నేటి నుంచి కర్ఫ్యూ ఎత్తివేత
Published Sat, Oct 19 2013 3:52 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్: విజయనగరం పట్టణ ప్రజలపై అమ్మ దయచూపింది... 13 రోజుల నిర్బంధ బాధల నుంచి విముక్తి ప్రసాదించింది. పోలీసుల దాష్టీకానికి తెరపడింది. తమకు అడ్డే లేదంటూ తెరవెనుక నుంచి వేధింపులకు పాల్పడుతున్న రాజకీయ నేతల నుంచి ఉపశమనం లభించేలా ఆ పైడితల్లి కరుణించింది. శనివారం నుంచి కర్ఫ్యూను పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు ఎస్పీ కార్తికేయ ప్రకటించారు. దీంతో తమకు పట్టిన శని వదిలిపోయిందని, అమ్మకు మొక్కులు చెల్లించుకుని, పండగను ఆనందంగా జరుపుకోవచ్చని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 21, 22, 23 తేదీల్లో పైడితల్లమ్మ పండగ జరగనుండడంతో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. లేకపోతే వారిపై మరింత వ్యతిరేకత వచ్చేది.
సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా జరిగిన చిన్నపాటి విధ్వంసాలను ఆసరాగా తీసుకున్న పోలీసులు పట్టణంలో శాంతిభద్రతలు అదుపు తప్పాయంటూ ఈ నెల 6 నుంచి కర్ఫ్యూ విధించిన విషయం విధితమే. ఈ నేపథ్యంలో ప్రజలు స్వేచ్ఛగా బయటకు తీరగలేని పరిస్థితి ఏర్పడింది. కర్ఫ్యూ విధించిన రెండు రోజుల పాటు పోలీసులు పట్టణ ప్రజలను దాదాపు గృహ నిర్బంధంలో ఉంచారు. వాస్తవానికి మత విధ్వంసాలు, హత్యాకాండలు, ఇరువర్గాల మధ్య భీకరమైన పోరు జరిగిన సందర్భాలలో కర్ఫ్యూ విధించడం పరిపాటి. అయితే విజయనగరంలో విధించిన కర్ఫ్యూ అందుకు భిన్నంగా ఉండడంతో పాటు ఎన్నడూ లేని విధంగా పోలీసులు రెండు రోజుల పాటు జాతీయ రహదారిని కూడా దిగ్బంధించడంతో ఇది జాతీయస్థాయిలో వార్తలకెక్కింది. ఎన్నడూ లేని విధంగా పట్టణ ప్రజలను పోలీసులు భయకంపితులను చేశారు. కేవలం కాంగ్రెస్ నాయకుల మెచ్చుకోలు, మంత్రి బొత్స ప్రాపకం కోసమే పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ప్రజాసంఘాల నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా వారు లెక్కచేయలేదు. కర్ఫ్యూను ఎత్తివేయాలని కోరుతూ మానవ హక్కుల కోర్టును కొంతమంది ఆశ్రయించిన తరువాత హైవేపై రాకపోకలను యథావిధిగా కొనసాగించారు.
సడలించిన తీరు...
6వ తేదీ నుంచి పట్టణంలో కర్ఫ్యూను అమలు చేశారు. శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపులోకి రావడంతో నాలుగో రోజు రెండు గంటల పాటు సడలించిన అధికారులు ఆ తరువాత రోజు నుంచి కర్ఫ్యూ సడలింపు సమయాన్ని పొడిగిస్తూ వచ్చారు. సడలింపు సమయంలో కూడా శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో అదుపులోకి రావడంతో బుధ, గురువారాల్లో ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు సడలించారు. శుక్రవారం ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు సడలింపు సమయాన్ని పెంచారు. ఈ సందర్భంలో కూడా ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకపోవడంతో పాటు మరోవైపు ఉత్తరాంధ్ర ఇలవేల్పు పైడితల్లమ్మ ఉత్సవాలు దగ్గర పడడంతో కర్ఫ్యూను ఇంకా కొనసాగిస్తే అపవాదు వస్తుందని భావించిన అధికారులు శనివారం నుంచి కర్ఫ్యూ ఎత్తి వేస్తున్నట్లు ప్రకటించారు.
చెదిరిన ప్రశాంతత...
వాస్తవానికి విజయనగరం అంటే శాంతికి, ప్రశాంతతకు మారుపేరు. తెలంగాణ విభజన ప్రకటనను స్థానిక మంత్రి బొత్స సత్యనారాయణ వ్యతిరేకించకపోగా ఉద్యమంపై స్పష్టమైన వైఖరి తెలియజేయకపోవడంతో సమైక్యవాదులు ఆందోళనను ఉధృతం చేశారు. దీనికి తోడు అక్టోబర్ 3న కేంద్ర కేబినెట్ తెలంగాణ నోట్‌ను ఏకపక్షంగా ఆమోదించడాన్ని సహించలేని సమైక్యవాదులు మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఉద్యమంపై బొత్స సానుకూలమైన వ్యాఖ్యలు చేయకపోవడంతో ఆగ్రహించిన సమైక్యవాదులు మంత్రికి సంబంధించిన కొన్ని ఆస్తులను ధ్వంసం చేయడానికి ప్రయత్నించారు. ఇదే సందర్భంలో ఆయన మేనల్లుడు చిన్నశ్రీను ప్రైవేట్ సైన్యం పెట్టి విద్యార్థులను కొట్టించడంతో పాటు ఆ దాడిలో ఇద్దరు మృతి చెందారన్న ఆరోపణలు జిల్లా వ్యాప్తంగా వ్యాపించాయి.
దీంతో రెచ్చిపోయిన విద్యార్థులు బొత్సే లక్ష్యంగా ఉద్యమం సాగించారు. దీనిని సహించలేని బొత్సే కర్ఫ్యూ పట్టణంలో విధించారని సమైక్యవాదులతో పాటు ప్రజా సంఘాలు, ప్రజలు భావిస్తున్నారు. 13 రోజుల పాటు కర్ఫ్యూ కొనసాగించడం జిల్లా చరిత్రలోనే ప్రత్యేక ఘటనగా నిలిచిపోనుంది. అయితే పైడితల్లి అమ్మవారి పండగ దగ్గరపడడంతో విజయనగరం ప్రజలకు ఉపశమనం కలిగింది. దీంతో ప్రజలు ప్రశాంతంగా రోడ్లపై తిరగవచ్చునని, కాని పట్టణంలో 144వ సెక్షన్ అమలులో ఉంటుందని ఎస్పీ కార్తికేయ స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా కర్ఫ్యూ ఎత్తివేసినా కేంద్ర బలగాలతో పాటు పోలీసులను మెయిన్, బొత్స నివాస ప్రాంతాలలో భారీగానే మోహరించారు. గతంలో కార్మికుల ఆకలి మంటల కోసం నెల్లిమర్లలో జరిగిన ఉద్యమంలో ఐదుగురు కార్మికులు మృతి చెందడంతో కర్ఫ్యూ విధించారు. అయినా దానిని రెండు రోజులు మాత్రమే కొనసాగించారు.
Advertisement