
రాజీనామా చేయనిదే రానిచ్చేది లేదు.. సచివాలయంలో మంత్రుల ఘెరావ్
కళ్లు, చెవులకు గంతలు కట్టుకుని ఉద్యోగుల నిరసన
మంత్రివర్గ ఉపసంఘం భేటీ వద్దకు దూసుకెళ్లే ప్రయత్నం
మంత్రులు ఆనం, రఘువీరా, పితానిలను అడ్డుకున్న వైనం
రాజీనామాలు చేయాలని డిమాండ్ నచ్చజెప్పేందుకు ఆనం యత్నం..
‘మీ మాటలు నమ్మం’ అంటూ నినదించిన ఉద్యోగులు
సీఎం రాజీనామా చేయాలంటూ పెద్ద పెట్టున నినాదాలు
పోలీసుల భద్రతా వలయంలో కార్లలో వెళ్లిన మంత్రులు
సాక్షి, హైదరాబాద్: సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఆందోళనతో సోమవారం రాష్ట్ర సచివాలయం హోరెత్తింది. నినాదాలు, నిరసన ప్రదర్శనలతో మంత్రాలయం దద్దరిల్లింది. ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల వాహనాలకు సీమాంధ్ర ఉద్యోగులు అడ్డుపడ్డారు. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, పితాని సత్యనారాయణ, రఘువీరారెడ్డిలను ఘెరావ్ చేశారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రాష్ట్ర విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరంనేతృత్వంలో సాగుతున్న ఆందోళన ఉధృతరూపం దాల్చింది.
ఉద్యోగులు నిరవధికంగా విధులు బహిష్కరించి సహాయ నిరాకరణ ప్రకటించారు. యూపీఏ సర్కారుది గుడ్డి నిర్ణయమని విమర్శిస్తూ వందలాది మంది ఉద్యోగులు సోమవారం కళ్లు, చెవులకు గంతలు కట్టుకుని నిరసన తెలిపారు. సచివాలయ ప్రధాన ద్వారాల వద్ద బైఠాయించి ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల వాహనాలను అడ్డుకున్నారు. తెలంగాణ ఏర్పాటు ప్రకటన తరవాత సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తొలిసారిగా సోమవారం సచివాలయానికి వచ్చారు. అదే సమయంలో ఆందోళన చేస్తున్న ఉద్యోగులు ముఖ్యమంత్రి వెంటనే పదవికి రాజీనామా చేయాలని నినదించారు.
హెచ్ బ్లాక్‌లోకి దూసుకెళ్లే యత్నం...
ఉద్యోగుల సమస్యలపై హెచ్ బ్లాక్‌లోని ఉపముఖ్యమంత్రి రాజనరసింహ చాంబర్‌లో మంత్రివర్గ ఉపసంఘం చర్చిస్తుండగా ఉద్యోగులు అక్కడికి చేరుకుని మంత్రులకు వ్యతిరేకంగా పెద్దపెట్టున నినాదాలు చేశారు. హెచ్ బ్లాక్‌లోకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేసి, ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని, లేకుంటే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. లక్షలాది మంది యువతీయువకులు, విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు సమైక్యాంధ్ర కోసం తీవ్ర ఉద్యమం సాగిస్తుంటే సీమాంధ్ర మంత్రులు పదవులు పట్టుకుని వేలాడటం సిగ్గుచేటని నినదించారు. సబ్ కమిటీ చర్చలు ముగిశాక బయటకి వస్తున్న సీమాంధ్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, రఘువీరారెడ్డి, పితాని సత్యనారాయణలను హెచ్ బ్లాక్ ద్వారం వద్ద అడ్డుకుని రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రులపై ఆగ్రహం ప్రదర్శించారు. రాజీనామాలు చేయకుండా సచివాలయంలోనికి రావద్దన్నారు.
మీ మాటలు ఇక నమ్మం...
ఆనం రామనారాయణరెడ్డి ఉద్యోగులకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా ‘‘మీ మాటలు ఇక వినం. నమ్మం’’ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఉద్యోగుల సమస్యలపైనే చర్చిస్తున్నామని, రాజీనామాలు చేస్తే చట్టసభల్లో సీమాంధ్ర గొంతు వినిపించే వారు కరువవుతారని ఆనం నచ్చజెప్పేందుకు ప్రయత్నించబోయినా ఉద్యోగులు వెనక్కి తగ్గలేదు. మాటలు కాదు చేతలు కావాలని, 2009 డిసెంబర్ 9న చిదంబరం చేసిన ప్రకటనకు వ్యతిరేకంగా సీమాంధ్ర మంత్రులంతా మూకుమ్మడిగా రాజీనామాలు చేయటంతోనే యూపీఏ ప్రభుత్వం వెనక్కితగ్గిందని, ఇప్పుడు కూడా రాజీనామాలు చేస్తేనే కేంద్రంపై ఒత్తిడి పెరుగుతుందన్నారు.
ఇంతలో మంత్రులు తమ వాహనాల వైపు వెళ్లేందుకు ప్రయత్నించగా సమాధానం చెప్పేవరకూ కదలనివ్వబోమని ఉద్యోగులు భీష్మించారు. పోలీసులు జోక్యం చేసుకుని మంత్రులకు రక్షణగా నిలవటంతో ఉద్యోగుల ముందుకు దూసుకువచ్చారు. దీంతో కాసేపు తోపులాట జరిగింది. చివరికి పోలీసు రక్షణలో మంత్రులు వాహనాల్లోకి ఎక్కారు. సీమాంధ్ర మంత్రులెవరైనా మళ్లీ సచివాలయంలో అడుగుపెడితే ఇలాగే అడ్డుకుని తీరుతామని ఉద్యోగులు స్పష్టంచేశారు. ఆందోళనలో సీమాంధ్ర ఫోరం చైర్మన్ యు.మురళీకృష్ణ, కార్యదర్శి కె.వి.కృష్ణయ్య, సచివాలయ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు వెంకటరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.