సాక్షి, హైదరాబాద్: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్)ను వాయిదా వేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో చేపట్టిన ఆందోళనల నేపథ్యంలో సెప్టెంబర్ 1న టెట్‌ను నిర్వహించలేమంటూ ఆయా జిల్లాల విద్యాశాఖ అధికారులు చేతులెత్తేయడంతో ఉన్నతాధికారులు ఈ నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో పరీక్షను వాయిదా వేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ మంగళవారం విద్యాశాఖ ప్రభుత్వానికి ఫైలు పంపించింది.
ఇప్పటికే ఆందోళన ప్రభావం జిల్లాల్లో స్కూళ్లపై ఉండగా, ఈనెల 21వ తేదీ అర్ధరాత్రి నుంచి సీమాంధ్రలోని 13 జిల్లాలకు చెందిన ఉపాధ్యాయులు కూడా సమ్మెకు దిగుతుండటంతో అధికారులు టెట్ వాయిదావైపే మొగ్గుచూపుతున్నారు. ఇన్విజిలేటర్లుగా వ్యవహరించాల్సిన ఉపాధ్యాయులు లేకుండా పరీక్ష నిర్వహణ అసాధ్యమని, ప్రస్తుత పరిస్థితుల్లో వాయిదా మినహా మరే ప్రత్యామ్నాయం లేదని డీఈఓలు నిస్సహాయత వ్యక్తం చేయడంతో ఉన్నతాధికారులు కూడా టెట్‌ను వాయిదా వేసేందుకే సిద్ధమయ్యారు. దీంతో ఈ పరీక్ష రాసేందుకు దరఖాస్తు చేసుకున్న 4.47 లక్షల మంది అభ్యర్థులు మరికొన్నాళ్లు ఎదురుచూడక తప్పేలా లేదు. ప్రభుత్వ అనుమతి లభించిన వెంటనే వాయిదాకు సంబంధించి విద్యాశాఖ అధికారికంగా ప్రకటన వెలువరిస్తుంది.
సమైక్య సెగతో టెట్ వాయిదా!
Published Wed, Aug 21 2013 2:38 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement