Hyderabad Likely To Get India's Longest Tunnel Road - Sakshi
Sakshi News home page

Hyderabad: ట్రాఫిక్‌ కష్టాలు.. హైదరాబాద్‌లో సొరంగ మార్గానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌

Published Fri, Aug 26 2022 7:49 PM | Last Updated on Fri, Aug 26 2022 8:46 PM

Hyderabad Likely to get Countrys Longest Tunnel Road - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని కేబీఆర్‌ పార్కు చుట్టూ ట్రాఫిక్‌ చిక్కులు తప్పించేందుకు ఉద్దేశించిన సొరంగ మార్గానికి (రోడ్‌టన్నెల్‌) ఫీజిబిలిటీ స్టడీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నాలుగు నెలల క్రితం ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు చేసిన అధికారులు ఫీజిబిలిటీ స్టడీ, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌)ల కోసం కన్సల్టెంట్లను ఆహ్వానిస్తూ అంతర్జాతీయస్థాయి టెండర్లు పిలిచారు. మూడు సంస్థలు బిడ్లు దాఖలు చేయగా ఎల్‌1గా నిలిచిన  ఆర్వీ అసోసియేట్స్‌ ఆర్కిటెక్ట్స్‌ ఇంజినీర్స్‌ అండ్‌ కన్సల్టెంట్స్‌ ప్రై వేట్‌ లిమిటెడ్‌కు పనులు అప్పగిచేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు ప్రభుత్వ ఆమోదం కోసం నివేదించారు. దాదాపు నాలుగు నెలలైనప్పటికీ స్పందన లేకపోవడంతో ఈ ప్రాజెక్టు అటకెక్కినట్లేనని ఒక దశలో భావించారు.  

తాజాగా  ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో తదుపరి కార్యాచరణకు అధికారులు సిద్ధమవుతున్నారు. జీహెచ్‌ఎంసీ ప్రతిపాదనల్ని పరిశీలించిన ప్రభుత్వం ఫీజిబిలిటీ స్టడీ, డీపీఆర్‌లు రెండు దశలుగా చేపట్టాలని ఆదేశించింది. తొలిదశలోని ఫీజిబిలిటీ స్టడీ నివేదిక అందిన అనంతరం ప్రభుత్వం దాన్ని పరిశీలించి అనుమతినిచ్చాకే డీపీఆర్‌ తయారీ చేపట్టాలని సూచించింది. ప్రాజెక్టుకయ్యే వ్యయం, ప్రజలకు కలిగే సదుపాయాలు తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఫీజిబిలిటీ స్టడీ నివేదికను ఆర్నెళ్లలోపు అందించాల్సి ఉంది. అనంతరం డీపీఆర్‌కోసం మరో మూడునెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేశారు. ఫీజిబిలిటీ నివేదిక అందిస్తే సొరంగం తవ్వేందుకు సాధ్యాసాధ్యాలు.. అందుకయ్యే వ్యయం తదితర వివరాలు తెలుస్తాయి.  

చదవండి: ('నువ్వు చస్తే నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని అబార్షన్‌ చేయించుకుంటా')

మేజర్‌ కారిడార్‌లో సాఫీ ప్రయాణం
ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌ నుంచి వయా కేబీఆర్‌ పార్కు ఎంట్రన్స్‌ మీదుగా జూబ్లీహిల్స్‌ రోడ్‌నెంబర్‌ 45 జంక్షన్, అక్కడినుంచి దుర్గం చెరువు వరకు ట్రాఫిక్‌ రద్దీ అత్యధికంగా ఉండే మేజర్‌ కారిడార్‌గా అధికారులు గుర్తించారు. ఈ కారిడార్‌లో కేబీఆర్‌ పార్కు చుట్టూ ట్రాఫిక్‌ ఇబ్బందులు లేకుండా సిగ్నల్‌ ఫ్రీ సాఫీ ప్రయాణానికి సొరంగం మార్గం ఆలోచన చేశారు. రాష్ట్రంలో హైవేమార్గంలో ఇప్పటివరకెక్కడా లేని విధంగా సొరంగమార్గం నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు.

టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌ (టీబీఎం) ద్వారా దీన్ని నిర్మించనున్నారు. టన్నెల్‌ నిర్మాణానికి సంబంధించి అలైన్‌మెంట్, డిజైన్, అప్రోచ్‌ మార్గాలతోపాటు టెక్నికల్, ఎకనామికల్, సోషల్, ఫైనాన్సియల్‌ వయబిలిటీ, ట్రాఫిక్‌ తదితరమైనవి డీపీఆర్, ఫీజిబిలిటీ స్టడీ నివేదికలో వెల్లడిస్తారు. టన్నెల్‌లో క్యారేజ్‌వే ఎన్ని లేన్లలో ఉండాలో కూడా నివేదికలో సూచించనున్నారు.  దేశంలో జమ్మూ కశ్మీర్‌లోని డాక్టర్‌ శ్యామాప్రసాద్‌ ముఖర్జీ టన్నెల్‌ పొడవు 9.20 కి.మీ. ఇప్పటి వరకు అదే అత్యంత పొడవైనది. ముంబైలోనూ రోడ్‌ టన్నెల్‌ నిర్మించేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు అధికారులు పేర్కొన్నారు.   

సొరంగమార్గం 6.3 కి.మీ  
తొలి ప్రతిపాదనల మేరకు దాదాపు 10 కి.మీ మేర సొరంగమార్గం నిర్మించాలనుకున్నప్పటికీ, అనంతరం 6.30 కి.మీకు తగ్గించారు.  

ఆ ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి.. 
►రోడ్‌నెంబర్‌  45 జంక్షన్‌ నుంచి కేబీఆర్‌ పార్కు ఎంట్రన్స్‌ జంక్షన్‌ వరకు : 1.70 కి.మీ. 
►రోడ్‌నెంబర్‌ 12 నుంచి టన్నెల్‌ జాయినింగ్‌ పాయింట్‌ వరకు: 1.10 కి.మీ. 
►కేబీఆర్‌ ఎంట్రెన్స్‌ నుంచి ఎన్‌ఎఫ్‌సీఎల్‌ జంక్షన్‌ వరకు: 2 కి.మీ. 
►మూడు అప్రోచెస్‌ 0.50 కి.మీ చొప్పున 1.5 కి.మీ.    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement