కిషన్‌గంగ జలవిద్యుత్ ప్రాజెక్టును రిమోట్ ద్వారా ప్రారంభిస్తున్న మోదీ
శ్రీనగర్: దారితప్పిన కశ్మీరీ యువత విసిరే ప్రతీ రాయి, వాడే ప్రతీ ఆయుధం కశ్మీర్ రాష్ట్రంతోపాటు దేశాన్ని కూడా అస్థిరపరుస్తాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ అస్థిరత్వం నుంచి రాష్ట్రాన్ని బయటకు తెచ్చేందుకు అభివృద్ధి పథంలో నడవాలని పిలుపునిచ్చారు. మోదీ శనివారం కశ్మీర్‌లో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపాటు మరికొన్ని పూర్తయిన ప్రాజెక్టులను దేశానికి అంకితమిచ్చారు. ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ 25 వేల కోట్ల రూపాయలు. పర్యటనలో భాగంగా బౌద్ధ సన్యాసి 19వ కుషోక్ బకులా రింపోచె శత జయంతి ఉత్సవాల ముగింపు సభలో మోదీ ప్రసంగించారు. రింపోచె రాష్ట్రంలో ఎమ్మెల్యేగా, మంగోలియాకు రాయబారిగా కూడా పనిచేశారు.
యువత అభివృద్ధి పథంలో నడవాలి..
రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా కొన్ని విదేశీ శక్తులు అడ్డుకుంటున్నాయని మోదీ అన్నారు. యువత తమ భవిష్యత్తు కోసం, రాబోయే తరాల భవిష్యత్తు కోసం అభివృద్ధిలో భాగం కావాలని కోరారు. కశ్మీర్‌లోని గురేజ్‌లో నిర్మించిన 330 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన కిషన్‌గంగ ప్రాజెక్టును మోదీ దేశానికి అంకితమిచ్చారు. 42 కి.మీ.ల పొడవుతో శ్రీనగర్ రింగురోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కశ్మీర్ అభివృద్ధిలో పర్యాటక రంగానిది కీలక పాత్ర అనీ, అందుకే పర్యాటకులను ఆకర్షించేందుకు వెడల్పైన రోడ్లు, నిత్యం విద్యుత్తు సరఫరా, విమాన సేవలు తదితర సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు.
ఆసియాలోనే అత్యంత పొడవైన సొరంగం
కశ్మీర్ పర్యటనలో భాగంగా మోదీ జోజిలా సొరంగ మార్గం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తయితే ఇది ఆసియాలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గంకానుంది. లేహ్ ప్రాంతాన్ని మిగతా దేశంతో కలిపేందుకు ఈ సొరంగం బాగా ఉపయోగపడుతుంది. కశ్మీర్‌లోని ఎత్తైన పర్వత కనుమల్లో ఒకటైన జోజిలా.. శ్రీనగర్–కార్గిల్–లేహ్ జాతీయ రహదారిపై, సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో ఉంది. శీతాకాలంలో భారీగా మంచు కురుస్తుంది కాబట్టి ఈ రహదారిని మూసేస్తారు. దీంతో లడఖ్ ప్రాంతానికి రాకపోకలు సాధ్యపడవు. ఈ ఆటంకాన్ని అధిగమించేందుకు 14.15 కిలోమీటర్ల పొడవుతో, రెండు వరసల రహదారితో ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. దీని నిర్మాణం కారణంగా జోజిలా పర్వత ప్రాంతంలో ప్రస్తుతం ప్రయాణానికి మూడున్నర గంటలు పడుతుండగా.. సొరంగం నిర్మాణం పూర్తయ్యాక అది 15 నిమిషాల్లోనే పూర్తవుతుంది. జమ్మూలోనూ పర్యటించిన మోదీ అక్కడి వైష్ణోదేవి ఆలయానికి చేరుకునేందుకు కొత్తగా తారాకోట మార్గాన్ని ప్రారంభించారు. ఓ విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment