సచివాలయ ఉద్యోగులకు బీజేపీ హామీ
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన తో సీమాంధ్ర ప్రాంతానికి సరైన న్యాయం జరిగేలా ప్రధాన ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ అగ్రనేతలు సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. శుక్రవారం పార్లమెంటులోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ అగ్రనేతలు అద్వానీ, సుష్మాస్వరాజ్, అరుణ్‌జైట్లీలను ఉద్యోగులువిడివిడిగా కలిశారు. విభజనతో ఉద్యోగులు, విద్యార్థులు, నీటి పంపకాలు, హైదరాబాద్, విద్యుత్ పంపిణీ విషయంలో తలెత్తే అంశాలను వివరిస్తూ వారికి నివేదిక అందజేశారు. నేతలు స్పందిస్తూ.. సీమాంధ్రల ఆందోళనను అర్థం చేసుకున్నామని, పార్లమెంట్‌లో బిల్లు సమయంలో వారి సమస్యలను ప్రస్తావిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం.
అంతకుముందు సచివాలయ సమైక్యాంధ్ర ఉద్యోగుల జేఏసీ నేతలు కేంద్ర మంత్రులు పురందేశ్వరి, కోట్ల సూర్యప్రకాష్‌రెడ్డి, జె.డి.శీలం, టీడీపీ ఎంపీలు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి, కొనకళ్ల నారాయణ, నిమ్మల కిష్టప్ప, శివప్రసాద్, కాంగ్రెస్ సీమాంధ్ర ప్రాంత ఎంపీలు కొందరిని వేర్వేరుగా కలిశారు. విభజన జరిగితే తలెత్తే సమస్యలను ఏకరువు పెడుతూ ఓ నివేదికను అందజేశారు. సీమాంధ్రలో ఉద్యమ తీవ్రత కేంద్ర ప్రభుత్వానికి తెలియాలంటే పదవులకు రాజీనామాలు చేయాలని పురందేశ్వరి, కోట్లను గట్టిగా కోరగా.. మంత్రులు స్పందిస్తూ విభజన ప్రక్రియకు తాత్కాలిక బ్రేక్ పడిందని, ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వం ఆలోచనలు చేస్తే రాజీనామాలపై కఠిన నిర్ణయం తీసుకునేందుకు వెనకాడబోమని పేర్కొన్నట్లు తెలిసింది.
సీమాంధ్రులకు అండగా ఉంటాం!
Published Sat, Aug 31 2013 2:56 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
Advertisement