తెలుగు తేజం
మాతృదేశానికి పేరుప్రఖ్యాతులు తేవాలంటే... పెద్దపెద్ద పదవులు, పెద్ద చదువులే కాదు... కండలతోనూ సాధ్యమే... అది కూడా ఉత్ప్రేరకాలు వాడకుండా... ఆరోగ్యకరమైన విధానంతో అంతర్జాతీయ ఖ్యాతి సాధించవచ్చు... అని నిరూపించాడు ఆంధ్రప్రదేశ్ నెల్లూరుజిల్లాకు చెందిన పెనుబల్లి రాజ్‌సేన్.
రాజ్‌సేన్‌కు చిన్నతనం నుంచి క్రీడలంటే అమిత ఆసక్తి. న్యూజిలాండ్ దేశానికి ఎంబిఎ చదవడానికి వెళ్లిన రాజ్‌సేన్... అక్కడి అధ్యాపకుల ప్రోత్సాహంతో దేహదారుఢ్య పోటీల్లో పాల్గొని అంతర్జాతీయ పోటీల్లో నెంబర్ వన్‌గా నిలిచారు. న్యూజిలాండ్‌లో అధ్యాపకులే ‘న్యూజిలాండ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్సు’ లో 2005-06లో శిక్షణ కోసం చేర్పించారు. ‘‘నా శక్తి సామర్థ్యాలు చూసి, అక్కడి మాస్టర్లు ‘బాడీ బిల్డర్స్ పోటీలో పాల్గొంటావా’ అని అడిగారు.
నాకు బాడీ బిల్డింగ్ గురించి అవగాహన ఉంది. అయితే బాడీ బిల్డర్‌గా గెలవడం కోసం చాలామంది ఉత్ప్రేరకాలు వాడతారు. దాంతో దీర్ఘకాలంలో చాలా ప్రమాదం వస్తుంది. నాకు స్టెరాయిడ్స్ వాడటం ఇష్టం లేదనీ, ఎటువంటి ఉత్ప్రేరకాలు వాడకుండా అయితేనే పాల్గొంటానని చెప్పాను. అందుకు వారు అంగీకరించారు. నేచురల్ బాడీ బిల్డింగ్ రంగానికి నన్ను పరిచయం చేశారు. 2006 నుండి పోటీల్లో పాల్గొనడం ప్రారంభించాను’’ అంటూ తన గురించి చెబుతారు రాజ్‌సేన్.
2008లో ప్రపంచ విజేత
తొలి ప్రయత్నంలో న్యూజిలాండ్ స్థాయిలో తృతీయస్థానం అందుకున్నారు. 2006-2010 మధ్య విదేశాల్లో జరిగిన పోటీలో పాల్గొని 11 అవార్డులు గెలుచుకున్నారు. 2008లో సౌత్ పసిఫిక్ నేషనల్ బాడీ బిల్డింగ్‌లో ద్వితీయ బహుమతి దక్కింది. ‘‘అదే ఏడాది యూఎస్‌ఏ నేషనల్ ఒలంపియాడ్ బాడీ బిల్డర్స్ కాంపిటీషన్‌లో పాల్గొనాల్సిందిగా యుఎస్ నుండి ఆహ్వానం అందింది. న్యూజిలాండ్ ప్రభుత్వ ఆర్థిక సాయంతో పాల్గొని మూడో బహుమతి గెలుచుకున్నాను.
2008లోనే లాస్ ఏంజిలిస్ (యూఎస్)లో జరిగిన ప్రపంచ చాంపియన్ షిప్ పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ అందుకున్నాను. ఈ పోటీల్లో పాల్గొన్న ఏకైక భారతీయుడిని. ప్రపంచంలో ప్రథమ బహుమతి పొందడం ఆనందమే, కానీ భారత్ నుండి పాల్గొంటే ఇంకా సంతోషంగా ఉండేది’’ అంటారు రాజ్‌సేన్.
- కొట్రా నందగోపాల్, చెన్నై
కండలతో ఖండాంతర ఖ్యాతి
Published Thu, Jul 10 2014 10:22 PM | Last Updated on Sat, Oct 20 2018 6:04 PM
Advertisement