‘టెట్’కు సమ్మె సెగ
Published Fri, Aug 23 2013 3:51 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: నిరుద్యోగ ఉపాధ్యాయుల ఓట్లను స్థానిక ఎన్నికల్లో బుట్టలోవేయడానికి డీఎస్సీ ప్రకటనను ఎరగా వాడుకోవాలన్న సర్కారు వ్యూహాలు బెడిసికొట్టాయి. రాష్ట్రవ్యాప్తంగా 22 వేలకు పైగా ఉపాధ్యాయ పోస్టులను డీఎస్సీ-13 ద్వారా భర్తీచేస్తామని హడావుడిగా ప్రకటించిన ప్రభుత్వానికి ఎన్నికల కోడ్ బ్రేక్ వేసిన సంగతి తెలిసిందే. వీటికి ముందు నిర్వహించాల్సిన టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ (టెట్) ప్రక్రియను నిర్వహించి నిరుద్యోగులను మభ్యపెట్టాలని ప్రభుత్వం చూసింది. దరఖాస్తులను స్వీకరించి పరీక్షల తేదీని కూడా ప్రకటించింది.
ఈ మేరకు పరీక్షను సెప్టెంబర్ 1వ తేదీ నిర్వహించాల్సి ఉంది. అయితే సమైక్యాంధ్రా ఉద్యమం నేపథ్యంలో నిర్వహణ సాధ్యంకాదని నిర్ధారించుకొని పరీక్షల తేదీని నిరవధికంగా వాయిదా వేసినట్లు ఉన్నతాధికారుల నుంచి జిల్లా విద్యాశాఖకు ఆదేశాలు వచ్చాయి. ఈ మేరకు డీఈఓ జి.కృష్ణారావు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 14 వేలమంది నిరుద్యోగ ఉపాధ్యాయులు టెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. సమైక్యాంధ్రా ఉద్యమం కారణంగా నిరవధిక వాయిదా వేస్తున్నామని తెలిపారు. పొడిగించిన తేదీని తర్వాత తెలియజేస్తామని పేర్కొన్నారు. దీంతో డీఎస్సీ-13 నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు నిరాశకు గురవుతున్నారు. డీఎస్సీ ద్వారా జిల్లాలో భర్తీ చేసే 384 టీచర్ పోస్టులకు సుమారు 20 వేల మంది అభ్యర్థులు పోటీ పడే అవకాశాలున్నాయి.
Advertisement
Advertisement