Tunnel Path
-
Hyderabad: హైదరాబాద్‌లో సొరంగ మార్గానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ చిక్కులు తప్పించేందుకు ఉద్దేశించిన సొరంగ మార్గానికి (రోడ్‌టన్నెల్) ఫీజిబిలిటీ స్టడీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. నాలుగు నెలల క్రితం ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు చేసిన అధికారులు ఫీజిబిలిటీ స్టడీ, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ల కోసం కన్సల్టెంట్లను ఆహ్వానిస్తూ అంతర్జాతీయస్థాయి టెండర్లు పిలిచారు. మూడు సంస్థలు బిడ్లు దాఖలు చేయగా ఎల్1గా నిలిచిన ఆర్వీ అసోసియేట్స్ ఆర్కిటెక్ట్స్ ఇంజినీర్స్ అండ్ కన్సల్టెంట్స్ ప్రై వేట్ లిమిటెడ్‌కు పనులు అప్పగిచేందుకు జీహెచ్ఎంసీ అధికారులు ప్రభుత్వ ఆమోదం కోసం నివేదించారు. దాదాపు నాలుగు నెలలైనప్పటికీ స్పందన లేకపోవడంతో ఈ ప్రాజెక్టు అటకెక్కినట్లేనని ఒక దశలో భావించారు. తాజాగా ప్రభుత్వం నుంచి అనుమతి లభించడంతో తదుపరి కార్యాచరణకు అధికారులు సిద్ధమవుతున్నారు. జీహెచ్ఎంసీ ప్రతిపాదనల్ని పరిశీలించిన ప్రభుత్వం ఫీజిబిలిటీ స్టడీ, డీపీఆర్‌లు రెండు దశలుగా చేపట్టాలని ఆదేశించింది. తొలిదశలోని ఫీజిబిలిటీ స్టడీ నివేదిక అందిన అనంతరం ప్రభుత్వం దాన్ని పరిశీలించి అనుమతినిచ్చాకే డీపీఆర్ తయారీ చేపట్టాలని సూచించింది. ప్రాజెక్టుకయ్యే వ్యయం, ప్రజలకు కలిగే సదుపాయాలు తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని ముందుకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఫీజిబిలిటీ స్టడీ నివేదికను ఆర్నెళ్లలోపు అందించాల్సి ఉంది. అనంతరం డీపీఆర్‌కోసం మరో మూడునెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేశారు. ఫీజిబిలిటీ నివేదిక అందిస్తే సొరంగం తవ్వేందుకు సాధ్యాసాధ్యాలు.. అందుకయ్యే వ్యయం తదితర వివరాలు తెలుస్తాయి. చదవండి: ('నువ్వు చస్తే నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకొని అబార్షన్ చేయించుకుంటా') మేజర్ కారిడార్‌లో సాఫీ ప్రయాణం ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ నుంచి వయా కేబీఆర్ పార్కు ఎంట్రన్స్ మీదుగా జూబ్లీహిల్స్ రోడ్‌నెంబర్ 45 జంక్షన్, అక్కడినుంచి దుర్గం చెరువు వరకు ట్రాఫిక్ రద్దీ అత్యధికంగా ఉండే మేజర్ కారిడార్‌గా అధికారులు గుర్తించారు. ఈ కారిడార్‌లో కేబీఆర్ పార్కు చుట్టూ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సిగ్నల్ ఫ్రీ సాఫీ ప్రయాణానికి సొరంగం మార్గం ఆలోచన చేశారు. రాష్ట్రంలో హైవేమార్గంలో ఇప్పటివరకెక్కడా లేని విధంగా సొరంగమార్గం నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. టన్నెల్ బోరింగ్ మెషీన్ (టీబీఎం) ద్వారా దీన్ని నిర్మించనున్నారు. టన్నెల్ నిర్మాణానికి సంబంధించి అలైన్మెంట్, డిజైన్, అప్రోచ్ మార్గాలతోపాటు టెక్నికల్, ఎకనామికల్, సోషల్, ఫైనాన్సియల్ వయబిలిటీ, ట్రాఫిక్ తదితరమైనవి డీపీఆర్, ఫీజిబిలిటీ స్టడీ నివేదికలో వెల్లడిస్తారు. టన్నెల్లో క్యారేజ్‌వే ఎన్ని లేన్లలో ఉండాలో కూడా నివేదికలో సూచించనున్నారు. దేశంలో జమ్మూ కశ్మీర్‌లోని డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ టన్నెల్ పొడవు 9.20 కి.మీ. ఇప్పటి వరకు అదే అత్యంత పొడవైనది. ముంబైలోనూ రోడ్ టన్నెల్ నిర్మించేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు ప్రారంభించినట్లు అధికారులు పేర్కొన్నారు. సొరంగమార్గం 6.3 కి.మీ తొలి ప్రతిపాదనల మేరకు దాదాపు 10 కి.మీ మేర సొరంగమార్గం నిర్మించాలనుకున్నప్పటికీ, అనంతరం 6.30 కి.మీకు తగ్గించారు. ఆ ప్రతిపాదనలు ఇలా ఉన్నాయి.. ►రోడ్‌నెంబర్ 45 జంక్షన్ నుంచి కేబీఆర్ పార్కు ఎంట్రన్స్ జంక్షన్ వరకు : 1.70 కి.మీ. ►రోడ్‌నెంబర్ 12 నుంచి టన్నెల్ జాయినింగ్ పాయింట్ వరకు: 1.10 కి.మీ. ►కేబీఆర్ ఎంట్రెన్స్ నుంచి ఎన్ఎఫ్సీఎల్ జంక్షన్ వరకు: 2 కి.మీ. ►మూడు అప్రోచెస్ 0.50 కి.మీ చొప్పున 1.5 కి.మీ. -
ఢిల్లీ అసెంబ్లీ నుంచి ఎర్రకోటకు రహస్య సొరంగం
Secret Tunnel In Delhi: ఢిల్లీ శాసనసభ వద్ద రహస్యం సొరంగాన్ని గుర్తించారు. ఈ సొరంగం శాసనసభ నుండి ఎర్రకోటను కలుపుతుందని ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ వెల్లడించారు. స్వాతంత్య్ర సమర యోధులను తరలించేందుకు అప్పట్లో బ్రిటీస్ పాలకులు దీన్ని వినియోగించేవారని తెలిపారు. స్వాతంత్య్ర పోరాటంలో ఈ ప్రదేశం చాలా గొప్ప చరిత్రను కలిగి ఉన్న దీన్ని పర్యాటకులు ,సందర్శకుల కోసం దీనిని పునరుద్ధరించాలని భావిస్తున్నామని ఆయన చెప్పారు. 1993లో తాను ఎమ్మెల్యేగా గెలిచిన సమయంలో ఎర్రకోట వరకు వెళ్లే సొరంగం ఉందని వార్తలు వినిపించాయి. దాని చరిత్రను వెతకడానికి ప్రయత్నించాను. కానీ దానిపై ఎటువంటి స్పష్టత లభించలేదని గోయల్ తెలిపారు. అయితే ఆ సొరంగ ద్వారం ఇప్పుడు బయటపడిందని, మెట్రో ప్రాజెక్టులు, మురుగు నీటి వ్యవస్థల కారణంగా ఈ సొరంగ మార్గాన్ని మరింత తవ్వే ఉద్దేశం లేదని అన్నారు. 1912లో కోల్‌కతా నుండి దేశ రాజధానిని ఢిల్లీకి మార్చిన తర్వాత, అక్కడ అసెంబ్లీని 1926లో కోర్టుగా మార్చారని, స్వాతంత్య సమర యోధులను కోర్టుకు తీసుకువచ్చేందుకు బ్రిటీషర్లు ఈ సొరంగాన్నే వినియోగించేవారని చెప్పారు. ఉరిశిక్షలకు ఉపయోగించే గది ఉందని తెలుసు కానీ దాన్నేప్పుడూ తెరవలేదన్నారు. 75 వసంతాల స్వాతంత్ర్య ఉత్సవాల సందర్భంగా వారికి నివాళిగా ఆ గదిని స్వాతంత్య్ర సమరయోధుల మందిరంగా మార్చాలని తాము భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఢిల్లీ శాసన సభకు చరిత్ర ఉన్న నేపథ్యంలో వచ్చే ఏడాది స్వతంత్య్ర దినోత్సవ వేడుకల నాటికి ఈ గదిని పర్యాటకుల కోసం తెరచి ఉంచాలని భావిస్తున్నానని చెప్పారు. ఇప్పటికే సంబంధిత పనులను ప్రారంభించినట్టు ఆయన వెల్లడించారు. A tunnel-like structure discovered at the Delhi Legislative Assembly. "It connects to the Red Fort. There is no clarity over its history, but it was used by Britishers to avoid reprisal while moving freedom fighters," said Delhi Assembly Speaker Ram Niwas Goel (2.09) pic.twitter.com/OESlRYik69 — ANI (@ANI) September 2, 2021 -
విసిరే ప్రతీ రాయితో అస్థిరత
శ్రీనగర్: దారితప్పిన కశ్మీరీ యువత విసిరే ప్రతీ రాయి, వాడే ప్రతీ ఆయుధం కశ్మీర్ రాష్ట్రంతోపాటు దేశాన్ని కూడా అస్థిరపరుస్తాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ అస్థిరత్వం నుంచి రాష్ట్రాన్ని బయటకు తెచ్చేందుకు అభివృద్ధి పథంలో నడవాలని పిలుపునిచ్చారు. మోదీ శనివారం కశ్మీర్లో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపాటు మరికొన్ని పూర్తయిన ప్రాజెక్టులను దేశానికి అంకితమిచ్చారు. ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ 25 వేల కోట్ల రూపాయలు. పర్యటనలో భాగంగా బౌద్ధ సన్యాసి 19వ కుషోక్ బకులా రింపోచె శత జయంతి ఉత్సవాల ముగింపు సభలో మోదీ ప్రసంగించారు. రింపోచె రాష్ట్రంలో ఎమ్మెల్యేగా, మంగోలియాకు రాయబారిగా కూడా పనిచేశారు. యువత అభివృద్ధి పథంలో నడవాలి.. రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా కొన్ని విదేశీ శక్తులు అడ్డుకుంటున్నాయని మోదీ అన్నారు. యువత తమ భవిష్యత్తు కోసం, రాబోయే తరాల భవిష్యత్తు కోసం అభివృద్ధిలో భాగం కావాలని కోరారు. కశ్మీర్‌లోని గురేజ్‌లో నిర్మించిన 330 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన కిషన్‌గంగ ప్రాజెక్టును మోదీ దేశానికి అంకితమిచ్చారు. 42 కి.మీ.ల పొడవుతో శ్రీనగర్ రింగురోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కశ్మీర్ అభివృద్ధిలో పర్యాటక రంగానిది కీలక పాత్ర అనీ, అందుకే పర్యాటకులను ఆకర్షించేందుకు వెడల్పైన రోడ్లు, నిత్యం విద్యుత్తు సరఫరా, విమాన సేవలు తదితర సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. ఆసియాలోనే అత్యంత పొడవైన సొరంగం కశ్మీర్ పర్యటనలో భాగంగా మోదీ జోజిలా సొరంగ మార్గం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తయితే ఇది ఆసియాలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గంకానుంది. లేహ్ ప్రాంతాన్ని మిగతా దేశంతో కలిపేందుకు ఈ సొరంగం బాగా ఉపయోగపడుతుంది. కశ్మీర్‌లోని ఎత్తైన పర్వత కనుమల్లో ఒకటైన జోజిలా.. శ్రీనగర్–కార్గిల్–లేహ్ జాతీయ రహదారిపై, సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో ఉంది. శీతాకాలంలో భారీగా మంచు కురుస్తుంది కాబట్టి ఈ రహదారిని మూసేస్తారు. దీంతో లడఖ్ ప్రాంతానికి రాకపోకలు సాధ్యపడవు. ఈ ఆటంకాన్ని అధిగమించేందుకు 14.15 కిలోమీటర్ల పొడవుతో, రెండు వరసల రహదారితో ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. దీని నిర్మాణం కారణంగా జోజిలా పర్వత ప్రాంతంలో ప్రస్తుతం ప్రయాణానికి మూడున్నర గంటలు పడుతుండగా.. సొరంగం నిర్మాణం పూర్తయ్యాక అది 15 నిమిషాల్లోనే పూర్తవుతుంది. జమ్మూలోనూ పర్యటించిన మోదీ అక్కడి వైష్ణోదేవి ఆలయానికి చేరుకునేందుకు కొత్తగా తారాకోట మార్గాన్ని ప్రారంభించారు. ఓ విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. -
శిష్యురాళ్ల హాస్టల్‌కు సొరంగ మార్గం
► రహస్యంగా ఏర్పాటు చేసుకున్న గుర్మీత్ బాబా ► హింసకు ప్రేరేపించిన ఇద్దరు అరెస్టు చండీగఢ్: హరియాణాలోని డేరా సచ్చా సౌదా బాబా గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్ తన నివాసం నుంచి శిష్యురాళ్ల వసతి గృహం వద్దకు ఏర్పాటు చేసుకున్న సొరంగ మార్గం శనివారం వెలుగులోకి వచ్చింది. ఫైబర్ గ్లాస్‌తో నిర్మించిన, బాబా నివాసం నుంచి ఐదు కిలోమీటర్ల పొడవున్న మరో సొరంగాన్ని కూడా అధికారులు గుర్తించారు. పంచకులలో 800 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ డేరాలో పంజాబ్, హరియాణా హైకోర్టు ఆదేశాలతో అధికారులు సోదాలు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. అక్రమ టపాసుల తయారీ కేంద్రం, ఏకే–47 తుపాకీ బుల్లెట్ల ఖాళీ డబ్బాలను అధికారులు గుర్తించారు. 84 డబ్బాల టపాసులు, టపాకాయల తయారీకి వాడే రసాయనాలు తదితరాలను అధికారులు కొనుగొన్నారు. రిజిస్ట్రేషన్ కాని ఓ విలాసవంతమైన కారు, కొన్ని పాత రూ.500, రూ.1,000 నోట్లను కూడా అధికారులు సోదాల్లో గుర్తించారు. కంప్యూటర్ హార్డ్‌డిస్క్‌లు, పేరు ముద్రించని కొన్ని ఔషధాలను స్వాధీనం చేసుకుని కొన్ని గదులను సీజ్ చేశారు. డేరా ప్రధాన కేంద్రానికి వచ్చే రోడ్లపై కర్ఫ్యూ కొనసాగుతోంది. గుర్మీత్‌ను ఆగస్టు 25న సీబీఐ కోర్టు అత్యాచార కేసులో దోషిగా తేల్చింది. గుర్మీత్ మద్దతుదారులను హింసకు పురిగొల్పినందుకుగాను డేరా ఇన్చార్జ్ చామ్‌కౌర్, మరో కీలక డేరా అధికారి దాన్ సింగ్‌లను అరెస్టు చేశామని పంచకుల డీసీపీ చెప్పారు.