సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులకు సీమాంధ్ర వైఎస్సార్‌సీపీ నేతల సంఘీభావం | Seemandhra YSRCP leaders Solidarity to Seemandhra region employees | Sakshi
Sakshi News home page

సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులకు సీమాంధ్ర వైఎస్సార్‌సీపీ నేతల సంఘీభావం

Published Wed, Aug 7 2013 3:19 AM | Last Updated on Thu, Aug 9 2018 4:39 PM

సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులకు సీమాంధ్ర వైఎస్సార్‌సీపీ నేతల సంఘీభావం - Sakshi

సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులకు సీమాంధ్ర వైఎస్సార్‌సీపీ నేతల సంఘీభావం

సాక్షి; హైదరాబాద్: హైదరాబాద్‌లోని సీమాంధ్ర ఉద్యోగుల ప్రయోజనాలకు ఏ చిన్న నష్టం వాటిల్లినా సహించేది లేదని వైఎస్సార్ కాంగ్రెస్ సీమాంధ్ర ప్రాంత నేతలు హెచ్చరించారు. ఉద్యోగుల రక్షణ, హక్కుల పరిరక్షణ విషయంలో ప్రాణాలను పణంగా పెట్టి పోరాడతామన్నారు. సమైక్యాంధ్రప్రదేశ్ కోరుతూ సచివాలయంలో ఆందోళన కొనసాగిస్తున్న సీమాంధ్ర ఉద్యోగులను మంగళవారం పార్టీ నేతలు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి కలిసి తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు.
 
  ఉద్యోగులకు అండగా ఉంటామని, వారి ఉద్యమానికి తమవంతు పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రజలు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఇలా ఏ ఒక్క వర్గంతోనూ చర్చించకుండా ఏకపక్షంగా తెలంగాణ నిర్ణయం ప్రకటించారని మేకపాటి వ్యాఖ్యానించారు. ‘ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలుగా విభజించాలని కోరుతూ మాయావతి నేతృత్వంలోని అక్కడి రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బిల్లు నెగ్గి దాన్ని కేంద్రానికి ప్రతిపాదించినా ఇంతవరకూ పట్టించుకోలేదు. కానీ ఎవరూ కోరని ఆంధ్రప్రదేశ్ విభజనను ఆగమేఘాల మీద పూర్తి చేయదలచారు.

ఇది కాంగ్రెస్ రాజకీయ కుట్ర. రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, నదీ జలాలు, విద్యుత్, ఉద్యోగుల సమస్యల వంటి వాటిపై కనీస స్పష్టత ఇవ్వకుండా రాష్ట్ర విభజన ప్రకటించడం దుర్మార్గం. రాష్ట్ర రాజధానిని తెలంగాణకు ఇస్తే సీమాంధ్రలో సచివాలయం చెట్టు కింద, అసెంబ్లీని గుడిసెలో ఏర్పాటు చేసుకోవాలా? రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ రాష్ట్రాన్ని ముక్కలు చేయదలచడం దారుణం’ అని అన్నారు.  రాష్ట్రాలను విడదీస్తూ పోతే దేశానికి రక్షణ ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. సీమాంధ్ర ఉద్యోగుల మీద ఈగ వాలినా సహించబోమని ఎమ్మెల్యే గొల్ల బాబూరావు హెచ్చరించారు. సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగుల మేలు కోరి అందరికంటే ముందుగా పదవులకు రాజీనామాలు చేసింది తామేనని గుర్తుచేశారు. రాజీనామాల ఆమోదం కోసం ఒత్తిడి తెస్తున్నామన్నారు. ఒకప్పటి ఉద్యోగిగా వారి ఆందోళన తనకు తెలుసని, ఉద్యోగుల ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తే ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కేంద్రం తొలుత స్పష్టం చేయాలని బాబూరావు డిమాండ్ చేశారు.
 
 విద్వేషాలు రెచ్చగొట్టేవారిపై కేసులు పెట్టాలి: సీమాంధ్ర ఉద్యోగులు హైదరాబాద్ వదిలిపోవాలని కొందరు పేర్కొనడం చాలా బాధ కలిగించిందని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ‘ఒకరు రాయల తెలంగాణ అంటున్నారు. మరొకరు హైదరాబాద్ కేంద్రపాలిత ప్రాంతమంటున్నారు. ఇంకొకాయన ఆంధ్ర రాజధానికి లక్షల కోట్లిమ్మంటున్నాడు. ఇవన్నీ వృథా. సమైక్యాంధ్రప్రదేశే మా ధ్యేయం’ అని స్పష్టం చేశారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్న వారిపై ప్రభుత్వం సుమోటో కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.
 
 ఉద్యోగులకు ఎలాంటి ఆపద వచ్చినా ఏ సమయంలోనైనా తనను సంప్రదించాలంటూ తన ఫోన్ నంబరును అందజేశారు. రాష్ట్రం అడుగుతోంది తెలంగాణ వారైతే కేంద్ర ప్రభుత్వం సీమాంధ్రకు కొత్త రాష్ట్రమిస్తోందని తాజా మాజీ ఎమ్మెల్యే ప్రవీణ్‌రెడ్డి విమర్శించారు. అడిగినవారికి ఇవ్వకుండా అడగని వారికి అన్నీ ఇచ్చి వెళ్లిపోమంటున్నారని, ఇది ఎక్కడి న్యాయమని ప్రశ్నించారు. ‘1956 తరవాత రాష్ట్ర రాజధానిగా హైదరాబాద్‌ను ఎంచుకుని అందరం కలిసి అభివృద్ధి చేసుకున్నాం. నగర నిర్మాణంలో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి చెమట బిందువులున్నాయి. గతంలో మద్రాసు, కర్నూలును వదులుకున్నాం. ఇప్పుడు హైదరాబాద్‌ను కూడా పోగొట్టుకుంటే భవిష్యత్తు తరాలు మనల్ని  క్షమించవు’ అని అన్నారు. విదేశీ శక్తుల వల్ల దేశానికి ముప్పుందని చెప్పిన ఇందిరాగాంధీ.. ఇంట్లోని విదేశీయురాలు సోనియాగాంధీని పసిగట్టలేక పోయిందని ప్రవీణ్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
 
 బైఠాయించిన ఉద్యోగులు: రాష్ట్ర విభజనను నిరసిస్తూ సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు తమ ఆందోళనను నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. మంగళవారం కూడా విధులను బహిష్కరించి రోడ్లపై బైఠాయించారు. సచివాలయ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో భారీ సంఖ్యలో ఉద్యోగులు ఆందోళనలో పాల్గొన్నారు. యూపీఏ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని సీమాంధ్ర ఉద్యోగుల ఉద్యోగ భద్రత, రక్షణపై కేంద్రం భరోసా కల్పించేంత వరకూ ఆందోళన కొనసాగుతుందని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం చైర్మన్ యు.మురళీకృష్ణ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement