
కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తుపడతా: నిత్యానందరెడ్డి
హైదరాబాద్ : తనపై కాల్పులు జరిపిన వ్యక్తిని గుర్తుపడతానని అరబిందో ఫార్మా వైస్ ప్రెసిడెంట్ నిత్యానందరెడ్డి తెలిపారు. కాల్పులు జరిపిన వ్యక్తి 5.3 అడుగుల ఎత్తు ఉన్నాడని, తాను కారు వద్దకు వచ్చి డ్రైవింగ్ సీట్లో కూర్చోగానే తనపై దుండగుడు కాల్పులకు యత్నించినట్లు ఆయన చెప్పారు.న ప్రాణాపాయం నుంచి తృటిలో బయటపడ్డానని నిత్యానందరెడ్డి తెలిపారు. తనకు ఎవరితో విభేదాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఆగంతకుడు ఎనిమిది రౌండ్ల కాల్పులు జరిపినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళితే బుధవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో మార్నింగ్ వాక్ ముగించుకుని ఆడి కారులో కూర్చుంటున్న సమయంలో ఆగంతకుడు కాల్పులకు యత్నించాడు. దాంతో అప్రమత్తమైన ఆయన తన వద్ద ఉన్న పిస్టల్‌ను బయటికి తీసేందుకు ప్రయత్నించారు. ఏకె 47ను గురిపెట్టి కారును స్టార్ట్ చేయాలని డిమాండ్ చేశాడు. ఈలోగా ... ఆయనతో పాటే ఉన్న నిత్యానందరెడ్డి సోదరుడు ప్రసాద్‌రెడ్డి ఆగంతకుడిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. కాసేపు వారిమధ్య పెనుగులాట జరిగింది.
అయితే ఎలాగైనా తప్పించుకోవాలనుకున్న ఆగంతకుడు, ప్రసాద్‌రెడ్డి చెయ్యిని కొరికి పారిపోయాడు. హడావుడిలో ఏకె 47ను, వెంట తెచ్చుకున్న బ్యాగును ఆగంతకుడు కారులోనే వదిలి పరారయ్యాడు. ఈ కాల్పుల్లో ఎవ్వరికీ గాయాలు కాలేదు. ప్రశాంతమైన పార్క్ సమీపంలో కాల్పులు జరగడంతో .. మార్నింగ్ వాకర్స్ భయాందోళనకు గురయ్యారు. సంఘటనాస్థలాన్ని వెస్ట్ జోన్ డిసిపి వెంకటేశ్వరరావు పరిశీలించారు. ఘటనా స్థలంలో 8 బులెట్లను స్వాధీనం చేసుకున్నారు.