సీమాంధ్రలో ఆందోళనలు కొనసాగితే కష్టమే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నిర్ణయంతో సీమాంధ్రలో ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో సెప్టెంబర్ 1న జరగాల్సిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) నిర్వహణ సాధ్యమయ్యేలా కనిపించడం లేదు. పరీక్షను వాయిదా వేసే దిశగా విద్యాశాఖ వర్గాలు ఆలోచనలు చేస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఉపాధ్యాయులు ఆందోళనల్లో పాల్గొంటే సీమాంధ్రలోని 13 జిల్లాల్లో పరీక్షను నిర్వహించడం సాధ్యం కాదని ఆయా జిల్లాలకు చెందిన డీఈవోలు విద్యాశాఖ ఉన్నతాధికారులకు మౌఖికంగా తెలియజేశారు.
కాగా, ఇదే విషయాన్ని పేర్కొంటూ.. నిర్వహణలో తలెత్తే సమస్యలను తెలియజేస్తూ రాతపూర్వకంగా అందజేయాలని ఆయా జిల్లాల అధికారులను పాఠశాల విద్యా అదనపు డెరైక్టర్, టెట్ జాయింట్ డెరైక్టర్ ఎస్.జగన్నాథరెడ్డి ఆదేశించినట్లు తెలిసింది. ముఖ్యంగా పరీక్ష నిర్వహణకు అవసరమైన సామగ్రి పంపిణీ, పరీక్ష కేంద్రాల్లో పర్యవేక్షించాల్సిన ఇన్విజిలేటర్ల నియామకం వంటివి జిల్లాల్లో అధికారులకు సమస్య కానున్నాయి. దీంతో నిర్ణీత తేదీలో టెట్ నిర్వహణ కష్టం కానుంది.
దీనిపై జిల్లాల నుంచి రాతపూర్వక ప్రతిపాదనలు అందాక మరో రెండు, మూడు రోజుల్లో ఉన్నతాధికారులు సమావేశమై అధికారిక నిర్ణయాన్ని ప్రకటించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 3 వేల పరీక్ష కేంద్రాల్లో 2 వేల వరకు పరీక్ష కేంద్రాలు సీమాంధ్ర జిల్లాల్లో ఏర్పాటు చేయాలి. అయితే విభజనను వ్యతిరేకిస్తూ సీమాంధ్రలోని ఉద్యోగులు సమ్మె చేస్తుండగా ఉపాధ్యాయులూ ఆందోళనలకు దిగారు. టెట్ పరీక్షకు 4,44,718 మంది దరఖాస్తు చేసుకోగా.. వారికి ఈ నెల 25 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునే అవకా శం కల్పిస్తామని విద్యాశాఖ తెలిపింది.
వాయిదా దిశగా టెట్!
Published Sat, Aug 17 2013 5:47 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement
Advertisement