జిల్లాలో గురువారం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నిర్వహించిన ప్రచార యాత్ర తేలిపోయింది. గత నెల విజయనగరం అయోధ్య మైదానంలో జరిగిన ప్రజాగర్జనకొచ్చిన ఆదరణ కంటే ఇప్పుడు బాగా తగ్గింది.
సాక్షి ప్రతినిధి, విజయనగరం: జిల్లాలో గురువారం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నిర్వహించిన ప్రచార యాత్ర తేలిపోయింది. గత నెల విజయనగరం అయోధ్య మైదానంలో జరిగిన ప్రజాగర్జనకొచ్చిన ఆదరణ కంటే ఇప్పుడు బాగా తగ్గింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు నామినేషన్‌కొచ్చిన జనాల్లో సగం కూడా చంద్రబాబు సభలకు కన్పించలేదు. బొబ్బిలి మొదలుకుని విజయనగరం వరకు జరిగిన ప్రచార సభలకు హాజరైన జనం, ప్రజల్లో వ్యక్తమైన స్పందన చూస్తే చంద్రబాబు గ్రాఫ్ మరింత పడిపోయినట్టు స్పష్టమవుతోంది.
రాష్ట్ర విభజన పాపం, ఆయన అవలంభిస్తున్న విధానాలు, మోసపూరిత హామీలను అర్థం చేసుకున్నారేమో గాని ఆయన ప్రచార సభలకు జనం నుంచి పెద్దగా స్పందన కనిపించలేదు. తొలుత జరిగిన బొబ్బిలి బహిరంగ సభకు మూడు గంటల ఆలస్యంగా చంద్రబాబునాయుడు వచ్చారు. గురువారమే టీడీపీ అభ్యర్థి లక్ష్ముంనాయుడు నామినేషను వేయడంతో రెండింటికి సరిపడినట్లు జనాన్ని తరలించినా నాయకులకు మాత్రం సంతృప్తి కలగలేదు.. మంగళవారం వైఎస్‌ఆర్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సుజయకృష్ణ రంగారావుకు తరలివచ్చిన జనాలతో పోల్చితే సగం మందైనా లేరనే విమర్శలు సర్వత్రా వినిపించాయి.
ఇక బాబు ప్రసంగం కూడా పేలవంగాసాగింది. నవ్విపోదురు గాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా చంద్రబాబునాయుడు ఎప్పటిలాగే హద్దుల్లేని హామీలు గుప్పించారు. నమ్మలేని మాటలు చెప్పుకొచ్చారు. బొబ్బిలిని వైజాగ్‌లా మారుస్తానని కొత్త పల్లవి అందుకున్నారు. ‘ఇక్కడ జూట్ మిల్లు మూసేశారు, తెరిపించి సక్రమంగా నడిచేలా బాధ్యత తీసుకుంటాం’ అని అనడంతో మూసేసిన మిల్లు ఎక్కడ ఉందంటూ స్థానికులు గుసగుసలాడుకున్నారు. అక్కడి నుంచి పార్వతీపురం రోడ్డు మార్గం గుండా వెళ్లారు.
అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. బీజేపీ పొత్తు అంశాన్ని, ఆ పార్టీ బలహీనమైన అభ్యర్థుల్ని పెట్టారని దుయ్యబట్టారు. ఇక్కడ విశేషమేమిటంటే పార్వతీపురంలో బుధవారం జరిగిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థి జమ్మాన ప్రసన్నకుమార్ నామినేషన్‌కు హాజరైన జనాలను, చంద్రబాబు సభకు వచ్చిన జనాలను పోల్చుకుంటూ స్థానికులు కొంతమంది టీడీపీ పరిస్థితి ఇంత దారుణంగా ఉందా అని చర్చించుకున్నారు. గజపతినగరంలో జరిగిన సభలో బీజేపీ అధిష్టానం తీరును తప్పు పట్టేలా మాట్లాడారు. ఇక, చివరిగా విజయనగరం సభలో పాల్గొన్నారు. ఇక్కడ ఆశించిన జనాల్లేకపోవడంతో డీలా పడ్డారు.