ఇది ఖాకీ మార్క్ రాజకీయం!
Published Thu, Oct 17 2013 3:58 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
విజయనగరం క్రైం, న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సాకుగా చూపి పోలీసులు తమదైన మార్క్‌తో పట్టణ ప్రజల్లో తీవ్ర భయాందోళనలు సృష్టిస్తున్నారు. అల్లర్లతో సంబంధం లేని యువకులను సైతం అరెస్ట్ చేసి విచారణ పేరుతో వారిని చిత్రహింసలకు గురిచేస్తుండడంతో అంతటా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పోలీసుల తీరుపై కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు దుమ్మెత్తిపోస్తున్నాయి. కాంగ్రెస్ ప్రోద్బలంతోనే పోలీసులు యువకులను వేటాడి మరీ అరెస్ట్ చేస్తున్నారని, దీని వెనుక కాంగ్రెస్ నేతల కక్షసాధింపు చర్యలు, పోలీసుల పాత కక్షలు స్పష్టంగా కనిపిస్తున్నాయని, రాజకీయాలకు అతీతంగా పనిచేయవలసిన పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
ఇటీవల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ కోలగల్ల వీరభద్రస్వామి... పోలీసులకు మెచ్చుకోలు పత్రం ఇవ్వడమే దీనికి నిదర్శనమని చెబుతున్నారు. ఉద్యమకారులను వీడియో క్లిప్పింగ్‌ల ద్వారా గుర్తించి అరెస్ట్‌లు చేస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అయితే వారు చెబుతున్నదానికి, చేస్తున్నదానికి పొంతనలేకుండా పోతోంది. పట్టణంలోని ప్రధానంగా లంకాపట్నం, జొన్నగుడ్డి, అంబేద్కర్‌కాలనీ, కణపాక, కె.ఎల్.పురం, కొత్తపేట, దాసన్నపేట రింగురోడ్డు, గుంపవీధి, కమ్మవీధి, కన్యాపరమేశ్వరి కోవెల, గాజులరేగ తదితర ప్రాంతాల్లోని యువకులను లక్ష్యంగా చేసుకుని విడతల వారీగా అదుపులోకి తీసుకుంటున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన యువకులు, కార్యకర్తలను వదిలేసి, ఇతర పార్టీలకు చెందిన యువకులను అరెస్ట్ చేస్తున్నారని ఆయా ప్రాంతాల వారు ఆరోపిస్తున్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన జాబితా మేరకు అదుపులో తీసుకుంటున్నారని, కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారిన ఈ ఉద్యమం మళ్లీ పుంజుకోకుండా పూర్తిగా అణిచివేయడానికే భయానక వాతావరణం సృష్టిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మండలంలోని సుంకరిపేటలో కొందరు యువకులను తీసుకువెళ్లడానికి వచ్చిన పోలీసులను గ్రామస్తులంతా ఏకమై సర్పంచ్ ఆధ్వర్యంలో అడ్డుకోవడంతో వెనుతిరగాల్సి వచ్చింది. ఏ తప్పు చేయని యువకులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని రోజుల తరబడి స్టేషన్‌లో ఉంచి వారిని తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నారని వారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న యువకులను స్టేషన్‌కు తీసుకువెళ్లి చావబాదుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వారికి కాంగ్రెస్ పార్టీకి చెందిన యువకుల ఫొటోలు వీడియో క్లిప్పింగ్‌ల్లో కనిపించడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన యువకులను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ పెనుమత్స సాంబశివరాజు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్, ఎస్పీని కలిసి వినతిపత్రం అందజేశారు.
విజయనగరం ఎమ్మెల్యే పూసపాటి అశోక్‌గజతిరాజు ఒకటో, రెండో పట్టణ పోలీసు స్టేషన్లకు వెళ్లి సంబంధిత పోలీసుల అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. బొత్స, అతని మేనల్లుడి మెప్పు కోసమే పోలీసులు దిగజారి ప్రవరిస్తున్నారని రాజకీయ పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా పోలీసులు తీరు మార్చుకోకపోతే ఉద్యమిస్తామని వారు హెచ్చరిస్తున్నారు. కేవలం మంత్రి బొత్స ఆస్తులను రక్షించేందుకు, ఆయనకు వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొన్నవారిపై కక్షసాధించేందుకు మాత్రమే పోలీసులు యువకులపై కేసులు నమోదు చేస్తున్నారని వారు ఆరోపించారు. అక్రమ కేసులను ఎత్తివేయకపోతే ప్రజాపోరాటానికి సిద్ధమవుతామని వారు హెచ్చరిస్తున్నారు. జిల్లా పోలీసు యంత్రాంగం ఇప్పటికైనా స్పందించి పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం కలిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
‘అన్యాయంగా అరెస్ట్ చేశారు..’
విజయనగరం క్రైం,న్యూస్‌లైన్ : తన కుమారుడు అనుదీప్‌ను సమైక్య ఉద్యమంలో పాల్గొన్నాడంటూ పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారని బూర్లిపేట తారకరామకాలనీ చెందిన మల్లేశ్వరి ఆరోపించింది. మంగళవారం సాయంత్రం పైడితల్లమ్మ వారికి ఘటాలు తెస్తుండగా.. మార్గమధ్యంలోనే తన కుమారుడిని తీసుకుపోయారని వాపోయింది. వచ్చే నెలలో కుమారుడికి పెళ్లి ఉందని తెలిపింది. కుమారుడి విషయమై ఒకటో పట్టణ పోలీసులను అడిగితే చెప్పడం లేదని వాపోయింది.
ఏడుగురి అరెస్ట్
సమైక్యాంధ్ర ఉద్యమంలో విధ్వంసాలకు పాల్పడిన ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు రెండో పట్టణ పోలీసులు బుధవారం తెలిపారు.
Advertisement