
నిత్యానందరెడ్డి నుంచి వివరాలు సేకరిస్తున్న పోలీసులు
హైదరాబాద్ : అరబిందో ఫార్మా వైస్ ఛైర్మన్ నిత్యానందరెడ్డి నుంచి కాల్పుల ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వరరావు బుధవారం ఆయనను కలిసి వివరాలు తెలుసుకున్నారు. నిత్యానందరెడ్డి మాట్లాడుతూ 'నేను కారులో కూర్చోగానే ఫ్రంట్ డోర్ ద్వారా వచ్చిన ఆగంతకుడు నా గుండెపై గన్ గురి పెట్టి స్టార్ట్ ది కార్ అన్నాడు. నేను వెంటనే గన్ బారెల్ను పైకి లేపాను...అతను వెంటనే పైకి కాల్పులు జరిపాడు. అదే సమయంలో నా వద్ద ఉన్న పిస్టల్ తీసి కాల్పులకు ప్రయత్నించాను.
కొద్దిదూరంలో ఉన్న నా సోదరుడు ప్రసాద్రెడ్డి వచ్చి ఆగంతకుడిని వెనకనుంచి పట్టుకున్నాడు. మా తమ్ముడి చెయ్యి కొరికి ఆగంతకుడు పరారయ్యాడు. సమీపంలో ఉన్న వాకర్స్ చేరుకోవడంతో ఆగంతకుడు ఏకే 47 గన్, బ్యాగు వదిలేసి వెళ్లాడు. నన్ను చంపాల్సిన అవసరం ఎవరికి లేదు...నాకు ఎవరిపైనా అనుమానం లేదు' అన్నారు. కాగా అంతకు ముందు డీసీపీ వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేబీఆర్ పార్క్ వద్ద నిత్యానందరెడ్డిపై గుర్తు తెలియని ఆగంతకుడు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే.