సమైక్యాంధ్రప్రదేశ్ కోసం ఎన్ని రోజులైనా ఉద్యమిస్తాం
సీమాంధ్ర జిల్లాల్లో ఉద్యోగుల సమర నినాదం..దాదాపు 6 లక్షల మందికి అందని జీతాలు
అయినా వెనుకడుగు వేసేది లేదంటున్న ఉద్యోగులు
జీతం రాకుంటే అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకుంటామంటున్న చిరుద్యోగులు
తాము జీతాలు తీసుకోకుండా ఉద్యమిస్తున్నా.. నేతలు పదవులు వదులుకోవడం లేదని మండిపాటు
...ఒకరిద్దరు కాదు.. సీమాంధ్రలోని 13 జిల్లాల్లో సుమారు 6 లక్షల మంది ఉద్యోగులందరిదీ ఇదే మాట! అందరిదీ సమైక్య నినాదమే!! జీతాలు రాకపోయినా ఫర్వాలేదు.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లక్ష్య పెట్టం.. రాష్ట్రాన్ని మాత్రం సమైక్యంగా ఉంచాల్సిందేనని వారు నినదిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్నప్పట్నుంచీ ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు, ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. నెలరోజులకు పైగా గడచిపోయాయి. సమ్మె కాలానికి ఎవరికీ జీతాలు అందలేదు. ఇందులో నెల జీతం వస్తే తప్ప కుటుంబం గడవని అటెండర్లు, స్వీపర్లు, వాచ్‌మన్ల వంటి చిరుద్యోగులు సైతం ఉన్నారు. స్వీపర్ నుంచి గెజిటెడ్ స్థాయి ఉద్యోగుల వరకు ఉద్యమంలోకి దూకడంతో 13 జిల్లాల్లో పాలన పూర్తిగా స్తంభించింది.
ఉద్యోగులకు జీతాలే కాదు.. అనేక కార్యాలయాలకు తాళాలు పడడంతో ప్రభుత్వం కూడా వేల కోట్లలో ఆదాయాన్ని కోల్పోతోంది. నెలసరి వేతనాలు అందని నేపథ్యంలో 13 జిల్లాల్లోని పలువురు ఉద్యోగులను ‘సాక్షి’ పలకరించింది. ఎవరిని కదిపినా వారు చెబుతోంది ఒక్కటే.. సమైక్యాంధ్రప్రదేశ్ కావాలని, అందుకోసం ఎందాకైనా పోరాడతామని!! తాము జీతాలు కూడా ముట్టకుండా ఉద్యమంలో పాల్గొంటుంటే రాజకీయ నాయకులకు మాత్రం చీమకుట్టినట్టయినా లేదని మండిపడుతున్నారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, పాలక, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రాకుండా పదవులను పట్టుకొని వేలాడుతున్నారని నిప్పులు చెరుగుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు మాత్రం ఠంచనుగా నెల జీతాలు బ్యాంకు ఖాతాల్లో పడుతుండగా.. అసలు జీతాలే తీసుకోకుండా ఉద్యోగులు ఉద్యమ పథంలో నడుస్తుండటం గమనార్హం.
అప్పులు చేస్తాం.. కానీ ఉద్యమాన్ని వీడం
ఒక్క అనంతపురం జిల్లాలోనే 62,130 మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు సమ్మెలో ఉన్నారు. వీరంతా ఆగస్టు నెల జీతాలు తీసుకోలేదు. ఈ ఉద్యోగులకు రూ.147 కోట్లకుపైగా జీతాలు రావాల్సి ఉంది. గుంటూరు జిల్లాలో 27 వేల మంది ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలందలేదు. బిల్లుల తయారు చేసే డీడీవోలు, ట్రెజరీ కార్యాలయాల్లోని ఉద్యోగులు సమ్మె బాట పట్టడంతో ఉద్యోగుల జీతాలకు సంబంధించిన పనులన్నీ స్తంభించిపోయాయి. విధులకు హాజరవుతున్న కొందరు పోలీసు, న్యాయశాఖలకు చెందిన ఉద్యోగులకు మాత్రమే ప్రభుత్వం జీతాలు అందజేసింది. కృష్ణా జిల్లాలో 135 శాఖలకు చెందిన ఉద్యోగులకు సుమారు రూ.85 కోట్ల మేర జీతాల బిల్లులు మంజూరు కాలేదు. మిగతా అన్ని జిల్లాల్లో ఇదే పరిస్థితి ఉంది. జీతాలు రాకుంటే అప్పులైనా చేసి కుటుంబాన్ని పోషించుకుంటాం తప్ప ఉద్యమాన్ని ఆపేది లేదని ఉద్యోగులు స్పష్టం చేస్తున్నారు. ‘మాకు ఈనెల జీతం రాకపోవడంతో అప్పు చేసి బాడుగ, పాలు, గ్యాస్ సిలిండర్ తదితర కుటుంబ అవసరాలు తీర్చుకున్నాం. జీతాలు రాలేదని భయపడితే ఉద్యమంలో పాల్గొనలేం.
అప్పులతోనైనా ఏదో విధంగా కుటుంబాన్ని నెట్టుకొస్తాం తప్ప ఉద్యమాన్ని ఆపే ప్రసక్తే లేదు’ అని కడపకు చెందిన వారాల శ్రీనివాస్ అనే ఉపాధ్యాయుడు చెప్పారు. ‘జీతం రాకుంటే ఎలాగో అలా సర్దుకుంటాం. మాకు సమైక్యాంధ్ర ఉద్యమమే ప్రధానం. వేతనాలు ఇవ్వకపోయినా ఉద్యమాన్ని వీడబోం’ అని గుంటూరుకు చెందిన వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగి ఎస్‌కే బాజిత్ చెప్పారు. ‘జీతం రాకపోవడంతో పిల్లల ఫీజులు కట్టలేకపోయాం. ఇంట్లో చిల్లర ఖర్చు, తల్లిదండ్రుల మందుల ఖర్చు, చిట్‌ఫండ్‌కు చెల్లించాల్సిన వాయిదాలు, రుణాల చెల్లింపులన్నింటికీ జీతంపైనే ఆధారపడ్డాం. అయినా రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సమ్మె చేయాల్సిందే. ఉద్యోగులు తమ జీతాలను పణంగా పెట్టి పోరాటం చేస్తుంటే రాజకీయ నాయకులు కనీసం మద్దతుగా ఉండకపోవడం దారుణం’ అని ప్రకాశం జిల్లా చీమకుర్తికి చెందిన పెద సుబ్బారావు మండిపడ్డారు.
-సాక్షి నెట్‌వర్క్
‘‘నెల జీతం అందితేనే మా ఇల్లు గడుస్తుంది. ఇంటి అద్దె, సరుకులు, పాలు, పిల్లల చదువులు, ఇతర ఖర్చులన్నీ ఆ జీతంతోనే తీరాలి. నెల జీతం అందకపోయినా ఉన్న డబ్బుతో గడుపుతాం. ఇప్పుడు మేం చేస్తున్న సమ్మె మా కోసం కాదు.. ప్రజలందరి కోసం. జీతం కన్నా జీవితాలే ముఖ్యం. ఎన్ని నెలలు జీతాలు ఇవ్వకపోయినా సమైక్యాంధ్ర కోసం పోరాడతాం..’’
- పీవీ రావు, ఆర్టీసీ కండక్టర్, శ్రీకాకుళం జిల్లా
‘‘సమైక్యాంధ్ర ప్రకటన వచ్చేదాకా ఎన్ని కష్టనష్టాలు ఎదుర్కోవడానికైనా మేం సిద్ధం. వేతనాలు ఇవ్వకపోయినా, ఉద్యోగాలు కోల్పోయినా లెక్కచేయం. అప్పులు చేసైనా సమైక్యాంధ్ర కోసం కుటుంబాన్ని పోషించుకుంటూనే ఉద్యమంలో పాల్గొంటాం. మేం జీతాలు తీసుకోకుండా సమ్మె చేస్తున్నా రాజకీయ నాయకులు మాత్రం ఉద్యమంలోకి రాకపోవడం సిగ్గుచేటు’’
- సీహెచ్ రమాదేవి, జెడ్పీ స్కూల్ టీచర్, పశ్చిమగోదావరి జిల్లా
‘‘కుటుంబం నడవాలంటే నెల జీతం రావాలి. ఇప్పటికే అప్పు చేశాను. మరికొంత చేబదులు తీసుకోవాలనుకుంటున్నా. ఈ కష్టం తాత్కాలికమే.. భరిస్తాం. రాష్ట్రం సమైక్యంగా ఉండాలన్నదే నా ఆకాంక్ష. అందుకే సమ్మెలో పాల్గొంటున్నా’’
- ఉజ్జినప్ప, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో అటెండర్, అనంతపురం జిల్లా
ఇప్పుడు వెనుకడుగు వేస్తే అంతే..
‘‘సమైక్యాంధ్ర కోసం ఈ కష్టం తప్పదు. ఎన్ని బాధలైనా భరిస్తాం. కుటుంబ పోషణకు అప్పు చేస్తాను. ఇప్పుడు వెనుకడుగు వేస్తే భవిష్యత్తులో భరించలేని కష్టాలు ఎదురవుతాయి. పిల్లల విద్య, ఉద్యోగాల గురించి తలచుకుంటే భయం వేస్తోంది.
- ఎన్.శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఎ సెక్షన్ ఆఫీస్ సబార్డినేటర్, విశాఖపట్నం
రాష్ట్రం చీలిపోతుందన్న బాధే ఎక్కువుంది..
‘‘నాకు రూ. 3,500 జీతం వస్తుంది. నా జీతంపైనే ఆరుగురు కుటుంబ సభ్యులు ఆధారపడ్డారు. పదేళ్లుగా పనిచేస్తున్నాను. రేషన్‌కార్డుపై వచ్చే బియ్యం చాలవు. పూరింట్లో ఉంటున్నాం. జీతంతోనే ఇంట్లో పాలు, సరుకులు ఇతర అవసరాలు తీర్చాలి. అప్పులు తీర్చాలి. నాతోటి వాళ్లందరిదీ ఇదే పరిస్థితి. ఇన్ని ఇబ్బందులు పడుతున్నా రాష్ట్రం చీలిపోతుందనే బాధే ఎక్కువగా ఉంది. రాష్ట్రం కోసం ఇబ్బందులు ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం’’
- మండ సూరయ్య, గ్రామ సేవకుడు, సింగన్నవలస,
పాలకొండ మండలం, శ్రీకాకుళం జిల్లా
సమైక్యాంధ్ర కోసం తప్పడం లేదు..
‘‘నా పేరు రాజు. నేను సాలూరు ఆర్టీసీ డిపోలో మెకానిక్‌గా పని చేస్తున్నా. నెల జీతం రూ.6500. కుటుంబమంతా నా జీతంపైనే ఆధారపడి జీవిస్తున్నాం. ఈ నెల జీతం రాక ఇంటి అద్దె కూడా చెల్లించలేదు. అమ్మకు మందులు కొనుగోలు చేయడానికి అప్పు చేయూల్సి వచ్చింది. సరుకులు కూడా కొనుగోలు చేయలేదు. సమ్మె వల్ల ఇబ్బందే అరుునా సమైక్యాంధ్ర కోసం తప్పడం లేదు’’
-ఎంవీఎస్‌ఆర్‌సీహెచ్ రాజు, ఆర్టీసీ మెకానిక్, విజయనగరం
ఉద్యమాన్ని ఆపేది లేదు..
‘‘కాంగ్రెస్ అధిష్టానం దుశ్చర్య కారణంగా ఉద్యమించాల్సిన పరి స్థితి వచ్చింది. మా జీతభత్యాలు ప్రభుత్వం ఆపినా, ఎస్మాలు, గిస్మా లు ప్రయోగించినా ఉద్యమాన్ని ఆపేదిలేదు. చివరకు మా కుటుంబాలు నీరు తాగైనా ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తాం. సమైక్యాంధ్ర సాధించే వరకూ వెనుకడుగు వేయం’’
- జీవీ గణేష్‌బాబు, రెవెన్యూ ఉద్యోగి, ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లా