ప్రజాప్రతినిధులకు సమైక్య సెగ
సాక్షి నెట్‌వర్క్ : లోక్‌సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణకు సమైక్య దెబ్బ తగిలింది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో సీమాంధ్రలో ‘తెలుగుతేజం’ పేరుతో పర్యటన ప్రారంభించిన జేపీకి తొలిరోజే సమైక్యవాదుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ‘ఆందోళనలు, ధర్నాలతో రాష్ట్రం వెనుకబడిపోతుంది. రాష్ట్రం విభజన జరిగినా, జరగకపోయినా... మన ప్రాంతం, ప్రజల గురించి ఆలోచించకుండా ఆందోళనలు చేయడం వల్ల నష్టం మనకే’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సమైక్య వాదులను రెచ్చగొట్టాయి. విభజన అనివార్యమైతే రాయలసీమకు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేయాలని చేసిన సూచన కూడా ఆందోళన కారులకు రుచించలేదు. దీంతో దాదాపు రోజంతా ఆయన బస చేసిన రాష్ట్ర అతిథిగృహం వద్ద ఆందోళన నిర్వహించి రాత్రి వరకు ఆయనను దాదాపుగా నిర్బంధించినంత పని చేశారు.
ఉదయం 9 గంటలకు కర్నూలుకు వచ్చిన జేపీ ఓ ప్రైవేట్ పాఠశాలలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. రాష్ట్ర విభజన నిర్ణయం తర్వాత సీమాంధ్రలో నెలకొన్న పరిస్థితులపై ఆయన తనదైన శైలిలో అభిప్రాయం వ్యక్తం చేశారు. ‘ముఖం బాగోలేదని ముక్కు కోసుకుంటామా? రాష్ట్ర విభజన జరిగిందని సమ్మెలు చేస్తూ, విద్యార్థులను రోడ్లపైకి తేవడం, స్కూళ్లు, కళాశాలలు మూసేయడం, విద్యుత్ సమ్మె నిర్వహించడం వల్ల నష్టం మనకే. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్, టీడీపీ ఆజ్యం పోస్తే కేంద్రం నిర్ణయం తీసుకుంది. విభజన జరిగితే ప్రత్యేక ప్యాకేజీతో రాయలసీమను కోరతాం.’ అంటూ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు. అనంతరం కొండారెడ్డి బురుజు వద్ద ఏర్పాటు చేసిన రోడ్‌షోలో కూడా ఇదే తరహాలో మాట్లాడటంతో సమైక్యవాదులు ఆందోళనకు దిగారు.
మైకులు, సౌండ్‌బాక్సులు లాగేసి జేపీ డౌన్‌డౌన్ నినాదాలతో హోరెత్తించారు. భవిష్యత్తు గురించి ఆలోచించకుండా బంద్‌లు, సమ్మెలు చేయడం మూర్ఖత్వం అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలతో ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలతో పాటు కర్నూలు జనం ఆగ్రహానికి గురయ్యారు. ఉద్యోగులు జేపీ గోబ్యాక్ అంటూ నినాదాలు చేయడంతో ఆయన తాను బస చేసిన స్టేట్ గెస్ట్‌హౌస్‌కు వెళ్లిపోయారు. ఉద్యమకారులు అక్కడకు కూడా వచ్చి నిరసన వ్యక్తం చేశారు. రాత్రి 8 గంటల సమయంలో ఉద్యమకారులు తమదే నైతిక విజయం అంటూ వెళ్లిపోవడంతో జేపీ అనంతపురానికి బయలుదేరి వెళ్లారు. కాగా, సాయంత్రం 3 గంటల సమయంలో సెయింట్ జోసెఫ్ కళాశాలలో ‘రాష్ట్ర విభజన- సమస్యల పరిష్కారం’ పేరుతో నిర్వహించదలచిన రౌండ్ టేబుల్ సమావేశం ఉద్యమకారుల ఆందోళనలతో రద్దయింది. ఉదయం నుంచి జరిగిన సంఘటనలతో కశాశాల యాజమాన్యమే సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
రాజకీయ పార్టీల వికృత క్రీడ ఇది: జేపీ
తమ పార్టీ నుంచి తనను ఒక్కరినే గెలిపించారని, 30 సీట్లు ఇచ్చి ఉంటే చరిత్ర మార్చేవాడినని జేపీ అన్నారు. 2004 వరకు రాష్ట్రంలో 5 శాతం మాత్రమే ఉన్న తెలంగాణ వాదాన్ని కాంగ్రెస్, టీడీపీలు రెచ్చగొట్టాయని జేపీ ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధ్వజమెత్తారు. ఓట్లు, సీట్ల కోసం 2004లో కాంగ్రెస్, 2009లో తెలుగుదేశం టీ ఆర్‌ఎస్‌తో పొత్తు పెట్టుకుని తెలంగాణ వాదాన్ని బలోపేతం చేశాయని విమర్శించారు. ఇప్పుడు కేంద్రం కూడా ఓట్లు, సీట్ల కోసమే రాక్షస రాజకీయ క్రీడ ఆడుతోందన్నారు.
ఎమ్మెల్సీల వాహనాలను అడ్డుకున్న ఉద్యోగ జేఏసీ
చిత్తూరు జిల్లా కుప్పంలో ఎమ్మెల్సీలు విఠపు బాలసుబ్రవుణ్యం, యండపల్లి శ్రీనివాసులురెడ్డి వాహనాలను ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నాయుకులు అడ్డుకున్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఎమ్మెల్సీలు వూట్లాడుతూ తామూ సమైక్యాంధ్ర వుద్దతుదారులమేనని చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తున్నావున్నారు.
చిరంజీవిని ఘెరావ్ చేసిన ‘విశాలాంధ్ర’ కార్యకర్తలు
మంత్రి పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమం చేస్తున్న కోట్లాది మంది సామాన్య తెలుగు ప్రజలతో నడవాలని డిమాండ్ చేస్తూ విశాలాంధ్ర మహాసభ కార్యకర్తలు శనివారం కేంద్ర మంత్రి చిరంజీవిని ఘెరావ్ చేశారు. ఆయన ఇంటిని ముట్టడించారు. వందలాదిగా తరలివచ్చిన కార్యకర్తలతో జూబ్లీహిల్స్‌లోని చిరంజీవి నివాసం వద్ద, బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్ సముదాయం వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. మంత్రి పదవికి రాజీనామా చేయాలని, రాష్ట్ర సమైక్యతను కాపాడాలని డిమాండ్ చేస్తూ కార్యకర్తలు చిరంజీవి ఇంటి వద్ద బైఠాయించారు. ఆ సమయంలో ఇంట్లోలేని చిరంజీవి విషయం తెలుసుకుని విశాలాంధ్ర నేతలకు ఫోన్ చేశారు. తాను మినిస్టర్ క్వార్టర్స్‌కు వస్తున్నానని, అక్కడ కలవాల్సిందిగా సూచించారు.
దీంతో కార్యకర్తలంతా అక్కడకు చేరుకున్నారు. మార్గమధ్యంలో కారు ఆపి వారి వద్దకు వచ్చిన చిరంజీవిని ఘెరావ్ చేస్తూ తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తాను మాట్లాడతానని చిరంజీవి ఎంత కోరినా వినిపించుకోలేదు. రాజీనామా చేసి తమతో మాట్లాడాలంటూ డిమాండ్ చేశారు. తాను రాజీనామా చేస్తే తెలంగాణ ఆగిపోతుందనుకుంటే ఇక్కడికిక్కడే రాజీనామా చేసి మీ చేతికి ఇస్తానంటూ ఆయన ఎంత చెప్పినా వారు వినిపించుకోలేదు. డ్రామాలు కట్టిపెట్టాలంటూ నిలదీశారు. సమైక్య ఉద్యమానికి సానుభూతి అవసరం లేదని, మీ పదవీ త్యాగం కావాలంటూ నినాదాలు చేశారు. చేయని పక్షంలో రాజకీయంగా పుట్టగతులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయనకు నిరసన పత్రం అందజేశారు. దీంతో చిరంజీవి అక్కడి నుంచి ఆగ్రహంతో వెళ్లిపోయారు.
మంత్రి శత్రుచర్లకూ...
అసెంబ్లీలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఓటు వేస్తానని మంత్రి శత్రుచర్ల విజయరామరాజు అన్నారు. విజయనగరం జిల్లా గజపతినగరంలో జేఏసీ, ఏపీ ఎన్‌జీఓ ప్రతినిధులు ఆయన్ను అడ్డుకున్నారు. రోడ్డుపై బైఠాయించి తక్షణమే మంత్రి పదవికి రాజీనామా చేసి, ఉద్యమంలోకి రావాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ తీర్మానాన్ని అసెంబ్లీలో ప్రవేశపెడితే ఓడించేందుకు ఓటు ఉండాలని, ఉద్యమకారులు కొంత సమన్వయం పాటించాలన్నారు. సీఎం కిరణ్ సమైక్యానికే కట్టుబడి ఉన్నారని,తాను కూడా అదే నినాదానికి కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. అంతకు ముందు బొబ్బిలిలో కూడా సమైక్యవాదులు మంత్రిని అడ్డుకున్నారు.
రాయపాటికీ సమైక్య వేడి
గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం పేరేచర్ల జంక్షన్ వద్ద నిర్మించిన ఫ్లై ఓవర్‌ను ప్రారంభించేందుకు మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, ఎంపీ రాయపాటి సాంబశివరావు వస్తున్నారని తెలుసుకున్న సమైక్మవాదులు వారిని అడ్డుకునేందుకు అక్కడకు చేరుకున్నారు. అయితే ఎంపీ రాయపాటి ఒక్కరే వచ్చారు. ముందుగానే సమాచారం అందుకున్న రాపిడ్ యాక్షన్ ఫోర్స్ సంఘటనా స్థలానికి వందగజాల దూరంలోనే ఆందోళనకారులను అడ్డుకుని వెనక్కు పంపించగా రాయపాటి రిబ్బన్ కత్తిరించి పోలీస్ బందోబస్తు మధ్యవెళ్లిపోయారు. అటు తరువాత సాయంత్రం ఎవరూలేని సమయంలో వచ్చిన మంత్రి డొక్కా గుట్టుచప్పుడు కాకుండా కొబ్బరికాయ కొట్టి వెళ్లిపోయారు.