66 రోజుల అనంతరం తెరుచుకున్న ఆఫీస్‌లు
Published Sat, Oct 19 2013 3:49 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
బొబ్బిలి, న్యూస్‌లైన్: ప్రభుత్వ కార్యాలయాలు చాలా రోజుల తరువాత తెరుచుకున్నాయి. ఉద్యోగులు ఫైళ్లకు పట్టిన బూజు దులిపి, కాగితాలు సరిచేశారు. పేరుకుపోయిన దుమ్మును తొలగించి కంప్యూటర్లను శుభ్రం చేశారు. సమ్మెలోకి వెళ్లిన తరువాత ఎవరూ తొంగిచూడకపోవడంతో నిశ్శబ్దం రాజ్యమే లిన ఆ ప్రాంగణాలు మళ్లీ పాత కళను సంతరించుకున్నాయి.ముఖ్యమంత్రితో ఏపీఎన్జీఓ సంఘ నేతల చర్చలు విజయవంతమవడంతో గురువారం అర్ధరాత్రి నుంచి సమ్మె విరమించిన ఉద్యోగులు.. శుక్రవారం విధులకు హాజరయ్యా రు. ఆగస్టు 12వ తే దీ అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లిన విషయం విదితమే. అప్పటి నుంచి కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. మధ్యలో కొంత మంది ఉద్యోగులు తాళా లు తీయడానికి ప్రయత్నించినా.. సమైక్యవాదుల హెచ్చరి కలు, దాడులతో పూర్తిగా కార్యాలయాలను మూసివేశారు.
మళ్లీ 66రోజుల తరువాత విధుల్లో చేరారు. రెవెన్యూ, మం డల పరిషత్, మున్సిపల్, సబ్ రిజిస్ట్రార్, సబ్ ట్రెజరీ, వ్యవసాయశాఖ, పంచాయతీరాజ్ వంటి ప్రధాన శాఖల కార్యాలయాల్లో ఉద్యోగులకు రికార్డుల బూజులు దులపడం, కంప్యూటర్లు, కార్యాలయాలను శుభ్రం చేసుకోవడంతోనే రోజంతా సరిపోయింది. గతంలో 10 గంటలు దాటిన తరువాత గానీ కార్యాలయాలకు వచ్చేవారు కాదు. అలాంటిది శుక్రవారం ఉదయం 9 గంటలకే చాలా మంది చేరుకోవడం కనిపించింది. మండల స్థాయి అధికారులంతా జిల్లా కేంద్రానికి వెళ్లి ఉన్నతాధికారులకు విధుల్లో చేరుతున్నట్లు రిపోర్టులు ఇచ్చి తిరిగి మండల కేంద్రాలకు వచ్చేసరికి కొంత ఆలస్యమైంది. ఇతర ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే వారు మాత్రం కాస్త ఆలస్యంగానే విధులకు హాజరయ్యారు. మరికొంత మంది అలవాటు ప్రకారం ‘అధికారులు వచ్చారు.. ఫీల్డుకు వెళ్లారనే’ సమాధానాలు చెప్పి అధికారుల గైర్హాజరును కప్పి పుచ్చారు.
జిల్లా ప్రధాన కేంద్రమైన విజయనగరం కలెక్టరేట్‌లోని అన్ని విభాగాల్లో ఉద్యోగుల సందడి కనిపించింది. ఇటీవలకురిసిన వర్షాలకు పలు ఫైళ్లు చెదలు పట్టడంతో వాటిని శుభ్రం చేసే పనిలో ఉద్యోగులు పడ్డారు. కుర్చీలు, కార్యాలయాల్లో పేరుకు పోయిన దుమ్మూ ధూళిని తొలగించటంలో నిమగ్నమయ్యారు. కలెక్టరేట్‌లో ఉన్నతాధికారులు పయనించే వాహనాలు చాలా సేపు మొరాయించాయి. వాటితో డ్రైవర్లు కుస్తీలు పడ్డారు. గతంలో పెండింగ్‌లో ఉన్న 12 రోజుల వేతనాల బిల్లుల కోసం ‘ఖజానా’ చుట్టూ ఉద్యోగులు అధిక సంఖ్యలో కనిపించారు. కలెక్టరేట్ సూపరింటెండెంట్‌లు విధుల కంటే.. సిబ్బందితో సమావేశాలు నిర్వహించుకోవడమే అధికంగా కనిపించింది. సాలూరు తహశీల్దార్ కార్యాలయంలో 12 మంది ఉద్యోగులకు గానూ తొలిరోజు అయిదుగురే హాజరయ్యారు.
పంచాయతీరాజ్ కార్యాలయంలో టైపిస్టు, అటెండరు మినహా మిగిలిన ఉద్యోగులు హాజరుకాలేదు. చీపురుపల్లిలో ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ కార్యాలయం తెరచుకున్నప్పటికీ.. డీఈ గానీ, జేఈలుగానీ కార్యాలయానికి రాలేదు. అక్కడ సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో కంప్యూటర్లు మొరాయించడంతో పనులకు ఆటంకం కలిగింది. మెరకమొడిదాం మండలంలో వ్యవసాయశాఖ, ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు విధులకు హాజరు కాలేదు. బొబ్బిలి పట్టణ ఐసీడీఎస్ కార్యాలయంలో పీఓ, సూపర్‌వైజర్లవెరూ కనిపించలేదు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ రాకపోవడంతో ఛాంబర్ మూతపడింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సబ్ రిజిస్ట్రార్ వంగా డేవిడ్‌శేఖర్‌తోపాటు, ఉద్యోగులంతా రికార్డులకు, కంప్యూటర్లకు బూజులు దులిపారు.
ఉదయమం తా వారికి ఈ పనితోనే సరిపోయింది. మధ్యాహ్నం 12 గంటల నుంచి విధులు చేపట్టారు. గజపతినగరం మండల పరిషత్ కార్యాలయంలో ఉదయం 11గంటలు కావచ్చినా.. ఎంపీడీఓ ఎం.శ్రీరంగ విధులకు హాజరు కాలేదు. ఉపాధిహామీ పథకం ఏపీఓ, పీఓలతోపాటు, వ్యవసాయ శాఖ ఏఓ వంటివారూ కార్యాలయాలకు రాలేదు. అలాగే పలు ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది తప్ప పూర్తిస్థాయిలో అధికారులు విధులకు హాజరు కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. కొన్ని మండలాల్లో సబ్ రిజిస్ట్రార్లు, సబ్ ట్రైజరీ అధికారులు మధ్యాహ్నం వరకూ కార్యాలయాలకు చేరుకోలేదు. ఉద్యోగులు విధుల్లోకి చేరడంతో ఎప్పటినుంచో ఉన్న పెండింగ్ పనులన్నీ నెరవేరుతాయన్న ఆశాభావంతో ప్రజలున్నారు.
Advertisement