తెలుగు రాష్ట్రాల్లో పోలీసు రాజ్యం నడుస్తోందని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి విమర్శించారు. శుక్రవారం రవీంద్రభారతిలో వైఎస్సార్ యువసేన అధ్యక్షుడు సి.రాజశేఖర్ ఆధ్వర్యంలో మహానేత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 67వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ... ఏపీలో రాజ్యహింస ఎక్కువైందని ఆవేదన వ్యక్తం చేశారు. మూడు పంటలు పండే బంగారు భూములను రైతుల నుంచి లాక్కొని సింగపూర్ కంపెనీలకు కట్టబెడుతున్నారన్నారు.
ఇచ్చిన హామీలు ఏపీ సీఎం చంద్రబాబు పూర్తి విస్మరించారని ధ్వజమెత్తారు. ప్రజలు గమనిస్తున్నారని, సమయం వచ్చినపుడు బాబుకి గట్టిగా బుద్ధి చె బుతారన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ ప్రజా సంక్షేమ పధకాలను ఆలోచించి ప్రవేశపెట్టారన్నారు. పేదలకు సాంకేతికంగా ఎదిగేటట్లు చేసి, అందరూ ఉన్నత విద్య అభ్యసించేలా చేశారన్నారు. అలాంటి సంక్షేమ పధకాలతోనే వైఎస్సార్ ప్రజల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారని తెలిపారు. కానీ, అందుకు భిన్నంగా ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు వెళ్తున్నారన్నారు. బాబు రైతుల భూములు లాల్కొని వ్యాపార దక్పధంతో ముందుకు వెళ్తున్నారన్నారు.
ఆనాడు ప్రజల ఇందిరా గాంధీ అమ్మగాను, ఎన్టీఆర్‌ను అన్న గాను చూచారన్నారు. అదేస్థాయిలో వైఎస్సార్ కూడా పాలన సాగించి ప్రతి మనిషి హృదయంలో స్థానం సంపాదించుకున్నారని గుర్తుచేశారు. అందుకే వైఎస్సార్ ఇకలేడనగానే తమ ఇంట్లో మనిషి ఇక లేడన్నట్లుగా ప్రతి వ్యక్తి కంట తడిపెట్టారన్నారు. ఎన్నో గుండెలు ఆగిపోయాయని తెలిపారు. చట్ట సభలో చట్టాన్ని పరిరక్షించాల్సిన స్థానంలో ఉన్న వ్యక్తి తన నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యుని హక్కులను హరించేస్తున్నారని పరోక్షంగా ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్ గురించి విమర్శలు చేశారు. చంద్రబాబు, వైఎస్సార్, తాను మంచి మిత్రులమన్నారు.
ఇద్దరం పట్టుబడితే ఆనాడు చంద్రబాబుకు సినిమాటోగ్రఫీ మంత్రి పదవి వచ్చిందన్నారు. మామ ఎన్టీఆర్‌పైనే పోటీ చేస్తానని ఆనాడు ఎన్నికల మందు చంద్రబాబు చెప్పాడు. కొన్ని రోజులకు చూస్తే ఎన్టీఆర్ పక్కన క న్పించాడు. మరికొన్ని రోజులకు ఏకంగా ఎన్టీఆర్ కుర్చీనే లాగేకున్నాడని విమర్శించారు. ఏపీలో కొత్తగా ఈ మధ్య పదవి ఉన్నప్పుడే దోచుకోండి అనే స్లోకన్ వినిపిస్తోందన్నారు. తన అప్తమిత్రుడు వైఎస్సార్ కుమారుడు జగన్ మోహన్ రెడ్డి మంచి బాటలో నడిచినంత కాలం అతనికి మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నానన్నారు. తన తుది శ్వాస వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానన్నారు. ప్రతిపక్షం అంటే ప్రజల ముఖ్య సమస్యలపై స్పందించేదిగా, వినిపించేదిగా ఉండాలని, మీడియాలో కనపడేందుకు చీటికీ మాటికీ ప్రభుత్వాన్ని ఎండగడుతూ రోడ్డు ఎక్కితే ప్రజల్లో చులనకవుతారని కాసు వెంకట క్రిష్ణారెడ్డి పరోక్షంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలకు చురకలంటించారు.
మాజీ ప్రభుత్వ విప్ వై. శివరామిరెడ్డి మాట్లాడుతూ 2002లో ఓ ఛానెల్ సర్వే చేసి భారతదేశంలోనే అత్యంత ధనిక సీఎం చంద్రబాబు నాయుడుగా ప్రకటించిందన్నారు. వైఎస్సార్ హయంలో ఎకరా రూ. 10 వేలు ఉన్న భూమి విలువ ఆమాంతం పెరిగిపోయిందన్నారు. రాజధాని పేరుతో రైతుల భూములను దోచేసి టీడీపీ నాయకులు కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్నారన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆస్తి రూ.2 లక్షల కోట్లు పైనే ఉంటుందన్నారు. ప్రజలు మెచ్చిన పాలన చేసినందుకుకే ప్రపంచంలోని యావత్తు తెలుగు ప్రజలు ఈ రోజు వైఎస్సార్ తలుచుకుంటున్నారన్నారు. తొలుత వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం కాసేపు మౌనం పాటించారు. చివరల్లో మహిళలకు అంధులకు చీరలు పంపిణీ చేసి, అన్నదానం నిర్వహించారు.