనం ఏమిచేసినా కప్పిపుచ్చుకోవచ్చు.. అనుకుంటే పొరబడినట్టే అని.. తెలంగాణ ఎన్నికల్లో టీడీపీకి ఎదురైన ఘోర పరాభవం గుణపాఠం చెబుతోంది. గద్దెనెక్కేందుకు ఎన్ని అడ్డదారులైనా తొక్కొచ్చని అనుకుంటే జనం ఓటు అనే వజ్రాయుధంతో తాటతీసి ఇంట్లో కూర్చోబెట్టేస్తారని స్పష్టమైంది. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీ సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి హస్తంతో అంటకాగడానికి ఉవ్విళ్లూరిన ఫలితం ఇంత ఘోరంగా ఎదురుదెబ్బతీçస్తుందని బహుశా టీడీపీ శ్రేణులు అంచనా వేసి ఉండకపోవచ్చు. అందుకే ప్రస్తుతం టీడీపీ శ్రేణులు అంతర్మథనంలో పడ్డాయి.
సాక్షి, గుంటూరు: తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ భాగస్వామిగా ఉన్న కాంగ్రెస్ కూటమికి ఘోర పరాజయం ఎదురవడంతో జిల్లాలోని టీడీపీ నేతలు, శ్రేణులు తీవ్ర నైరాశ్యంలో ఉన్నారు. తెలంగాణాలో 13 స్థానాల్లో పోటీచేసి చావుతప్పి కన్నులొట్టబోయినట్లు కేవలం రెండు స్థానాల్లో గెలవడం టీడీపీ నేతలను ఆందోళనకు గురిచేసింది. ఎన్టీఆర్ మనవరాలు, హరికృష్ణ కుమార్తె నందమూరి సుహాసిని సైతం ఘోరంగా ఓటమి చెందడం టీడీపీ శ్రేణులను తీవ్ర ఆవేదనకు గురిచేసింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని జిల్లాగా ఉన్న గుంటూరు జిల్లా టీడీపీ నేతలు అంతర్మథనంలో కూరుకుపోయారు. తెలంగాణాలో తాముబలంగా ఉన్నామనుకున్న 13 చోట్ల మాత్రమే పోటీ చేసినా కేవలం రెండు స్థానాల్లో మాత్రమే గెలవడం పార్టీ ఉనికినే ప్రశ్నార్థకంగా చేసిందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. చంద్రబాబు తెలం గాణ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే కుట్ర లకు తెరతీసి విఫలం అయ్యారని, ఆంధ్రాలో జరిగే ఎన్నికల్లో తాము వేలుపెట్టి టీడీపీ అంతు తేలుస్తామంటూ టీఆర్‌ఎస్ చేసిన వ్యాఖ్యలు టీడీపీ శ్రేణులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. అసలే ప్రభుత్వ వ్యతిరేకత, పార్టీ నేతల మితిమీరిన అవినీతిపై ప్రజలు ఆగ్రహంతో ఉన్న సమయంలో చంద్రబాబు తెలంగాణాలో చేసిన ప్రయోగం తమ పార్టీని ముంచబోతుందనే ఆందోళన టీడీపీ నేతలను హడలెత్తిస్తోంది.
జిల్లాలో టీడీపీని వీడాలనే తలంపులో సీనియర్లు
జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్, ఒకరిద్దరు టీడీపీ ముఖ్యనేతలు పాల్పడుతున్న దోపిడీని తట్టుకోలేక సొంత పార్టీ నేతలు, కార్యకర్తలే తీవ్ర ఆగ్రహంతో ఉన్నా రు. టీడీపీలో అవమానాలు తట్టుకోలేకపోతున్నామంటూ ఇటీవల పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి బయటకు వచ్చిన మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. టీడీపీలో సామాజిక వర్గానికి మినహా మిగతా సామాజిక వర్గాలకు పదవులు తప్ప, అధికారం ఇవ్వరంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో జిల్లాలోని అనేక మంది టీడీపీ ప్రజాప్రతినిధులు అంతర్గతంగా ఏకీభవిస్తున్నారు. ఈ తరుణంలో తెలంగాణలో టీడీపీకి ఎదురుదెబ్బ తగలడంతో అసంతృప్తితో ఉన్న నేతలంతా పార్టీని వీడేందుకు సమాయత్తం అవుతున్నారు. దీంతో టీడీపీ నేతలు, శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. రాజధాని జిల్లాలోనే పరిస్థితి ఇలా ఉంటే ఇంక మిగతా జిల్లాల్లో పరిస్థితి ఏమిటంటూ వారు భయాందోళన చెందుతున్నారు. ఎన్నికలు దగ్గరపడే కొద్దీ జిల్లాలో టీడీపీ ఖాళీ కావడం ఖాయమని సొంతపార్టీ నేతలే వ్యాఖ్యానిస్తున్న పరిస్థితి.
వెంటాడుతున్న కూటమి ఓటమి
జాతీయ స్థాయిలో చక్రం తిప్పుతానంటూ గొప్పలు పోయిన టీడీపీ అధినేత చంద్రబాబు తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో జరిగిన మొదటి ఎన్నికల్లోనే బొక్క బోర్లాపడడంతో టీడీపీ అవహేళన పాలైందని జిల్లా నాయకులు అంతర్గత చర్చల్లో అంగీకరిస్తున్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు, వినుకొండ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కూకట్‌పల్లిలో చేసిన ప్రచారం వృథాగా మారిందని పేర్కొంటున్నారు. ఫలితాలు రాకముందే తెలంగాణలో తమ అభ్యర్థులు గెలిచినట్లు, ఒడిశాలో సైతం పోటీ చేస్తామంటూ టీడీపీ నేతలు కొందరు చేసిన వ్యాఖ్యలు పరువు పోగొట్టుకునే విధంగా మారాయి. ఆంధ్రప్రదేశ్‌లో మరో ఐదునెలల్లో ఎన్నికలు రానున్న నేపథ్యంలో అధినేత చంద్రబాబు తెలంగాణ వెళ్లి కూటమి పేరుతో హడావుడి చేసి కనీవినీ ఎరుగని రీతిలో ఓటమిని మూటగట్టుకోవడం అసలుకే ముప్పు తెచ్చిం దని టీడీపీ నేతలు అంతర్మ«థనం చెందుతున్నారు. ఆంధ్రాలో సైతం రానున్న ఎన్నికల్లో ఇదే పరిస్థితి ఎదురవుతుందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని, ఇది టీడీపీ మనుగడను ప్రశ్నార్థకం చేస్తుందని ప్రజలు చెప్పుకొంటున్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు సైతం మనోస్థైర్యాన్ని కోల్పోయిన ప్రమాదకర స్థితి టీడీపీలో నెలకొందని సొంత పార్టీ నేతలు అనుకుంటున్నారు.
నిండా ముంచిన లగడపాటి సర్వే
తెలంగాణలో టీడీపీ ఘోర పరాజయం పాలైందనే వాదన టీడీపీ నేతలు, శ్రేణులను వేదనకు గురిచేస్తుంటే మరోవైపు లగడపాటి సర్వేను నమ్మి పందేలు కాసి కోట్లల్లో డబ్బులు పోగొట్టుకున్న ఆ పార్టీ శ్రేణుల పరిస్థితి దయనీయంగా మారింది. ఓటమి ఖాయమని తెలిసినప్పటికీ లగడపాటి తప్పుడు సర్వే, కూటమి అధికారంలోకి వస్తుందని నమ్మించి తమను గుల్లచేశారంటూ టీడీపీ నాయకులే బహిరంగంగా తిట్టిపోస్తున్నారు. ఓవైపు ఓటమి బాధ.. మరోవైపు ఆర్థిక నష్టంతో ఎవరికి చెప్పుకోవాలో, ఏమని చెప్పాలో తెలియక తమలో తామే సతమతమవుతున్నారు. టీడీపీ ఓటమి రానున్న ఆంధ్రా ఎన్నికల్లో సైతం పునరావృతమవుతుందని ఆ పార్టీ నేతలు అంగీకరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment