సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో సీమాంధ్రలో పెల్లుబికిన ప్రజాగ్రహం, విభజనతో జరిగే నష్టాలను స్వయంగా తెలుసుకునేందుకు ఆంటోనీ కమిటీ రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉందని, ఈ సమాచారం తనకు కూడా అందిందని సీమాంధ్రకు చెందిన కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు చెప్పారు. రాష్ర్టంలో నెలకొన్న సమస్యలను ఆంటోనీ కమిటీ పరిశీలిస్తుందని, విభజన ప్రకటనపై సవరణ కూడా చేసే అవకాశం ఉందని అన్నారు. జాతీయ టెక్స్‌టైల్ కార్పొరేషన్ ఉత్పత్తి చేసిన ‘ఇండియన్ రిపబ్లిక్’ బ్రాండ్ దుస్తుల ప్రారంభ కార్యక్రమం బుధవారం ఇక్కడ జరిగింది. దీనికి వచ్చిన కావూరి కొద్దిసేపు మీడియాతో మాట్లాడారు. రూ. 2 వేల కోట్లతో రాష్ట్రంలో 4 టెక్స్‌టైల్ పార్కులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. కావూరి వెంట కేంద్ర మంత్రి చిరంజీవి, రాష్ట్ర మంత్రి పితాని సత్యనారాయణ తదితరులున్నారు.