రాజీనామాల్లేవ్! | we didn't demand on resignations, says kavuri sambasivarao | Sakshi
Sakshi News home page

రాజీనామాల్లేవ్!

Published Sun, Sep 15 2013 2:17 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM

we didn't demand on resignations, says kavuri sambasivarao

* రాజీనామా డిమాండ్ మీడియా సృష్టే.. సీమాంధ్ర కేంద్రమంత్రుల అసహనం
* పదవుల నుంచి వైదొలగమని ప్రజలెవరూ అడగడం లేదు..
* ఎప్పుడు ఏం చేయాలనే తెలివితేటలు మాకున్నాయి
* మా ఒత్తిడితోనే ఆంటోనీ కమిటీ వచ్చింది.. త్వరలో మంత్రుల కమిటీ వేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు
* సమైక్యంగా ఉంచాలని సోనియా, రాహుల్‌గాంధీలను కోరతాం
* హైకమాండ్ పునరాలోచనలో పడినట్లు కనిపిస్తోంది
* పరిణామాలను చూస్తే విభజన ప్రక్రియ ఆగినట్లే కనిపిస్తోంది
* హైదరాబాద్‌లో సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీల భేటీ
 
 ‘‘సీమాంధ్ర మంత్రులు పదవుల నుంచి తప్పుకోవాలని, ఎంపీలు రాజీనామా చేయాలని ప్రజలు కోరుతున్నారని మీడియా కాకమ్మ కథలు అల్లుతోంది. ప్రజాభిప్రాయుంపై మీడియా స్పందించటం లేదు. ప్రజల పేరుతో, మీడియానే స్పందిస్తోంది.’’
 - కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు
 
 ‘‘మేం రాజీనామా చేయాలని ఏ ప్రజలు అడిగారు? పేర్లు చెప్పండి? రాజీనామా ఎవరూ అడగటం లేదు. ఇదంతా మీడియా సృష్టి. చానళ్లు, పత్రికల మధ్యనున్న పోటీ, ఇతర కారణాలవల్లే ఇదంతా జరుగుతోంది.’’
 - మరో కేంద్రమంత్రి జె.డి.శీలం
 
 ‘‘కావూరి సాంబశివరావు మాటపైనే మేమంతా నిలబడ్డాం. అందరం కలిసి ఒకే నిర్ణయం తీసుకుంటాం తప్ప మాకు పదవులు ముఖ్యం కాదు. ప్రజల ఆందోళన, ఆకాంక్షల ముందు మా పదవులు చాలా చిన్నవి. ఏదో ఒక కారణంతో పదవులను చంకలో పెట్టుకుని తిరిగే గాడిదలు ఎవరూ లేరిక్కడ.’’
 - టీటీడీ చైర్మన్ బాపిరాజు
  సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు రాజీనామాలకు సిద్ధపడ్డారంటూ జరిగిన ప్రచారమంతా వట్టిదేనని తేలింది. సీమాంధ్ర కేంద్రమంత్రులు శనివారం హైదరాబాద్‌లో మీడియా ముందు చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే.. రాజీనామాలు చేసే ఉద్దేశమే వారికి లేదని తేటతెల్లమవుతోంది. తమ రాజీనామాల డిమాండ్ అనేది మీడియా సృష్టేనంటూ వారంతా కొట్టిపారేశారు.
 
 తమను ఎవరూ రాజీనామాలు అడగటం లేదన్నారు. సీడబ్ల్యూసీ విభజన నిర్ణయంపై తమ ఒత్తిడితోనే ఆంటోనీ కమిటీ వచ్చిందని చెప్పారు. ఆ కమిటీ సీమాంధ్రలో పర్యటించి ప్రజల ఆందోళనలు చూసిన తర్వాత నిర్ణయం తీసుకోవాలని కోరతామన్నారు. ఢిల్లీలో తాజా పరిస్థితులను చూస్తే విభజన నిర్ణయంపై తమ పార్టీ అధిష్టానం పునరాలోచనలో పడ్డట్లు కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. సీమాంధ్ర కేంద్రమంత్రులు, ఎంపీలు సహా మొత్తం 16 మంది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు శనివారం హైదరాబాద్‌లోని మినిస్టర్స్ క్వార్టర్స్‌లో భేటీ అయ్యూరు. ఢిల్లీ పరిణామాలు, సమైక్యాంధ్ర ఉద్యవుం, రాజీనామాలు, భవిష్యత్ కార్యాచరణపై రెండు గంటలకుపైగా చర్చించారు. ఆ తర్వాత కేంద్రవుంత్రి కావూరి సాంబశివరావు మీడియాతో మాట్లాడారు. రాజీనామాలపై ప్రజల ఒత్తిళ్ల గురించి, విలేకరులు ప్రస్తావించగా ఆయున అసహనం వ్యక్తంచేశారు. రాజీనామాల డిమాండ్ మీడియా సొంత అభిప్రాయమేనని.. ప్రజా స్పందనను మీడియా పేర్కొనటం లేదని తప్పుపట్టారు. తాము ఏ త్యాగాలకైనా సిద్ధవుని, ఎప్పుడు ఏం చేయాల నే తెలివితేటలు, సమర్ధత తమకున్నాయన్నారు.
 
 పార్టీ మా సర్వస్వం.. ప్రజలే ముఖ్యం...
 టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ఆనాడు ఇంకా దీక్ష కొనసాగిస్తే చనిపోతారనే భయంతోనే కేంద్ర ప్రభుత్వం విభజన ప్రకటన చేసిందని, కేసీఆర్ దీక్ష నటనేనని తాము చెప్పినా కేంద్రం వినలేదని కావూరి వ్యాఖ్యానించారు. అప్పట్లో కేంద్రం ప్రకటనతో సీమాంధ్రలో తలెత్తిన ప్రజాందోళన, ప్రజాప్రతినిధుల రాజీనామాలతో డిసెంబర్ 23న కేంద్రం మరో ప్రకటన చేయాల్సి వచ్చిందన్నారు. ఆ తర్వాత శ్రీకృష్ణ కమిటీ క్షేత్రస్థారుు అధ్యయనంతో ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకోకుండా విభజన నిర్ణయం తీసుకోవటం దురదృష్టకరమన్నారు.
 
 దీనిపై తాము ఒత్తిడి తేవటం వల్లే ఆంటోనీ కమిటీ వచ్చిందని.. మంత్రుల కమిటీ ఏర్పాటుకు ప్రధాని కూడా హామీ ఇచ్చారని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను పట్టింటుకోకుండా పదవులను అంటిపెట్టుకోవాలన్న ఆశ తమకు లేదన్నారు. తామంతా మళ్లీ ఢిల్లీ వెళ్తావుని, రాష్ట్రంలో పర్యటించి, సీమాంధ్ర ఆందోళనలను చూసి నిర్ణయం తీసుకోవాలని ఆంటోనీ కమిటీకి చెప్తామని పేర్కొన్నారు. ‘‘కాంగ్రెస్‌ను నమ్ముకుని ఉన్నాం. పార్టీయే వూకు సర్వస్వం. పార్టీ కంటే ప్రజలే ముఖ్యం. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం తప్ప మరేదీ సమ్మతం కాదని సోనియూగాంధీ, రాహుల్‌గాంధీలకు చెప్తాం’’ అని తెలిపారు.
 
 రాజీనామా చేస్తామంటే పెద్దలు వద్దన్నారు...
 హైకమాండ్ పెద్దలకు వాస్తవాలు తెలిసి వస్తున్నాయని, వారిలో మార్పు వస్తుందని మరో కేంద్రమంత్రి చిరంజీవి పేర్కొన్నారు. రాష్ట్ర పరిస్థితిని గురించి ఆంటోనీ కమిటీతోనే హైకమాండ్‌కు చెప్పిస్తామన్నారు. ఎంపీలు ఇప్పటికే రాజీనామా చేశారని, తాము కూడా రాజీనామా చేస్తామంటే హైకమాండ్ పెద్దలు వద్దన్నారని మరో మంత్రి పురందేశ్వరి పేర్కొన్నారు. విభజన ఆగుతుందనుకుంటే రాజీనావూలకు సిద్ధమేనన్నారు. రాజీనామా చేయాలని ఏ ప్రజలు అడిగారంటూ వుంత్రి శీలం మీడియాను ఎదురు ప్రశ్నించారు.
   పదవుల్లో ఉంటే, ప్రజాభిప్రాయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లటంతోపాటు ప్రభుత్వంలో జరిగేది తెలుసుకోవచ్చన్నారు. సోనియా, రాహుల్ అపాయింట్‌మెంట్ కోసం మంత్రి పళ్లంరాజు ప్రయత్నిస్తున్నారని టీటీడీ చైర్మన కనుమూరి బాపిరాజు చెప్పారు. రాజీనామాలపై సమష్టి నిర్ణయం తీసుకుంటామని, కావూరి మాటపైనే తావుు నిలబడ్డామని పేర్కొన్నారు. ఏకాభిప్రాయంలేని విభజన నిర్ణయంతో దేశం అల్లకల్లోలం అవుతోందని, ప్రస్తుత పరిణామాలను చూస్తే, విభజన ప్రక్రియ ఆగినట్టే కనిపిస్తోందని ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ వ్యాఖ్యానించారు. విభజన ఆగినట్టేనని, కేంద్రం పునరాలోచనలో పడిందని ఎంపీలు సాయిప్రతాప్, అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచటం మినహా మరో ప్రత్యామ్నాయానికి ఒప్పుకోబోవుని హైకమాండ్‌కు చెప్పాలని సమావేశంలో నిర్ణయించామన్నారు.
 
 ధైర్యం ఉంటే రాజీనామా చేయబోమని చెప్పండి
 సీమాంధ్ర ప్రజాప్రతినిధులకు ఏపీఎన్జీవోల నేత అశోక్‌బాబు సవాల్
 సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ఎంపీలు, మంత్రులకు ధైర్యం ఉంటే, తాము రాజీనామాలు చేయబోవుంటూ ప్రజలకు చెప్పాలని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు సవాల్ విసిరారు. సీమాంధ్ర ఎంపీలు రాజీనామాల డిమాండ్‌తోనే ఉద్యోగుల, ఆర్టీసీ కార్మికుల సమ్మె  మొదలైందన్నారు. రాజీనామాలకు ఏపీఎన్జీవోలు ఒత్తిడి తేలేదన్న  ఎంపీల వ్యాఖ్యలను వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు.
 
 కాగా, సేవ్ ఆంధ్రప్రదేశ్ సభ నుంచి తిరిగి వెళ్తూ, బస్సులపై జరిగిన దాడిలో గాయపడి, అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందున్న రాజమండ్రి ఉద్యోగి సత్యనారాయణను ఏపీఎన్జీవో ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరెడ్డి, ఇతర నేతలతో కలిసి అశోక్ బాబు శనివారం పరావుర్శించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని సంఘం హైదరాబాద్ నగరశాఖ అధ్యక్షుడు ఇ.వి.వి.సత్యనారాయణ తెలిపారు. చికిత్సకు ఇప్పటికే రూ.3 లక్షలు ఖర్చయ్యాయని, వైద్య ఖర్చులను తమ సంఘమే భరిస్తోందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement